లక్ష్మణుడు సీతను వాల్మీకి ఆశ్రమంలో విడిచి వచ్ఛుట

లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేక, ఏడుస్తూ సీతకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆమె చుట్టూ ప్రదక్షిణం చేసి, పడవలో ఎక్కి ఉత్తర తీరానికి చేరుకుని, రథమెక్కి, అనాధురాలిలాగా అవతలి ఒడ్డున ఏడుస్తున్న సీతను మళ్ళీమళ్ళీ వెనక్కు తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. సీత ఆ రథం కేసే చూస్తూ ఉండిపోయి, పట్టలేక గట్టిగా ఏడవనారంభించింది. ఆమె ఏడుపుకు నిర్జనమైన అరణ్యం మారుమోగింది.

ఆ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న సీతను కొందరు మునికుమారులు చూసి వాల్మీకి వద్దకు పరిగెత్తి వెళ్ళి, “స్వామీ, గంగాతీరాన ఎవరో ఒక స్త్రీ ఏ కారణం వల్లనో ఏడుస్తూ కనబడింది. మనిషి చూడబోతే ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతా స్త్రీ లాగా ఉన్నది. ఆమెకెవరూ ఉన్నట్టు లేరు. మీరు వెంటనే వెళ్ళి ఒకసారి చూడండి,” అని చెప్పారు.

వాల్మీకమహాముని, తన శిష్యులు వెంటరాగా, అర్ఘ్యం తీసుకుని సీత ఉన్న చోటికి వచ్చి, ఆమెను గుర్తించి, ” దశరథుడి కోడలికి స్వాగతం. అమ్మా, నీవిక్కడికి ఎలా చేరావో అది నేను నా శక్తి చేత గ్రహించాను. మూడు లోకాల వృత్తాంతాలూ నాకు తెలుస్తూనే ఉంటాయి. నేనుండగా నీకే భయమూ లేదు. నా ఆశ్రమం దగ్గిరలోనే ఉన్నది. అక్కడ తాపస స్త్రీలున్నారు. వారు నిన్ను కనిపెట్టి ఉంటారు. దుఃఖించకు,ఈ అర్ఘ్యం తీసుకో. మా ఆశ్రమంలో నీవు నీ సొంత ఇంట్లో ఉన్నట్టే ఉండవచ్చు,” అన్నాడు.

సీత ఆయనకు నమస్కారం చేసి, వాల్మీకి వెంట ఆయన ఆశ్రమం ప్రవేశించింది. వాల్మీకి ఆమెను మునిభార్యలకు అప్పజెప్పి, ఆమెను స్నేహ గౌరవాలతో చూడవలసిందని చెప్పాడు.

అయోధ్యకు తిరిగిపోతున్న లక్ష్మణుడు సుమంత్రుడితో, “సుమంత్రా, అన్నకు సీతా వియోగం వల్ల ఎంతటి దుఃఖం సంప్రాప్తమయిందో చూశావు గదా. నిర్దోషురాలైన సీతకు ఎంత కష్టం వచ్చిందో చూడు,” అన్నాడు.

సుమంత్రుడా మాటకు, ” లక్ష్మణా, రాముడికి సుఖం అల్పమనీ, అయినవారితో వియోగం కలుగుతుందనీ పూర్వం మునులు చెప్పనే చెప్పారు. ఇది చాలా రహస్యం. నేను నీకు చెబుతాను, కాని నీవు మాత్రం భరత శత్రుఘ్నులకు చెప్పకు”, అంటూ ఇలా చెప్పాడు..

ఒకనాడు దశరథుడు వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ అత్రిమహాముని కుమారుడైన దుర్వాసుడున్నాడు. దశరథుడు మునుల నుంచి స్వాగత సత్కారాలు పొంది, మాటల సందర్భంలో దుర్వాసుణ్ణి, “మహాత్మా, నా సంతతి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ? మా రాముడి ఆయుర్దాయమెంత ? మిగిలిన నా కొడుకులెంత కాలం జీవిస్తారు? మా రాముడి కెంతమంది కొడుకులుంటారు? వారెంత కాలం జీవిస్తారు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలకు సమాధానంగా దుర్వాసుడు ఒక పాత గాథ చెప్పాడు.

