శత్రుఘ్నుడు లవణుడిని సంహరించుట

మర్నాడు తెల్లవారుతూనే లవణుడు ఆహారం సంపాదించటానికై మధుపురం దాటి బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి మధుపుర ద్వారం వద్ద నిలబడ్డాడు.

మధ్యాన్నం రెండు జాములయే సరికి లవణుడు తాను చంపిన జంతువులన్నిటినీ మోస్తూ తన నగరానికి తిరిగి వచ్చి, ద్వారం వద్ద ఉన్న శత్రుఘ్నుణ్ణి చూసి, విరగబడి నవ్వుతూ, ” ఒరే మనిషి, నాకు ఆహారం కావటానికా వచ్చావు? ఇవాళ నాకు మంచి విందే!” అన్నాడు.

రోషంతో శత్రుఘ్నుడి కళ్ళు ఎర్ర బడ్డాయి. “నీతో యుద్ధం చేసి, నిన్ను  చంపటానికి వచ్చానురా, లవణుడా! నేను దశరథమహారాజు కొడుకును, శ్రీ రాముడి తమ్ముణ్ణి, నా పేరు శత్రుఘ్నుడు. ఇవాళ నా చేత నీకు చావు తప్పదు,” అన్నాడతను.

లవణుడు వెటకారంగా నవ్వి, “నాకు మామ వరస అయిన రావణుణ్ణి మీ అన్న చంపినా మిమ్మల్ని నేను లక్ష్యపెట్టలేదు. నేను మహామహా వాళ్ళనే చంపాను. నాకు మీ వంటి వాళ్ళు గడ్డితో సమానం. నన్నెవరూ జయించలేరు. నాతో యుద్ధం చెయ్యవచ్చావుగా? ఉండు నీ తీట తీరుస్తాను. నన్ను వెళ్ళి ఆయుధం పట్టుకురానీ,” అన్నాడు.

“నా కంటపడిన నిన్ను ప్రాణాలతో పోనిస్తాననుకున్నావా? నిన్ను ఈ క్షణంలోనే చంపేస్తాను,” అన్నాడు శత్రుఘ్నుడు.

లవణుడు పళ్ళుకొరికి, చేతులు పిసుక్కుని, చెట్లు పెరికి శత్రుఘ్నుడి పైన విసరసాగాడు. శత్రుఘ్నుడా చెట్లనన్నిటినీ తన బాణాలతో నరికాడు. కాని ఒక చెట్టు తలమీద తగిలి, శత్రుఘ్నుడు మూర్ఛపోయాడు. అది చూసి, శత్రుఘ్నుడు చచ్చాడనుకుని, మందమతి అయిన లవణుడు తన శూలాన్ని తెచ్చుకోవటానికి వెళ్ళలేదు. అందుకు మారుగా వాడు తాను చంపిన మృగాల మోపునెత్తుకుని బయలుదేరేటంతలో శత్రుఘ్నుడు మూర్ఛ తెలిసి, ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. మరుక్షణమే అతను, రాముడు తన కిచ్చిన బాణాన్ని ధనువుకు సంధించి, లవణుడి పైకి వదిలాడు. అది నిప్పులు కక్కుతూ వెళ్ళి, లవణుడి గుండెను చీల్చింది. లవణుడు చచ్చాడు. వెంటనే వాడి ఇంట ఉండే త్రిశూలం శివుడి వద్దకు వెళ్ళిపోయింది.

తరువాత శత్రుఘ్నుడు తన సేనను పిలిపించి, మధుపురాన్ని ఆక్రమించి, దానికి రాజై పాలించసాగాడు. పన్నెండేళ్ళు గడిచాక అతనికి రాముణ్ణి చూడాలనిపించింది. అతను కొద్ది సేననూ, పరివారాన్నీ వెంటబెట్టుకుని అయోధ్యకు బయలుదేరి, దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి మజిలీ చేశాడు.

