అగస్త్యమహాముని రాముడికి హనుమంతుడి కథ చెప్పుట
కార్తవీర్యార్జునుడికి పట్టుబడి విడుదల అయి కూడా రావణుడి మదగర్వం అణగలేదు. అతను ప్రపంచ మంతా తిరుగుతూ బలవంతులైన రాక్షసులనూ, మానవులనూ యుద్ధానికి సవాలు చేస్తూండేవాడు. ఒక సారి అతను కిష్కింధకు వెళ్ళి, వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
వాలి మంత్రి అయిన తారుడు రావణుడితో, “రావణా, ప్రస్తుతం వాలి కిష్కింధలో లేడు. మిగిలిన వానరులు నీతో యుద్ధం చెయ్యటానికి చాలరు గదా. వాలి సంధ్యావందనం చెయ్యటానికి “నాలుగు సముద్రతీరాలకూ వెళ్ళి ఉన్నాడు. అదుగో ఈ ఎముకల గుట్ట చూడు. ఇది వాలి చేతిలో చచ్చినవారి ఎముకల పోగు. నువు కూడా ఆ గుట్ట మీద చేరదలిస్తే కొంచెం ఆగు, వాలి త్వరలోనే తిరిగి వస్తాడు. లేక మరీ అంత తొందరలో ఉన్నట్టయితే, దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి, అక్కడే వాలి చేతిలో శీఘ్రంగా చచ్చిపోవచ్చు.” అన్నాడు.
రావణుడు తారుణ్ణి తిట్టి, పుష్పకం మీద దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి మేరుపర్వతంలాటి వాలి సంధ్య వార్చుతూ కనిపించాడు. రావణుడు కొంత దూరంలో పుష్పకం దిగి, వాలిని వెనక నుంచి పట్టుకునే ఉద్దేశంతో, అడుగుల చప్పుడు వినపడ కుండా వాలిని సమీపించాడు. కాని హఠాత్తుగా వాలి వెనక్కు తిరిగి, రావణుణ్ణి చూసి, అతని ఉద్దేశంగ్రహించి కూడా, ఏమీ ఎరగనట్టు ఉండి పోయాడు. కాని రావణుడు సమీపంలోకి వచ్చినట్టు తెలియగానే వాలి, గరుత్మం తుడు పామును పట్టినట్టుగా, రావణుణ్ణి పట్టుకుని, చంకలో పెట్టుకుని, రివ్వున ఆకాశంలోకి లేచాడు. రావణుణ్ణి విడిపించాలని అతని మంత్రులు కేకలు పెడుతూ వాలి వెంట పడ్డారు. కాని కొంత దూరం వెళ్ళి, వాలిని అందుకోలేక, అలిసిపోయి, వారు వెనక్కు వెళ్ళిపోయారు. అదే మంచిదయింది, లేకపోతే వారు వాలికి చిక్కి, ప్రాణాలతో బయటపడి ఉండేవారు కారు.
వాలి రావణుణ్ణి చంకలో పెట్టుకుని పడమటి సముద్రతీరానదిగి, అక్కడ స్నానం చేసి, సంధ్యవార్చి, ఉత్తర సముద్రానికి వెళ్ళాడు, ఆ తరవాత తూర్పు సముద్రానికి వెళ్ళాడు. అన్ని సముద్రాల వద్దా సంధ్యానుష్ఠానాలు ముగించుకుని వాలి రావణుడితోసహా కిష్కింధకు తిరిగి వచ్చాడు. కిష్కింధలోని ఉద్యాసంలో వాలి రావణుణ్ణి కిందికి దించి, నవ్వుతూ, “ఏం రావణా ? ఎక్కడి నుంచి రావటం ?” అని అడిగాడు.
రావణుడు వాలికి క్షమాపణ చెప్పు కుంటూ, “నీ వంటి బలశాలి, వేగవంతుడూ సృష్టిలో మరొకడు లేడు. నన్ను పట్టుకుని నాలుగు సముద్రాలలోనూ నువ్వొక్కడవే ముంచగలిగావు. నీశక్తి అపూర్వం. నేను నీతో అగ్నిసాక్షికమైన స్నేహం వాంఛిస్తున్నాను,” అన్నాడు.
