బండ రాముడు

శృంగారం మేష్టారు క్లాసునంతా బెంచీ ఎక్కించిన రోజునుంచీ కొందరు రౌడీ పిల్లకాయలు రోజూ ఎక్కడినుంచో నల్లుల్ని తెచ్చి మేష్టారి బల్లమీదనో కుర్చీమీదనో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్ళతో ఎన్నడూ కలవలేదు. వాళ్ళంతా రెండోక్లాసుకు పూర్వవిద్యా ర్థులు, పాతకాపులు,

ఓరోజు మేష్టారి మెడపట్టిమీద పోతంత నల్లి పాకుతూ కనిపించింది. దాన్ని పట్టుకుని తీసేద్దామని నేను చప్పున వెళ్ళాను. అది బాగా నెత్తురు పోసుకుని తెగబలిసి ఉంది. నేను పట్టు కోగానే ఆనల్లిపోతు బుడగవిచ్చినట్టు విచ్చింది. దాని నెత్తురు మేష్టారి తెల్లని మెడపట్టీమీద ఎర్రగా చిమ్మింది. “మేష్టారూ, మీమెడ పట్టీనిండా నెత్తురండీ, సార్,” అని ఒక కుర్రాడు కేకపెట్టాడు. మేష్టారు వెంటనే జేబులో నుంచి చిన్న అద్దంతీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడూ అద్దంలో తన అంద చందాలు చూసుకోవటం మా మేష్టారికి అలవాటు. అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది. వెంటనే బెత్తంతో మేష్టారు నావీపుమీద తాషామర్పా వాయించాడు.

“నన్నెందుకండీ కొడతారు ? నేను నల్లిని తీయబోయాను గాని మీచొక్కా పాడుచెయ్యాలని నా ఉద్దేశంకాదు. అని ఘోష పెట్టా.

నోరు తెరిచినందుకు మరో రెండు దెబ్బలు కొసరు వడ్డించి మేష్టారు నన్ను క్లాసులోనుంచి బయటికి పంపించారు. నేను నేరుగా హెడ్డుమేష్టారి దగ్గిరికి వెళ్ళా. జరిగిందంతా ఆయనతో చెప్పా. అంతా విని ఆయన నన్ను క్లాసుకు తిరిగి వెళ్ళమన్నారు. ఈలోపుగా ప్యూనువచ్చి హెడ్డుమేష్టారు రమ్మంటున్నారని మాశృంగారం మేష్టారితో చెప్పాడు. ఆయన హెడ్డుమేష్టరు దగ్గర నించి వచ్చిన తర్వాత తిరిగి నన్నాయన బయటికి వెళ్ళమనలా.

ఇది జరిగినప్పటి నుంచీ నాకు క్లాసులో సున్నా మార్కులే. ఎంత కష్టపడి చదివినా, ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో సున్నాలు తప్పలేదు. మిగతా పిల్లలకి లెక్కల్లో పదికి ఏడూ, ఎనిమిదీ, తొమ్మిదీ మార్కులొచ్చేవి. నాకు మటుకు సున్నాలే. లెక్కలు వాళ్ళు చేసినట్టే నేను చేసేవాణ్ణి, కాని మార్కులు మాత్రం వచ్చేవి కావు. క్వార్టర్లీ పరీక్షలోనూ, అర్ధసంవత్సరం పరీక్షలోనూ కూడా నేను తప్పాను. ఈ రెండోక్లాసుఎట్లా పాసవుతానురా భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది.

జమీందారుగారబ్బాయి కిస్టుడికి శృంగారం మేష్టారు ప్రయివేటు చెప్పేవాడు. మూడోక్లాసులో మూడు దండ యాత్రలుచేసి కిష్టుడు నాలుగోక్లాసులోకి వచ్చాడు.

వెనక కిష్టుడు నన్ను కాఫీహోటల్లో కూచోపెట్టిన సంగతి మీరు విన్నారుగా. వాణ్ణి చూసినప్పుడల్లా నాకావిషయం జ్ఞాపకంవచ్చి చాలా సిగ్గుగా ఉండేది. ఎట్లాగైనా కిష్టిగాడికి శాస్త్రిచేస్తేగాని నాకీ అవమానం పోదనిపించేది. గోపిగాడు బడి వదిలిపోయిన తరవాత కూడా కిట్టిగాడు నన్ను చూసినప్పుడల్లా “గోపిగాడి గుర్రం :” అంటూండేవాడు.

నవరాత్రులొచ్చాయి. విజయదశమి నాడు పిల్లలచేత నాటకం ఆడించటానికి కిష్టుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకానికి, నాటకం అయినాక టీపార్టీకి ఖర్చవుతుంది. అందుచేత రెండోక్లాసు, మూడోక్లాసు, నాలుగోక్లాసు పిల్లకాయలు తలకు బేడ చొప్పున చందావేయాలన్నాడు. చందా ఇవ్వనివాళ్ళకి పార్టీలేదు.

కిష్టుడు నన్ను పిలిచి, “ఒరే, విజయ దశమి విందుకి కారపుశనగలూ అవీ చెయ్యాలి. నీకు చెయ్యటం చాతవునా?” అని అడిగాడు. మా అమ్మా నాన్నా బీదవాళ్లుగనక నేను వంటవాడినని కిష్టుడి అభిప్రాయం కాబోలు.