వాల్మీకి శత్రుఘ్నుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆతిథ్యం జరిపి, అతనికీ, అతని సేనకూ, పరివారానికి భోజనాలు పెట్టించాడు. భోజనాలయాక వారంతా వాల్మీకి రచితమైన రామ కథను రాగతాళాలతో సహా విని ఎంతో అద్భుతం చెందారు. జరిగిపోయిన ఆ కథ మళ్ళీ కళ్ళ ఎదట జరుగుతున్నట్టే వాల్మీకి దానిని రచించాడు.

ఆ రాత్రంతా రామకథను వినటంలోనే గడిచిపోయింది. మర్నాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని, అయోధ్యకు వెళ్ళి, రాముణ్ణి చూసి, “అన్నా, నీ ఆజ్ఞానుసారం లవణుణ్ణి చంపి అతని రాజ్యాన్ని ఏలుతున్నాను. కాని పన్నెండేళ్ళ పాటు నిన్ను చూడక తహతహపుట్టి బయలుదేరి వచ్చాను,” అన్నాడు.

రాముడు శత్రుఘ్నుణ్ణి కౌగలించుకుని, ” నాయనా, రాజుకు రాజ్యం చెయ్యక తప్పదుగద. నీ రాజ్యం నీవు చూసుకో. ఎప్పుడన్నా నన్ను చూడాలనిపిస్తే వస్తూ ఉండు,” అని అతన్ని పంపేశాడు.

భరతలక్ష్మణులు సపరివారంగా బయలుదేరి, శత్రుఘ్నుణ్ణి చాలా దూరం సాగనంపి, వెనక్కు తిరిగి వచ్చారు.

తరవాత కొన్ని రోజులకు ఒక పల్లెటూరి బ్రాహ్మణుడు తన అయిదేళ్ళ కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గర నిలబడి ఏడవటం మొదలుపెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాల మరణం పొందినందుకు ఏడుస్తూ బ్రాహ్మణుడు, రాజు సరిగా పాలిస్తే ఇలాటి అకాల మరణాలుండవనీ, ఇన్నాళ్ళకు ఇక్ష్వాకుల పరిపాలనలో, రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయిందనీ అన్నాడు.

రాముడీ సంగతి తెలుసుకుని చాలా చింతించి, తన మంత్రులనూ, వసిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులను పిలిపించి,వారితో బ్రాహ్మణ బాలుడి అకాలమరణం గురించి చెప్పాడు. ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడనీ, అది యుగధర్మానికి విరుద్ధమనీ, అందుకే ఈ బాలుడు చనిపోయాడనీ నారదుడు రాముడితో అన్నాడు.

రాముడు లక్ష్మణుడితో, “నీవు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి, ఆ బాలుడి కళేబరాన్ని తైలాభాండంలో భద్రంగా ఉంచు,” అన్నాడు. తరువాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి, పడమరా, ఉత్తరమూ, తూర్పూ గాలించి, చివరకు దక్షిణ దిక్కున, ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషి నొకణ్ణి చూశాడు.

అతను విమానం దిగి ఆ వ్యక్తిని సమీపించి, ” నేను రాముణ్ణి, దశరథమహారాజు కొడుకును. తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. నీవే జాతివాడివి ? ఏం కోరి ఈ కఠోర తపస్సు చేస్తున్నావు?” అని అడిగాడు.

తలకిందులుగా ఉండే ఆ తాపసి, “రాజా, నేను శూద్రుణ్ణ. నా పేరు శంబూకుడు. బొందితో స్వర్గానికి పోగోరి నేనీ తపస్సు చేస్తున్నాను,” అన్నాడు. అతనింకా మాట్లాడుతూండగానే రాముడు తన కత్తి దూసి శంబూకుడి తల నరికేశాడు.

వెంటనే దేవతలు రాముడి పైన పుష్ప వర్షం కురిపించి, దుందుభులు మోగించి, ” రామా, ఈ శూద్రుడు స్వర్గానికి రాకుండా చేశావు. మాకంతే చాలు. ఏం వరం కోరుతావో కోరు,” అన్నారు.

“అకాల మరణంపాలయిన ఆ బ్రాహ్మణ బాలుణ్ణి బతికించండి,” అన్నాడు రాముడు.