ఆ ప్రకారమే అగ్నిని ప్రజ్వలింపజేసి, ఇద్దరూ కౌగలించుకుని, భ్రాతృస్నేహం అవలంబించారు. రావణుడు కిష్కింధలో ఒక నెలరోజులుండి, సుగ్రీవుడు పొందే మర్యాదలన్నీ పొందాడు. తరువాత రావణుణ్ణి, అతని మంత్రులు వచ్చి లంకకు తీసుకుపోయారు.
అగస్త్యుడు రాముడికి ఈ వృత్తాంతం చెప్పి, “రామా, నీ చేతిలో ఒక్క బాణంతో చచ్చిన వాలి అలాటి అపార బలసంపన్నుడు!” అన్నాడు.
దానికి రాముడు, “అగస్త్యమహర్షి, వాలి బలమూ, రావణుడి బలమూ అపూర్వమైనవని నేను అంగీకరిస్తాను గాని, నా ఉద్దేశంలో హనుమంతుడు వీరికన్న కూడా శక్తిమంతుడుగా కనిపిస్తాడు. అతడు నూరుయోజనాల సముద్రాన్ని లంఘించటమే గాక, రావణుడి లంకలోని అంతఃపురంలోకి అవలీలగా ప్రవేశించి, ఎందరో రాక్షస వీరులను ఒంటరిగా చంపి, లంకా నగరాన్ని తగలబెట్టినవాడు. అతను చేసిన సాహసాలు మూడు లోకాలలోనూ ఎవరికి సాధ్యంకావనిపిస్తుంది. అంత మహా బల శాలి వాలిని చంపకుండా, తన రాజైన సుగ్రీవుడు అష్టకష్టాలూ పడుతూంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఈ నా సందేహాన్ని తీర్చండి,” అని కోరాడు.
అది విని అగస్త్యుడు, “రామా, హనుమంతుణ్ణి గురించి నీవన్నదంతా నిజమే. అంతటి బలశాలి, వేగవంతుడూ, బుద్ధిశాలీ మరొకడుండడు. అతడు అతి బాల్యంలోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. బహుశా అతనికా విషయాలు జ్ఞాపకం కూడా ఉండవు. కాని మునులు అతనికి బాల్యంలోనే శాపం ఇచ్చారు. అతని విచిత్ర కథ చెబు తాను,” అంటూ ఇలా చెప్పాడు.
హనుమంతుడి తండ్రి కేసరి మేరు పర్వతం మీద రాజ్యం చేస్తూ ఉండేవాడు. కేసరి భార్య అంజన. ఆమె వాయుదేవుడికి హనుమంతుణ్ణి కన్నది. పసివాడైన హనుమంతుణ్ణి ఆమె ఒక చోట పడుకోబెట్టి, పళ్ళు తెద్దామని అడవికి పోయింది. అంతలో హనుమంతుడికి ఆకలి అయి ఏడవసాగాడు. అప్పుడే తూర్పుకొండ మీద ఎర్రగా సూర్యబింబం ఉదయించింది. అదేదో పండు అనుకుని దాన్ని పట్టుకోవటానికి ఆ శిశువు ఆకాశంలో ఎగిరి వెళ్ళ సాగాడు. సూర్యుడి కెదురుగా వెళ్ళే మరొక సూర్యుడి లాటి హనుమంతుణ్ణి చూసి, దేవతలూ, దానవులూ, యక్షులు దిగ్భ్రామ చెందారు. ఎందుకంటే, అప్పటికే అతని వేగం వాయువేగాన్నీ, గరుత్మంతుడి వేగాన్ని మించింది.
అలా సూర్యుడి కేసి ఎగురుతూ పోతున్న తన కొడుకు వెంట వాయుదేవుడు కూడా పరిగెత్తుతూ, ఆ శిశువుకు సూర్యుడి వేడి తగలకుండా మంచు బిందువులు చల్లుతూ వెళ్ళాడు. ఈ విధంగా తనను సమీపించే బాల హనుమంతుడి పైన సూర్యుడు కూడా తన ప్రతాపం చూపలేదు. అదీగాక, హనుమంతుడు సూర్యుణ్ణి చేరుకునే సమయానికే సూర్యుణ్ణి పట్టటా నికి రాహువు కూడా సూర్యుడి రథం పైకి వచ్చాడు. రాహువును చూడగానే హనుమంతుడు సూర్యుణ్ణి వదిలేసి రాహువును పట్టుకోబోయాడు. రాహువు భయపడి పారి పోయి, నిండు సభలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి, “ఇంద్రా, ఏమిటీ అన్యాయం? పర్వకాలం గదా అని నేను సూర్యుణ్ణి మింగబోయే సమయంలో అక్కడికి మరొక రాహువును పంపావు. వాడు సూర్యుడితోబాటు నన్ను కూడా పట్టుకుని మింగబోయాడు,” అన్నాడు.