నేను తడుపుకోకుండా, “ఓ, నాకు ఫస్టుగా చాతవును. ఇంకా చాలా రకాల వంటలు చేస్తా. డబ్బు నాకిచ్చెయ్యి.” అన్నా. వాడు నాకు డబ్బిచ్చి, శృంగారం మేష్టారింట్లో వంటపాత్రలూ అవీ తీసుకోమన్నాడు.

నేను శృంగారం మేష్టారింటికి వెళ్ళి కిష్టుడిచ్చిన డబ్బు ఆయనతల్లికి ఇచ్చేశా. మేష్టారితో, “మేష్టారూ, విజయదశమి నాడు మీరు ప్రెసిడెంటుగా ఉండి సహాయం చెయ్యాలని కిష్టుడు చెప్పమన్నాడు,” అని చెప్పా.

నేనే పిండివంటలా చేస్తున్నానను కున్నాడు కిష్టుడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని చెప్పా.

నాటకం రోజున తానే ప్రెసిడెంటు అనుకుని శృంగారం మేష్టారు చిన్న జమీందారల్లే వేషం వేసుకొని వచ్చాడు. కాని, పాపం, ప్రెసిడెంటు ఆయనకాదు హెడ్డుమేష్టారు.

నాటకం అయిపోయిన తరవాత కిష్టిగాడు లేచినిలబడి, “స్నేహితులారా, ఇప్పుడొక చిన్న అల్పాహారవిందు కూడా ఉంది. దయచేసి ఎవరూ వెళ్ళిపోవొద్దు.” అని కోరాడు. పిల్లలంతా విందుకోసం కూచున్నారు.

పక్కగదిలో చాలాగిన్నెలు తెచ్చి పెట్టా. అన్నిటిమీదా మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకివచ్చి ఒక గిన్నె మీద మూతతీసి చూశాడు. పాపం. గిన్నెలో ఏమీలేదు. ఇంకో గిన్నె మీద మూతతీసి చూశాడు. అందులోనూ ఏమీలేదు. ఏగిన్నెలోనూ ఏమీలేదు. అన్నిగిన్నెలూ ఖాళీ.

“ఏమిటిది?” అని కిష్టిగాడు నన్నడిగాడు.

“నాకుమాత్రం ఏం తెలుసూ ? నాకు వంట చాతకాదు. అందుకని నువ్విచ్చిన డబ్బు పట్టుకువెళ్ళి, ఏమన్నా పిండివంటలు చెయ్యమని శృంగారం మేష్టారి తల్లి కిచ్చా. ఆవిడేంచేసిందో నువ్వే వెళ్ళి కనుక్కో ,” .

కిష్టిగాడి మొహాన కత్తివాటేస్తే నెత్తురు చుక్కలేదు. జేబులోనుంచి ఇరవై రూపాయలుతీసి, పొట్లాలు కట్టించుకురమ్మని కుర్రవాళ్ళను హోటలుకు తరిమాడు. పొట్లాలు రావటానికి అర గంటపైగా పట్టింది. ఈలోపుగా చాలా మంది వెళ్లిపోయారు. మిగిలినవాళ్లు విందుచేశారు.

కిష్టిగాడు సిగ్గులేక నన్నుచూసి ఇకిలించాడు. వాణ్ణి చూసి నేనూ ఇకిలించా: నేనేం, తక్కువ తిన్నానా? అప్పటి నుంచీ కిస్టుడు కనిపించినప్పుడల్లా వాణ్ణి చూసి ఇకిలిస్తూ వచ్చా.ఇది వాడికవ మానం అయింది. వాడు నాకెన్నడూ మళ్ళీ పనిచెప్పిన పాపానపోలా.

ఆర్ధసంవత్సరం పరీక్షలయి పోయాయి. తరవాత డిసెంబరు శలవలుకూడా అయిపోయి. మళ్ళీ బడితెరిచారు. ఒక రోజు బడిగేటు దగ్గిర కిష్టుడు నిలబడి మరోపిల్లవాడితో, “ఆయింటో అమ్మాయిని చూశావా ? ఆపిల్ల శృంగారం మేష్టార్ని చూసి నవ్వుతుంది. వాళ్లిద్దరికీ స్నేహం.” అని చెబుతున్నాడు. ఈ ముక్క నా చెవులబడింది.

ఆరోజు మధ్యాన్నమే శృంగారం మేష్టారు నన్ను పిలిచి, ఒక నీలంకవరూ, ఒక తెల్లకవరూ ఇచ్చి, “ఈనీలంకవరు బడి ఎదురుమేడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇయ్యి. ఈ తెల్లకవరు హెడ్మాష్టరుగారికి ఇయ్యి. జాగర్త సుమా. పొరపాటు చేసేవు. తెల్లకవరు శలవు ఉత్తరం. అది హెడ్మాష్టరుగారికే ఇయ్యి. పొరపాటు చేసేవు,” అని చెప్పాడు.

శృంగారం మేష్ణారు నాచేతికి దొరికాడుగదా అనుకొన్నా. శృంగారంగారిచ్చిన ఉత్తరాల్లో నీలంకవరు జాగర్త హెడ్డుమేష్టారి కిచ్చి, తెల్లకవరు మేడలో అమ్మాయికి అందజేశా.

ఆరోజు సాయంకాలమల్లా శృంగారం మేష్టారు హెడ్డు మేష్టారిగదిలో నిలబడే ఉన్నాడు. మర్నాడు మాకింకో మేష్టరొచ్చారు.

ఏదోవిధంగా నేను రెండో క్లాసు పాసుకాగలిగా మీదయవల్ల.

Leave a Reply