“శంబూకుడి తల తెగిన క్షణంలోనే ఆ బాలుడు బతికాడు,” అంటూ దేవతలు వెళ్ళిపోయారు.

రాముడక్కడి నుంచి, ఆ సమీపంలోనే ఉన్న అగస్త్యాశ్రమానికి వెళ్ళి, ఆ ముని ఇచ్చిన అతిథి సత్కారాలు స్వీకరించాడు.

అగస్త్యుడు రాముడికొక ఆభరణాన్ని బహూకరించాడు. రాముడు దాన్ని స్వీకరించి, “స్వామీ, ఇది దివ్యాభరణంలాగున్నది. ఇది తమకు ఎవరిచ్చారు?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా అగస్త్యుడు శ్వేతుడి కథ చెప్పాడు.

వెయ్యియోజనాల విస్తృతి గల ఒక అరణ్యం ఉండేది. దాని మధ్య యోజనం చదరం గల సరస్సుండేది. ఆ అరణ్యంలో ఒక్క పక్షిగాని, మృగంగాని ఉండేది కాదు. సరస్సుకు సమీపంలో ఒక ఆశ్రమం ఉండేది. అగస్త్యుడా ఆశ్రమానికి వెళ్ళి, ఒక రాత్రి అందులో గడిపి, తెల్లవారు జామున సరస్సు వద్దకు వెళ్ళాడు. దాని ఒడ్డున ఆయనకొక పుష్టి గల శవం కనబడింది. అది ఏ మాత్రమూ చెక్కుచెదరకుండా ఉన్నది. అది ఏ విధమైన శవం అయి ఉంటుందా అని అగస్త్యుడు ఆలోచిస్తూండగా, అక్కడ ఒక విమానం ఆకాశం నుంచి దిగింది. అదొక దివ్య విమానం. అందులో ఒక దివ్యపురుషుడూ, అతన్ని సేవిస్తూ అనేకమంది అప్సరసలూ ఉన్నారు. అప్సరసలలో కొందరు పాడుతున్నారు, కొందరు వాద్యాలు వాయిస్తున్నారు, మరికొందరు నృత్యాలు చేస్తున్నారు.

కొంతసేపయాక ఆ దివ్యపురుషుడు విమానం నుంచి దిగి, సరస్సుతీరాన ఉన్న శవాన్ని తిని, సరస్సులో చెయ్యీ, నోరూ కడుక్కుని, తిరిగి విమానం ఎక్క బోయాడు. అదంతా చూస్తూ ఉండిన అగస్త్యుడు, ” అయ్యా, నీవెవరు? ఇలాటి పనికిమాలిన భోజనం చెయ్యటానికి కారణమేమిటి? ఎంత హీనులు కూడా ఇలాటి పని చెయ్యరు గదా !” అన్నాడు.

ఆ దివ్యపురుషుడు అగస్త్యుడికి తన పూర్వ కథ చెప్పాడు.

అతను విదర్భరాజైన సుదేవుడి కొడుకు. అతని పేరు శ్వేతుడు. సుదేవుడి కిద్దరు భార్యలు, ఇద్దరికీ ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడీ శ్వేతుడు. చిన్న వాడి పేరు సురథుడు. శ్వేతుడు తన తండ్రి అనంతరం చాలాకాలం రాజ్యం ఏలి, చివరకు సురథుడికి పట్టంకట్టి, తాను తపస్సు చేసుకున్నాడు. దీర్ఘ తపస్సు చేసి అతను దేహం చాలించి, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాని బ్రహ్మలోకంలో కూడా అతన్ని ఆకలిదప్పులు విడవలేదు. అది చూసి కంగారుపడి అతను బ్రహ్మ వద్దకు వెళ్ళి, బ్రహ్మ లోకంలో కూడా తనను ఆకలిదప్పులు వేధించటానికి తాను ఏం తప్పుచేసి ఉండాలని అడిగాడు.

