వేలంవెఱ్ఱి కథ
అబ్బాయిలూ, అమ్మాయిలూ! మీకు ఈ కథ తెలుసునా? పోనీ నేచెప్తా వినండి. అనగా, అనగా, ఒకవూరిలో, ఒక రాజూ, మంత్రీ వుండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజున రాజు మంత్రిని పిలిచి, “వేలంవెఱ్ఱి అంటె ఏమిటి” అని అడిగాడు.
మంత్రి ఏమి చెప్పుతాడు? అందుకని రాజుగారితో “రెండు రోజులు గడువివ్వండి చూపిస్తాను” అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానంచేసి, వీబూది పెట్టుకుని, వూరి చివర కంచర గాడిదలు వుంటే, వకదానికి మూడు ప్రదక్షిణాలుచేసి, ఒక వెంట్రుక పీకి చెవులో పెట్టుకున్నాడు. ఆ గాడిద కలవాళ్లు, వూళ్లోవున్న తదితరులు “యేమిటీ బాబూ అలా చేశారు” అని అడిగారు.
ఈగాడిద “మధుర నుంచి వచ్చింది. దీనికాళ్లు వసుదేవుడు పట్టుకున్నాడు. అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను” అని మంత్రి అన్నాడు. ఆ మాట విని వూరంతా ఒక్కరొక్కరే వెళ్ళటం మూడు ప్రదక్షణాలు చేసి దాని వెంట్రుక వొకటి పీకి చెవులో పెట్టుకోటం మొదలుపెట్టారు.
ఇల్లా చెయ్యటంతో ఆ గాడిద బొచ్చంతా ఊడి చావుకు సిద్ధం అయింది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్లి మూడు ప్రదక్షణాలు చేసి ఒక వెంట్రుక పీకినాడు.
దానితో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కలవాళ్లు, “మాబ్రతుకు ఈ గాడిదతోనే వున్నది. మీ చేతులలో చచ్చిపోయింది. దీని ఖరీదు ఇవ్వ” మన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, ఇదేమిటి ఇల్లా వచ్చింది అని అడిగాడు. అప్పుడు మంత్రి అన్నాడుకదా! “మీరు వేలం వెట్టి అంటె యేమిటని అడిగారు. దానికి నోటితో సమాధానం చెపితే మీకు నచ్చేది కాదు. అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను” అని అన్నాడు. రాజు, మంత్రి తెలివికి సంతోషించాడు.
గాడిదవాళ్లకు కొంత సొమ్ము ఇచ్చి వాళ్లను పంపించేశారు. కధ కంచికి, మనం ఇంటికి.