దెయ్యం అరుపు

చందమామ గారి కోడళ్లూ,

మీకొక తమాషా చెబుతా వినండి.

నే చెప్పేది అది నా చిన్నప్పటి సంగతి. నాకప్పటికి ఆరేండ్లు వుంటాయి. రెండవ క్లాస్ చదువుతున్నా గరల్స్ స్కూల్లో నాతోనే మాపక్కింటి లక్ష్మి కూడా చదువుతోంది. నాకంటె దానికి వయసు 2 ఏండ్లు జాస్తి వుంటుంది. అది కొంచం బడాయి చేస్తూంటుంది ఎప్పుడూ. తనకు తెలీనివన్నీ తెలుసు అని చెబుతుండేది. వాళ్ళూ మేము వొక ఇంటోనే ఉండేవాళ్లం. ఇంటో మాకు అడ్డగోడ ఉన్నా వరండాలో గోడ అడ్డంలేదు. అందువల్ల ఎక్కువసేపు మే మిద్దరము వరండాలోనే గడిపేవాళ్లం. మాతోకూడా ముసలి తాతవొకడు.

లక్ష్మికీ నాకూ ప్రాణస్నేహం. వొకేసారి బడికెళ్లడం వొకేసారి భోంచేయడం. బయట వరండాలో కూర్చుని కధలు చెప్పమని తాత ప్రాణాలు తీసేవాళ్ళం, తాత హుషారుగావుంటే రోజుకు 2, 3 కథలు చెప్పేవాడు. లేదంటే వొక్క కథ. అసలు చెబితేచాలు అనుకునేవాళ్లం మేమిద్దరం. వొకసారి ఖర్మంచాలక దయ్యాల కథ చెప్పాడు తాత, ఆకధలో వొక దయ్యం రాత్రిపూట వచ్చి వొక పిల్లను ఎత్తుకుపోయింది. తెల్ల వారేసరికి ఆపిల్ల చెరువుగట్టున కూర్చొని ఏడుస్తోంది. తర్వాత వాళ్ళవాళ్లు వచ్చి ఆ అమ్మాయిని యింటికి తీసికెళ్లారు. కాని మర్నాడు ఆ పిల్లను మళ్ళీ దయ్యం ఎత్తుకెళ్ళి చెరువుగట్టున వదిలిందట. ఇట్లా ఎన్నిసార్లో చేసిందట.

ఆ కథ మేమిద్దరం విన్నాం. లక్ష్మి నా కంటె రెండేళ్లు పెద్దదైనందువల్లో, మరి దానికి నాకంటె ధైర్యం జాస్తి అవడం వల్లనో తెలీదుకాని అది భయపడలా నేను మాత్రం ఆకథ విన్నది మొదలు నా నీడ చూచుకొని దయ్యమే అనుకుని భయపడేదాన్ని ఎక్కడికి వెళ్ళినా వెంట దయ్యం వస్తున్నట్లు అనుకునేదాన్ని వొంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు.

‘వొకరోజు రాత్రి 8 గం. కూడా కాలేదు. దాహం ఐతే లోపలికెళ్లాను. వొకమూల చాపలు అన్నీ కట్టగా వేసివున్నాయి, ఆ చోటంతా చీకటిగా, ఆచాపచుట్ట నల్లగా కనిపించింది. నేను అది దయ్యమే అనుకుని మరి నీళ్లు తాక్కుండా వొక్క పరుగునవచ్చి లక్ష్మితో చెప్పాను. అది నవ్వుతూ, “ఐతే నీకు దయ్యం అంటే భయమా” అని అడిగింది.అవునన్నా. అది మొదలు లక్ష్మి చాలా దయ్యాలకథలు చెప్పేది.

నాకు దయ్యమంటే రోజు రోజుకూ భయం ఎక్కువైంది. లక్ష్మికి వొకళ్లు భయపడుతున్నా ఏడుస్తున్నా చూట్టం సరదా. ఏదో సామెతచెబుతారే “పిల్లికి చెల్లాటం ఎలుకకు ప్రాణసంకట” మని, అల్లాగే. ఈ దయ్యాలవిషయం విన్నప్పట్నుంచీ నేను వొంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకొని పడుకునే దాన్ని.

లక్ష్మికి నేను భయపడుతున్నానని తెలిసి ఇంకా ఏడిపించేది. అదుగో దయ్యం ఇదుగో దయ్యం అని. పైగా బడాయిలు కొడుతుండేదికూడా వొకసారి లక్ష్మికి దయ్యం కనుపించిందిట. మాట్లాడిందిట కూడా. దయ్యం లక్ష్మిని చూచి భయపడి పారిపోయిందిట. “మళ్ళీ యీ చాయల కొస్తే కాళ్లు విరగ్గొడతా” ననికూడా చెప్పిందట లక్ష్మి. అప్పుడు అది చెప్పేవన్నీ కూడా నిజమే గాబోలు అనుకునేదాన్ని. పైగా మేం చదువుకునే స్కూల్లోకూడా దయ్యాలున్నాయని చెప్పింది. కాని పగలు రావట, రాత్రుళ్ళు కనిపించుతాయి. అని చెప్పింది. నయమే, లేకపోతే బడికి “గుడ్ బై” చెప్పి మానుకునేదాన్నే. అసలు లక్ష్మినిచూస్తే దయ్యానికి భయం కదా లక్ష్మిదగ్గిర వుంటే దయ్యాలు రావు అను కుని నేనెప్పుడూ లక్ష్మి వెంటనే దాని నీడ లాగు తిరుగుతుండేదాన్ని. యీ అలుసు తీసుకుని అది నాచేత అరవచాకిరీ చేయించుకునేది. వాళ్ళింట్లో దాని వంతు పని నా నెత్తిన పెట్టి చెయ్యమని తను మహారాణి లాగా చదువుకుంటూ కూర్చునేది. యీ సంగతి మావాళ్ళకుతెలిస్తే తంతారు. కాని లక్ష్మితో దెబ్బలాడితే దయ్యాలని వొదిలేస్తే. అంచేత యీసంగతులు ఎవరికి చెప్ప కుండా లక్ష్మితో స్నేహంగానే వుంటుండే దాన్ని వొకసారి లక్ష్మి అడిగింది “నీకు దయ్యము అరుపు వినాలనివుందా” అని. ఆమాట వినేసరికే నాకు గుండె ఆగిపోయినంత పని జరిగింది. “నాకు భయ” మన్నాను. “ఛా.ఛా, అది దూరాన్నుంచి అరుస్తుం” దన్నది. నాకు మనసులో వొక పక్క వినాలనివుంది. కాని ధైర్యం చాలక “నే నొకవేళ భయపడతానేమో. ఎప్పుడరుస్తుం”దని అడిగా.

“రాత్రి సరిగ్గా 2 గం. ఆ ప్రాంతాలలో అరుస్తుంది. కొంచం భయంగానే వుంటుంది దాని అరుపు. మన ఇంటివెనకాల వున్న మైదానంలోనే అరుస్తుంటుంది

రోజూ” అని చెప్పింది. ఆ మాట విని నేనింకా హడలిపోయాను. “నీకేం భయం లేదు నేనున్నానుగా” అంది లక్ష్మి.

“రాత్రి 2 గంటలకెల్లా మెళుకువ వస్తుంది” అన్నా. “నేను లేపుతాలే” అంది లక్ష్మి, ఆ రాత్రికి అన్నంకూడా సహించ లేదు. భయం జాస్తిగావుంది. అమ్మతో చెబుదామా అనుకున్నా కాని లక్ష్మిక వొట్టువేశాను అది చెప్పినమాట ఎవరితో చెప్పనని. ఎల్లాగా ఆ రాత్రికి సరిగా నిద్ర పట్టలా. లక్ష్మిని కావిలించుకుని పడుకున్నా. అది నేను భయపట్టంచూచి “యిప్పుడే ఎందుకంత భయం. అది అరిచేది రాత్రి 2 గంటలకు. నీవు నిద్రపో, నేను లేపుతాను” అంది. నేను నిద్ర పొయ్యాను.

రాత్రి సరిగ్గా 2 గంటలకు లక్ష్మి నన్ను తట్టిలేపింది. నేను చెవులు నిక్కిరించి విన్నా. అబ్బ! గుండె లదిరిపొయ్యాయి. అంత నిశ్శబ్దంగా వుండే సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా వుంది. లక్ష్మి నిజంగా చాలా ధైర్యస్థురాలు. లేకపోతే అది భయంలేకుండా ఎలా కూర్చుంది? నేను గజగజ వణికిపోతూ కూర్చున్నా. దయ్యమరవడం ఆపింది. దాని నోరు ఎంత పెద్దదో యింత గట్టిగా అరవడానికి! దాని ఆకారం ఎంత వుంటుందో, అదేం బట్టలు వేసుకుంటుందో? యివన్నీ ఆలో చిస్తూ గుడ్లప్పచెప్పి లక్ష్మీవంక చూచాను. అది నవ్వుతూ “సరే, యింక పడుకో” మంది. నేను దాన్ని గట్టిగా కావలించుకుని పడుకున్నా.

తెల్లవారిన తర్వాత రాత్రి జరిగింది నా కొక కలలా అనిపించింది. లక్ష్మీ నడిగితే “నిజమే. రాత్రి దయ్యం అరిచినప్పుడు నిన్ను లేపాను. నువ్వు భయపడ్డావుకూడా” అని చెప్పింది. దయ్యం అల్లా అర్ధరాత్ర ప్పుడు ఎందుకరుస్తుందో కనుక్కోవాలని నా మన సారాటపడింది. అది చెప్పేవాడు

మా తాత వొక్కడే, లక్ష్మి సరిగాచెప్పదు. లక్ష్మికి తెలియకుండా మా తాతనడిగా.

తాత విరగబడి నవ్వుతూ “పిచ్చితల్లీ! నిన్ను భయపెట్టాలని చెప్పవుంటుంది. లక్ష్మి. రాత్రి నువ్వు విన్నది రైలుకూత తల్లీ. రాత్రి 2 గంటలకు కలకత్తా నుంచి మెయిల్ పోతూవుంటుంది. దాని కూత ఆది. మొదట్లో లక్ష్మి నీలాగే భయపడింది. దానికెవరో పిల్ల చెప్పిందట దయ్య మరుస్తుందా సమయంలో అని. వొకరోజు రాత్రి సరిగా అదేసమయానికి రైలు కూత వేసింది. లక్ష్మి దాని మంచం వదిలి  పరుగెత్తుకొచ్చి నామెడ కావలించుకుంది. నేను నిద్దట్లో వులిక్కిపడి”ఏమిటే” అంటె దయ్యం ఆరుస్తోందన్నది. నేను విందును గదా రైలుకూత తప్ప ఏమీలేదు. నేను దానికి రైలుకూత అని చెప్పి భయం పోగొట్టాను. మళ్ళీ నీకు చెప్పిందా అది!”

ఓస్ యింతేనా! లక్ష్మికి నాకంటె భయమన్నమాట? లక్ష్మి చెప్పినవన్నీ తాతతో చెప్పాను. అవన్నీ పచ్చి అబద్ధాలు, నమ్మి భయపడవద్దని చెప్పాడు. అది మొదలు లక్ష్మి ఏదిచెప్పినా మూడు వంతులు తీసి వేసి నాలుగోవంతు నమ్మేదాన్ని లక్ష్మి ఎంత బడాయికోరో తేలిపోయింది. కాని నాకు దయ్యాలంటె ఇంకాభయమే.

Leave a Reply