బండ రాముడు – 1

బండరాముడూ, ఒరే బండరాముడూ!
నేను బడికి పోతుండగా ఎవరో వెనకనించి పిలిచారు. వెనక్కు తిరిగి చూతునుగదా, గోపి. వాడు అయిదో క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకూ వాడికీ సావాసం లేదు. అయినా వాడు నా సంగతి వినిఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగనివాళ్లెవరు? మేష్టార్లుకూడా నన్ను గురించి మాట్లాడుకుంటారుట.

గోపి నన్ను కలుసుకుని, “ఒరే, మామిడికాయలు దొంగిలింతామా? మన దారిలోనే గోడమీదికి వాలి ఒక మామిడి చెట్టుంది. దానికాయలు బలే బాగుంటాయి. కోసుకుందామా?” అన్నాడు.
“నేను దొంగతనాలు చేయను. మా నాన్నకు తెలిస్తే చితకబొడుస్తాడు,” అన్నాను నేను.
“నువ్వు దొంగతనం చేయవద్దులే. నీకంత భయమైతే, నేనే చేస్తా. నువ్వు ఊరికే తోడుండు,” అన్నాడు గోపి.

గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్లటానికి ఒప్పుకున్నాను. మామిడితోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి.
“నువ్వు గోడకు ఆనుకుని నిలబడు. నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను. కాయల్లో నీకూ భాగం పెడతా,” అన్నాడు గోపి.
తప్పే దేముంది? నేను ఒప్పుకోనన్నాను. గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ల చేత తన్నులు తిన్నా గౌరవం. ఈ వెధవ చేత తన్నులెందుకు తినాలి? అందుకే ఒప్పుకున్నాను.

నేను గోడకు ఆనుకుని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా, పుస్తకాల సంచీ నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తరువాత దిగివచ్చి ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్లిపోయాడు. నేను వెంటపడి నా భాగం అడిగాను.
వాడు పళ్లికిలించి, “పోరా, పో! నువ్వు నా గుర్రానివి. గుర్రాలకు మామిడి పళ్లు పెడతారా ఏమిటి?” అన్నాడు. ఇదంతా మా క్లాసు పిల్లలెవరో చూశారు.
ఆరోజునుంచి నాకు మా బడిపిల్లలు “గోపిగాడి గుర్రం” అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందే.

ఈ సంగతి మా నాన్నకూ ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను.

కొన్ని రోజుల తరువాత ఒకనాడు మధ్యాహ్నం మా మేష్టారు నన్ను పిలిచి, “రాముడూ, కాఫీ హోటలుకు వెళ్లి రెండు మసాలా వడలూ, రెండు దోసెలూ కట్టించుకో. పచ్చడి మరిచిపొయ్యేవు సుమా. ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకుని వేగిరంగా పట్టుకురా… ఇదుగో రూపాయి,” అన్నారు.

సరేనని నేను కాఫీ హోటలుకు దౌడుతీశాను. బడిగేటు దగ్గిర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు మూడో క్లాసు చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బడిలో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడువాళ్లంతా సెకండ్ ఫారం చదువుతుంటే, వాడు ప్రతిసూ మూడేసి దండ యాత్రలు చేస్తూ ఉండేవాడు. చదువులో వాడు నాకన్నా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరిన వాడు.

వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి, “నా వెంట రా. మీ మేష్టారు గారికి కావలసిన ఫలహారాలన్నీ ఖర్చులేకుండా ఇప్పిస్తాను. పైగా మనం కూడా ఉచితంగా ఫలహారం చేద్దాం,” అన్నాడు.

కిష్టాయికేం? జమీందారు బిడ్డ. వాడి దగ్గర టోలెడంత డబ్బుంటుంది. నాకు మావాళ్లు ఎప్పుడూ కానికిమించి ఇవ్వరు. ఆదైనా ఎప్పుడో గాని ఇవ్వరు. కిష్టాయి నేనూ కలిసి “చంద్ర భవన్” హోటలుకు వెళ్లాం. ఠీవిగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడి ఎదురుగా నేనూ ఒక కుర్చీలో కూర్చున్నాను.
దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామూన్, ఉల్లిగారెలూ, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలేదు. బలే బాగున్నాయి. మా ఫలహారం అయిపోగానే కిష్టాయి మేష్టారుకి కోసం రెండు వడలూ, రెండు దోసెలూ, ఒక కప్పు కాఫీ ఆర్డర్ చేశాడు.

తర్వాత వాడు డబ్బు తీసుకునే యజమాని దగ్గరికి వెళ్లి, “మా మేష్టారు మమ్మల్ని ఫలహారం చేసిరమ్మనీ, తనకు ఫలహారం తెమ్మనీ చెప్పారు. ఈ ఫలహారం ఆయనకు ఇచ్చి నేను డబ్బు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు,” అని చెప్పాడు. నా దగ్గిరికొచ్చి రహస్యంగా, “నీ దగ్గర ఉన్న రూపాయి నా కిచ్చేయి. మిగతా డబ్బు నేను వెసుకుని బాకీ తీర్చేస్తాను,” అన్నాడు.

నా దగ్గర ఉన్న రూపాయి వాడికి ఇచ్చేశాను. వాడా రూపాయి జేబులో వేసుకుని నన్ను అక్కడే కూర్చోమని చెప్పి, మేష్టారుకు ఫలహారం పట్టుకుని బయలుదేరాడు.

కిష్టాయికోసం చూస్తూ చూస్తూ విసిగిపోయాను. మూడు గంటలైనా వాడు రాడు. హోటల్ యజమాని విసిగిపోయి నన్ను బెదిరించి, “డబ్బు ఇవ్వలేకపోతే పోలీసులకు అప్పగిస్తాను,” అన్నాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిష్టాయిగాడు మోసం చేశాడు. నేను మొద్దువెధవను గనక నన్ను అందరూ మోసం చేస్తారు. మేష్టారు ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

హోటల్ యజమాని నా వెంట నౌకరున్ని పంపి, డబ్బు తెప్పించాడు. బడికి చేరగానే మేష్టారికి జరిగిన సంగతి చెప్పాడు. మేష్టారు చాలా కోపంగా కిష్టాయిని వెతికినా వాడు క్లాసులో లేడు. హోటల్ యజమానికి రెండు రూపాయిలు చెల్లించి, సాయంత్రం కిష్టాయిని శిక్షించేందుకు వాడి నాన్నగారి ఇంటికి వెళ్లాడు. జమీందారు గారు వాడిని కఠినంగా శిక్షిస్తానని చెప్పారు.

ఈ సంఘటన తర్వాత బండరాముడు అల్లరి పిల్లలతో సావాసం చేయడం పూర్తిగా మానేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *