బుడతడు
అనగనగా ఒకవూళ్లో పేర్రాసి పెద్దమ్మవుంది. ఆమెకి నలుగురు కొడుకులు. ఆ నలుగురూ వేటకెళ్ళారు. వాళ్ళకి ఓ అడివిపంది కనిపించింది. వాళ్లని చూసి ఆ పంది. “నన్ను చంపకండి. నేను చెప్పేమాట వినండి. ఇక్కడ నాలుగు కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లుతాగి వొచ్చేలోపల ‘వాటిని మీరు ఎత్తితే నన్ను చంపండి. ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను” అంది. “ఓస్. ఇదెంతపనిః వెళ్లిరా” అన్నారు వాళ్లు. కాని ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ల నలుగుర్నీ మింగేసింది.
తనకొడుకులు తిరిగిరాలేదని, పేర్రాసి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకు పడుకుంది. తెల్లారేప్పటికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, ‘అమ్మా, నేను వేటకెడతాను’ అన్నాడు. ‘మీ నలుగురన్నలూ వేటకు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళని అడివిపంది మింగింది. నిన్నూ మింగుతుంది: వెళ్ళవొద్దని ఏడ్చింది. ఆ పేర్రాసి పెద్దమ్మ . కాని బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకుని అడివికి వెళ్ళాడు. అక్షడన్నల్ని మింగిన అడివి పంది కనిపించి, “నన్ను చంపకు. నేను నీళ్లుతాగి వొచ్చేప్పటికి నాలుగు కుంచాల వరహాలు ఎత్తితే నన్ను చంపు” అంది. బుడతడు సరేనని దానిముందే నిమిషంలో నాలుగు కుంచాల వరహాల్నీ ఎత్తి, పందిని మధ్యకి నరికాడు. నలుగురన్నలూ పంది పొట్టలోంచి బైటపడ్డారు. బుడతణ్ణిచూసి, అసహ్యపడి గొయ్యితీసి, వాణ్ణి గోతిలో కప్పెట్టారు. కప్పిపెట్టి ఇంటికెళ్లారు. “మీ తమ్ముడేడి?” అని ఏడ్చింది పెద్దమ్మ.
“వాడా? ఆ బుడతడా మాతమ్ముడు? వాణ్ణి గొయ్యితీసి గోతిలో పాతిపెట్టేశాము” అన్నారు వాళ్లు. “అయ్యో, ఎంత పొరపాటు చేశారురా వాడే మీ తమ్ముడు. గొయ్యితవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి” అంది వాళ్లతల్లి. సరే నని వాళ్లు అడివికి వెళ్లి బుడతణ్ణి తవ్వి ఇంటికి తీసుకొచ్చారు.
పేర్రాసి పెద్దమ్మ బూరెలు వొండి నలుగురు కొడుకులకి పెట్టి, బుడతడికి మాత్రం పేడబూరెలు వొండిపెట్టింది. బుడతడు నలుగురన్నలూ దగ్గిర నాలుగు బూరెలు అడుక్కుని హాయిగా తింటూపోయినాడు. దోవలో బూరెలోంచి ఓ శనగపప్పు కిందపడ్డది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు. మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు. పెద్ద వృక్షమయింది. పువ్వు పుయ్యాలి, బూరెలు పండాలి అన్నాడు. పండింది. హాయిగా ఆ చెట్టునెక్కి బూరెలు తింటున్నాడు.
ఆ దోవన ఓ రాజుకూతురు వెడుతోంది. బూరెల్నిచూసి ఆ అమ్మాయికి నోరూరింది. ‘నాకోబూరె పెట్టవా’ అంది రాచకన్య. “నోటితో పెడితే నోరెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి. కన్నుతో పెడితే కన్నెంగిలి. ఎట్టా పెట్టను?” అన్నాడు బుడతడు. “నీతల వెంట్రుకతో పెట్టు” అంది ఆమె. ఆ తలవెంట్రుకతో పాటు బుడతడుకూడా ఆమెవొళ్లోకి జారి, ఆమె గుర్రంమీద ఆమెవొళ్లో స్వారిచేస్తూ హాయిగా వెళ్ళి పోయినాడు.