దేవాసుర యుద్ధంలో ఓడిపోయి అసురులు భృగుమహాముని భార్యను శరణుజొచ్చారు. ఆమె వారికి అభయం ఇచ్చింది. ఇది చూసి విష్ణువు ఆగ్రహించి, భృగుడి భార్య శిరస్సును తన చక్రాయుధంతో ఖండించాడు. వెంటనే భృగుమహాముని మండిపడి, విష్ణువును భూలోకంలోపుట్టి భార్యా వియోగంతో తపించమని శపించాడు. ఆ శాప ప్రభావం చేత విష్ణువు దశరథుడికి కొడుకుగా పుట్టి, రాముడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

“రాముడు భృగు శాపఫలం అనుభవించి తీరుతాడు. అతను పదకొండు వేల ఏళ్ళు అయోధ్యను పాలించి, అనేక అశ్వమేధాలు చేసి, బ్రహ్మలోకానికి పోతాడు. అతనికి ఇద్దరు కొడుకులు పుట్టుతారు, అయితే వారు అయోధ్యలో గాక మరొక చోట పుట్టుతారు. వారికి రాముడు పట్టాభిషేకం చేస్తాడు,” అని దుర్వాసుడు దశరథుడితో చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ, లక్ష్మణ సుమంత్రులు సాయంకాలానికి గోమతి అనే చోటికి వచ్చి ఆ రాత్రి అక్కడ గడిపారు. మర్నాడు ఉదయం వారు తిరిగి ప్రయాణం సాగించి అయోధ్యకు వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు, రాముడితో ఏమని చెప్పటమా అని చాలా మధనపడ్డాడు.

రథం అయోధ్య చేరింది. రాముడి ఇంటి ముందు లక్ష్మణుడు రథం దిగి, లోపలికి వెళ్ళి, దీనంగా కన్నీరు కార్చుతూ, సింహాసనం మీద కూర్చుని ఉన్న రాముడికి నమస్కరించి, “మీ ఆజ్ఞానుసారం సీతను గంగాతీరాన వాల్మీకిమహాముని ఆశ్రమంలో విడిచి వచ్చాను. విచారించ వద్దు. వృద్ధి నుంచి క్షయమూ, ఉన్నతి నుంచి పతనమూ, సంయోగం నుంచి వియోగమూ తప్పవు. వచ్చిన అపవాదు దానంతట అదే పోతుంది.” అన్నాడు.

“లక్ష్మణా, నా మాట పాటించావు. చాలా సంతోషం. నాకు విచార మేమీలేదు” అన్నాడు రాముడు. అన్నా మొదటి నాలుగు రోజులుగా ప్రజల గొడవలు విచారించలేదు. అది చాలా తప్పు. రాముడా సంగతి లక్ష్మణుడితో అని, అందుకు తార్కాణంగా నృగమహారాజు కథ యిలా చెప్పాడు,

పూర్వం నృగమహారాజు కోట్ల కొద్దీ ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆయన దానమిచ్చిన ఆవులలో ఒకటి ప్రమాదవశాన తిరిగి రాజుగారి ఆవుల మందలలో కలిసిపోయింది. అది తెలియక రాజు దాన్ని మరొక బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. మొదట దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు తన ఆవును వెతుక్కుంటూ తిరుగుతూ, కనఖలం అనే చోట రెండో బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించి, దానికి తాను పెట్టుకున్న పేరుతో పిలిచాడు. ఆ ఆవు తన పాత యజయాని గొంతు గుర్తించి, కట్టుతాడు తెంచుకుని, అతని వెంట బయలుదేరింది. అది చూసి రెండో బ్రాహ్మణుడు, ‘నా ఆవును నువ్వు తోలుకుపోతున్నావేమిటి? దీన్ని నాకు నృగమహారాజు దానమిచ్చాడు,” అన్నాడు.

“ఆ నృగమహారాజే దీన్ని నాక్కూడా దాన మిచ్చాడు.” మొదటి బ్రాహ్మణుడు. ఈ తగాదా వారిద్దరి మధ్యా పరిష్కారం అయేది కాదు గనక వారు తిన్నగా నృగమహారాజు వద్దకే వెళ్ళారు.

అయితే వారికి రాజదర్శనం ఎంతకూ కాలేదు. బయటి ద్వారం వద్ద రోజులు తరబడి పడిగాపులు కాయవలిసి వచ్చింది. చివరకు వాళ్ళు ఆగ్రహించి, ఊసరవెల్లి అయిపోయి ఎవరి కంటా పడకుండా గోతిలో జీవించమని రాజును శపించారు. రాజు బతిమాలగా, యదువంశంలో వాసుదేవుడు పుట్టి శాపవిమోచనం కలిగిస్తాడని చెప్పి ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయారు.