దానికి బ్రహ్మ, ” జంతువులు లేని అడవిలో నీకు భోజన సంతుష్టి ఏ మాత్రమూ లభించలేదు. అదీకాక నీవు అస్తమానమూ తపస్సులో ఉండి అతిథులకు భోజనం పెట్టలేదు. అందుకే నిన్ను ఆకలిదప్పులు వదలకుండా ఉన్నాయి. అరణ్యంలో ఉన్న నీ శవాన్నే తిని నీ ఆకలి దప్పులను తీర్చుకుంటూ ఉండు. కొంతకాలానికి అక్కడికి అగస్త్యుడు వచ్చి, తన అపారమైన మహిమ చేత నీ ఆకలిదప్పులను పూర్తిగా పోగొట్టుతాడు,” అని చెప్పాడు.

తనను పలకరించినవాడు అగస్త్యుడేనని తెలియగానే ఆ దివ్యపురుషుడు, “స్వామీ, నన్ననుగ్రహించి, నాకీ కష్టం తొలగించండి. దానికి ప్రత్యుపకారంగా ఈ ఆభరణం స్వీకరించండి. ఇది ప్రతిరోజూ బంగారాన్నీ, ధనాన్నీ, బట్టలనూ, ఆహారాన్నీ, నగలను ఇస్తూ ఉంటుంది,” అన్నాడు.

అగస్త్యుడా ఆభరణాన్ని స్వీకరించగానే శవంకాస్తా శిథిలమైపోయింది.. దివ్యపురుషుడు సంతోషించి స్వర్గానికి వెళ్ళిపోయాడు.

రాముడీ కథ విని అగస్త్యుడితో, “స్వామి, శ్వేతుడు తపస్సు చేసిన వనంలో మృగాలూ, పక్షులూ లేకపోవటానికేమిటి కారణం ?” అని అడిగాడు.

ఆ కథను అగస్త్యుడీ విధంగా చెప్పాడు. కృతయుగంలో మను చక్రవర్తి తన కొడుకైన ఇక్ష్వాకుడికి పట్టంగట్టి, రాజనీతి చక్కగా బోధించి, తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇక్ష్వాకు నూరుగురు కొడుకులను కన్నాడు. వారిలో ఆఖరివాడు దండుడు. అతను బుద్ధిహీనుడు. ఆ దండుడికి ఇక్ష్వాకు వింధ్య శైవలప్రాంతాల మధ్య రాజ్యం ఇచ్చాడు. దండుడు అక్కడ మధుమంతమనే చక్కని నగరం నిర్మించుకుని, శుక్రాచార్యులను గురువుగా పెట్టుకుని, రాజ్యంచేస్తూ వచ్చాడు.

శుక్రాచార్యులకు అరజ అనే అందమైన కూతురుండేది. ఒకనాడు దండుడు వనంలో తిరుగుతూ, ఒంటరిగా ఉన్న అరజను చూసి, ఆమెను కోరాడు. అరజ, తాను శుక్రాచార్యులు కూతురిననీ, దండుడు వెర్రిమొర్రి వేషాలువేస్తే శుక్రాచార్యులు ఘోరమైన శాపం ఇస్తాడనీ హితవు చెప్పింది. అయినా, మందమతి అయిన దండుడు అరజ హితబోధ వినక, ఆమెను బలాత్కరించాడు.

అతను మధుమంతానికి తిరిగివెళ్ళాక, అతని దుష్ప్రవర్తన శుక్రుడికి తెలిసింది. మధుమంతం చుట్టూ నూరు యోజనాల మేర ఏడు రోజులపాటు ధూళివర్షం కురిసి, సమస్తమూ నశించి పోవాలని శుక్రాచార్యుడు శపించాడు.

ఈ శాపం సంగతి వింటూనే అక్కడ నివసించే వారందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. శుక్రుడు చెప్పినట్టే ఆ ప్రాంతమంతా వారం రోజులపాటు ధూళివర్షం కురిసి నాశనమైపోయింది.

ఈ కథలు వింటూ రాముడు అగస్త్యాశ్రమంలో కొంతసేపుండి, ఆ మహాముని వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు తిరిగి వచ్చేశాడు.

Leave a Reply