కాకమ్మక్క కథ – 3
మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక్క ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూవుంటే కాకిగోల అంటాం. కాని నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పనిమీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చెయ్యదు. తనజాతికి ఏదైనా అపాయం కలిగితేనూ, ఏదైనా ఆహారం దొరికినప్పుడూ కాకి సాటివారినీ ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతీ, జాత్యభిమానమూ ఉండబట్టి అట్లా తనవారిని పిలుస్తూంది. కాకికున్న జాత్యభిమానంలో ఎన్నోవంతు కూడా లేని మనం కాకిగోల అనటం చాలా అన్యాయం.
మొన్న ఉప్పుశెట్టిగా రింటో పెద్దెత్తుగా పెళ్ళి జరిగింది. ఉప్పుశెట్టిగారి రెండో అమ్మాయిని పప్పుశెట్టిగారి మూడో అబ్బాయి కిచ్చి పెళ్లిచేశారు. ఎన్నోమైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికందరికీ శుభలేఖలూ పిలుపులూ వెళ్ళాయి.
పిలుపులూ శుభలేఖలూ వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలలనుంచీ కుక్కలూ, పందులూ కూడా పెళ్లివారింటి దగ్గిర చేరాయి. కాకులమాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్కా, కాకిబావా వేళకు చేరుకున్నారు.
మనుష్యలకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారెంటోఎంతసేపూ మంత్రాలూ, బాజా భజంత్రీలూ, పెళ్లికొడుకు పెళ్లికూతురు మెళ్లో మంగళసూత్రం కట్టటమూనూ. అంతేగాని రెండుఝాముల పొద్దెక్కినా తిండి ప్రమేయమేలేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిధుల మాటేమోగాని, వీధిలో చేరిన పందులకూ, కుక్కలకూ పెళ్లివారి జాగుచూస్తే వొళ్లు మండిపోయింది.
కాకమ్మక్కా, కాకి బావామటుకు లొట్టలేస్తూ కూచోక అట్లా, అట్లా పాకశాల దగ్గిరికిచేరి వంట బ్రాహ్మలను ఏమరిపించి వంటకాలు ముందుగానే రుచిచూచి వచ్చారు. ఇంకా ఎవరూ తినకమునుపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది.
కొంతసేపటికి భోజనాలు ఆరంభమయాయి. తిండి వాసనకొట్టటమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూచి ఒకటి అరవసాగాయి.
“ఈ కుక్కలను భగవంతుడెట్లా సృష్టించాడు. ఒకదాన్ని ఒకటి పిలుచు కోవటంలేదు. ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవటంలేదు. ఈ బుద్ధి మాలిన జంతువులు అప్పుడే తమలోతాము పోట్లాడుకోసాగాయి,” అన్నది కాకిబావతో కాకమ్మక్క.
“వాటికా జ్ఞానంలేకపోవటం మనకే మేలు,” అన్నాడు కాకి బావ
దూరాన ఉన్న మురికి గుంటలోనుంచి పంది మామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తూన్నాడు.
ఇంతలో గోడమీదినుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పంది మామయ్య సమీపంలోనే అవి పడ్డాయి.
పంది మామయ్య తాపీగా లేచి నిలబడి ఠీవిగా వొళ్లంతా ఒక్కసారి విదిలించి, చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టెపెట్టి భోజనం ఆరంభించాడు.
ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గిరికి వచ్చింది. మరో మూలనుంచి ఇంకో కుక్కవచ్చి మొదటిదాన్ని నిలవేసి, ‘బొయి, బొయి’ మని అరిచింది. రెండుకుక్కలకూ ఈ కిందివిధంగా వాగ్వాదం జరిగింది.
“కళ్ళు నెత్తిమీది కొచ్చాయే! ఇక్క డున్నది ఎవరనుకున్నావ్?”
“నువుకూడా ఒక కుక్కల్లే మాట్లాడ వచ్చావే! అబ్బో!”
“ఈ కబుర్లు కట్టిపెట్టు, నీ కింకా నా తడాఖా తెలీదు.”
“అన్ని తెలుసు.
“డొక్క చించి డోలు కట్టించగలను, ఏమనుకున్నావో?”
“ఒక్కటిచ్చుకున్నానంటే నీ బాబు గాడితో చెప్పుకోవాలి.”
“బొంయ్! బొంయ్ !”
“బౌవౌ ! బౌవౌ !”
“మనిద్దరం పోట్లాడుకుంటే పంది మామయ్య కాస్తా విస్తళ్ళు నాకేస్తున్నాడు.”
“చచ్చు వెధవ్వు. నిన్ను తిననిచ్చే కంటే పందిమామయ్య తిన్నా నాకు సంతోషమే.”
“నేనూ అదే అంటున్నాను.”
ఈవిధంగా కుక్కలు కొట్లాడుకుం టుంటే కాకమ్మక్క పందిమామయ్య వీపు మీద వాలి, తనకు పనికొచ్చే పదార్ధం కనిపించినప్పుడల్లా కిందికిదిగి తింటూ హాయిగా కడుపునింపుకున్నది.
ఈలోపుగా కుక్కలు రాజీపడి పంది మామయ్య మీదికి దండెత్తి వచ్చాయి. పందిమామయ్య చీటికీ మాటికి కొట్లాటలకు దిగేరకంకాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకి తప్పుకున్నాడు.
కుక్కలు చాలా అనుమానంగలవి. కాకమ్మక్కా, కాకిబావా సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తూండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్కా, కాకిబావా కుక్కలకు చెరో వైపూచేరి కుక్కలు ఒకదానివంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపునింపుకున్నారు.
ఇంత హడావుడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమామయ్య కడుపు నిండేదీలేదు. కాని కాకమ్మక్కాకూ కాకిబావకు చక్కగా కడుపునిండింది. అయినా వాటిభోజనం ఇంకా పూర్తికాలేదు.
“ఏమే, వొసీ ! లోపల అంట్ల గిన్నెలు మనకోసం ఎదురుచూస్తూన్నాయి. మనవాళ్ళందర్ని పిలుచుకుని అక్కడికిపోదాం పద!” అన్నాడు కాకిబావ,
మొగుడికి సమాధానంగా కాకమ్మక “కా, కా!” అన్నది. ఇద్దరూకలిసి ఉప్పు శెట్టిగారి దొడ్డివేపు ఎగిరిపోయారు.
.