తరవాత నృగమహారాజు వసువనే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి, తాను ప్రజల కంట పడకుండా ఊసరవెల్లి జీవితం సుఖంగా గడపటానికిగాను కొన్నిగోతులు తవ్వించి, వాటిమీద చెట్లనీడా, వాటిచుట్టూ పూలమొక్కలూ ఏర్పాటు చేయించుకున్నాడు.

రాముడు లక్ష్మణుడికి నృగమహారాజు కథ చెప్పి, ఆ తరువాత నిమి అనే వాడి కథ కూడా చెప్పాడు.

నిమి ఇక్ష్వాకు మహారాజు కొడుకులలో పన్నెండోవాడు. అతను ఒక దివ్యమైన పురం కట్టించి, దానికి వైజయంతమని పేరు పెట్టాడు. అతను తన తండ్రికి సంతోషం కలిగించటానికై ఒక యజ్ఞం తలపెట్టి, వసిష్ఠుణ్ణి ఋత్విక్కుగా ఉండమని కోరాడు. అయితే వసిష్ఠుడు తనను ఇంద్రుడు ముందుగానే యజ్ఞం చేయించమని కోరాడనీ, ఇండ్రుడి యజ్ఞం పూర్తికాగానే తాను వచ్చి నిమి చేత యజ్ఞం చేయిస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు. అందు చేత నిమి గౌతముణ్ణి పెట్టుకుని యజ్ఞం పూర్తిచేసేశాడు. ఇంద్రుడి యజ్ఞం పూర్తికాగానే వసిష్ఠుడు తిరిగి వచ్చి, నిమి తన కోసం వేచి ఉండక గౌతముడిచేత యజ్ఞం పూర్తి చేయించుకున్నాడని తెలుసుకుని, కోపం చెంది, రాజును చూడబోయాడు. సరిగా ఆ సమయానికి నిమి నిద్రపోతూ ఉండటం జరిగింది. వసిష్ఠుడు రాజదర్శనం కోసం కొద్దిసేపు చూసి, కావాలనే నిమి తనను వేచి ఉంచాడనుకుని, “రాజా, మరొకరి చేత యజ్ఞం చేయించుకుని నన్నవమానించావు గనక నీ శరీరం నిశ్చేతనమగుగాక,” అని శపించాడు.

తరవాత రాజు మేలుకుని వసిష్ఠుడిచ్చిన శాపం తెలుసుకుని, “నిద్రపోయే నన్ను శపించిన నీ శరీరం కూడా చేతనం లేనిదైపోవుగాక” అని ప్రతిశాపమిచ్చాడు..

ఇలా ఒకరినొకరు శపించుకుని నిమి వసిష్ఠులు విదేహు లయిపోయారు. అప్పుడు వసిష్ఠుడు తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వాయురూపం ధరించి వెళ్ళి, “తండ్రి, నిమి శాపం వల్ల నా దేహం కాస్తాపోయింది. దేహం లేకపోవటం చేత ఎంతో బాధ, ఏ పనీ చెయ్యటానికి లేదు. అందుచేత నన్ను అనుగ్రహించి నాకు మరొక శరీరం కలిగేటట్టు చెయ్యి,” అన్నాడు.

బ్రహ్మ వసిష్ఠుణ్ణి మిత్రావరుణుల తేజస్సుతో తిరిగి శరీరాన్ని సంపాదించుకోమన్నాడు. ఆ విధంగా మరొక దేహాన్ని సంపాదించుకున్న వసిష్ఠుడే ఇక్ష్వాకువంశం వారికి పురోహితుడయాడు.

ఇక నిమి సంగతి. నిమి శరీరాన్ని మునులు రక్షించి, దేహం పోయిన నిమి సమస్తప్రాణుల కళ్ళలోనూ ఉండేటట్టుగా వరమిచ్చారు. తరువాత వారు నిమి దేహాన్ని మధించగా అందులో నుంచి ఒక పిల్లవాడు పుట్టి మిథీ అని పిలవబడ్డాడు. అతని పేరనే మిథిలానగరం ఏర్పడింది. అతనికి జనకుడని కూడా పేరు.

రాముడు చెప్పిన ఈ కథలు విని లక్ష్మణుడు, ” అన్నా, క్షత్రియుడై ఉండి కూడా నిమి వసిష్ఠుడి లాటి మహాత్ముడి పట్ల ఎందుకు శాంతి వహించలేదు ?” అన్నాడు.

“రోషం మూలాన ఎలాటి వాడైనా శాంతిని కోల్పోవటం సహజం. అలా రోషాన్ని నిగ్రహించుకున్నవాడు ఒక్క యయాతి మాత్రమే,” అంటూ రాముడు లక్ష్మణుడికి యయాతి వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు.

యయాతి నహుషుడి కొడుకు. అతనికి ఇద్దరు భార్యలు. ఒకతె వృషపర్వమహారాజు కుమార్తె అయిన శర్మిష్ట, రెండవది శుక్రాచార్యుడి కుమార్తె అయిన దేవయాని. కాని యయాతికి శర్మిష్టపైన ఉండే ప్రేమ దేవయానిపైన ఉండేది కాదు. అదేవిధంగా ‘అతనికి శర్మిష్ఠ కొడుకైన పూరుడిపైన ఉన్నంత మమకారం దేవయాని కొడుకైన యదుడిపైన ఉండేది కాదు. నిజానికి పూరుడు మంచి గుణవంతుడు, ఆ పైన శర్మిష్ఠ కొడుకు కూడానూ. తన తండ్రి పూరుడిపైన హెచ్చు ప్రేమ చూపటం సహించలేక యదుడు తన తల్లి అయిన దేవయానితో, “అమ్మా, శుక్రాచార్యుడంతట వాడి కూతురువై ఉండి నువూ, నీ కొడుకైన నేనూ ఇంత అవమానాన్ని ఎందుకు సహించాలి? మన మిద్దరమూ అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేద్దాం. ఈ అవమానాన్ని ఒక వేళ నువు సహించినా, నేను సహించలేను. ఆత్మహత్య చేసుకుంటాను, నాకు అనుజ్ఞ ఇయ్యి,” అని పెద్ద పెట్టున ఏడ్చాడు.

కొడుకు దుఃఖం చూసి దేవయానికి రోషం వచ్చింది. ఆమె తన తండ్రిని తలుచు కున్నది, వెంటనే శుక్రాచార్యుడు వచ్చాడు.

“నా భర్త నన్ను చాలా లోకువగా చూస్తున్నాడు. ఆ అవమానం భరించటం కష్టంగా ఉంది. నేను అగ్నిలో దూకో, విషం తినో, నీటిలో పడో ఆత్మహత్య చేసుకుందా మనుకుంటున్నాను,” అన్నది దేవయాని తండ్రితో,

శుక్రాచార్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి, యయాతిని ముసలితనంతో జీవించమని శపించి, కూతురినోదార్చి, ఇంటికి తిరిగి పోయాడు. శుక్రాచార్యుడి శాపాన్ని యయాతి ఎంతో సహనంతో స్వీకరించాడు.

అతను యదువును పిలిచి, “నాయనా, నేనింకా భోగాలతో తృప్తి పడలేదు. అందు చేత నా ముసలితనాన్ని నువు కొంత కాలం భరిస్తావా ? నాకు భోగాలతో తృప్తి కలిగాక నీ యౌవనం నీ కిచ్చి ముసలితనం తీసుకుంటాను,” అన్నాడు.

“నీ సరసన భోజనం చెయ్యటానికి అర్హుడైన పూరుడుండగా నీ ముసలితనాన్ని నేనెందుకు తీసుకోవాలి ? వాణే తీసుకోమను,” అన్నాడు యదువు.

అప్పుడు యయాతి పూరుణ్ణి పిలిచి యదువు నడిగినట్టే అడిగాడు. తన తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించటానికి పూరుడు మనస్ఫూర్తిగా అంగీకరించాడు. యయాతి తన ముసలితనాన్ని పూరుడికిచ్చి, వాడి యౌవనం తాను పొంది, అనేక వేల యజ్ఞలు చేశాడు, అనేక వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. చివరకతను తన కొడుకు నుంచి ముసలితనం తీసుకుని, వాడికే రాజ్యాభిషేకం చేసి, దేవయాని కొడుకైన యదువుకు రాజ్యార్హత లేకుండా చేశాడు. ‘

యయాతి అనంతరం పూరుడు ప్రతిష్ఠానపురం రాజధానిగా పెట్టుకుని చాలా కాలం రాజ్యం చేశాడు.

రామలక్ష్మణులిలా కథలు చెప్పుకుంటూండగానే రాత్రి గడిచిపోయింది. తూర్పున అరుణరేఖలు కనిపించాయి.

Leave a Reply