వెంటనే ఇంద్రుడు రాహువును వెంటబెట్టుకుని ఐరావతం మీద సూర్యుడి వద్దకు వచ్చాడు. ఇంకా అక్కడే ఉన్న హనుమంతుడు రాహువును చూడగానే పట్టుకో వచ్చాడు. “ఇంద్రా, రక్షించు, రక్షించు,” అన్నాడు రాహువు.
“నేను వీణ్ణి చంపుతాను, భయపడకు,” అని ఇంద్రుడు రాహువుతో అంటూండగానే హనుమంతుడు ఐరావతాన్ని చూసి, అదేదో తెల్లని పండనుకుని, దాని పైకి వచ్చాడు. ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో మెల్లగానే హనుమంతుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు బాల హనుమంతుడు ఒక కొండ మీద పడిపోయాడు. అతని ఎడమ దవడ నలిగిపోయింది.
తన కొడుకును కొట్టినందుకు ఇంద్రుడి పైన కోపం వచ్చి వాయుదేవుడు ప్రపంచ మంతటా సంచరించటం మాని, తన కొడుకు నెత్తుకుని ఒక కొండ గుహలో కూర్చున్నాడు. ప్రాణులన్నీ ఉక్కిరిబిక్కిరి అయి పోయాయి. గంధర్వులూ, దేవతలూ మొదలైనవారు బ్రహ్మ దగ్గిరికి వెళ్ళి మొకపెట్టు కున్నారు. బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకుని వాయుదేవుడున్న గుహకు వెళ్ళాడు.
బ్రహ్మ మొదలైన వారిని చూడగానే వాయుదేవుడు తన కొడుకు నెత్తుకుని వచ్చి, బ్రహ్మ కాళ్ళ మీద పడ్డాడు. బ్రహ్మ చేతితో నిమరగానే, ప్రాణం కడబట్టి ఉన్న హనుమంతుడు తిరిగి ఎప్పటిలాగా ఆయాడు. వాయుదేవుడు సంతోషించి, తిరిగి ప్రపంచ మంతటా సంచరించ సాగాడు.
వాయుదేవుణ్ణి మరింత సంతోషపెట్టే ఉద్దేశంతో బ్రహ్మ, దిక్పాలకులను హనుమంతుడికి వరాలివ్వమన్నాడు. తన మూలంగా హనువు (దవడ) దెబ్బతిన్నది గనక అతనికి హనుమంతుడని పేరు పెట్టుతూ, ఇక ఎన్నటికీ అతనికి వజ్రాయుధం చేత దెబ్బతగలకుండా ఇంద్రుడు వర మిచ్చాడు. సూర్యుడు హనుమంతుడికి తన తేజస్సులో ఒక శాతం ఇచ్చాడు; హనుమంతుడు గొప్ప వక్తా, మహాపండితుడూ అయేటట్టు వరం కూడా ఇచ్చాడు.. హనుమంతుడికి జల గండం లేకుండా వరుణుడూ, కాలదండం వల్ల చావు లేకుండా యముడూ, తన గద వల్ల హను మంతుడికి ప్రమాదం కలగకుండా కుబేరుడూ వరాలిచ్చారు. తన వల్ల గాని, తన అస్త్రాల వల్ల గాని హనుమంతుడికి అపాయం లేకుండా శివుడు వరమిచ్చాడు. బ్రహ్మదేవుడూ, విశ్వకర్మా కూడా అలాటి వరాలే ఇచ్చారు. ఈ వరాలన్నిటి వల్లా హనుమంతుడు శత్రువులకు భయంకరుడూ, యుద్ధంలో ఓటమి లేనివాడూ, కామరూపీ, కామగమనం గలవాడూ అయాడు. వాయుదేవుడు పొందిన సంతోషం అంతా ఇంతా కాదు.
ఆ తరువాత హనుమంతుడు అపార బలసంపన్నుడై, నిర్భయంగా సంచరిస్తూ, ఆశ్రమాలలోని మునులకు నానా యాతనలూ కలిగిస్తూ వచ్చాడు. అతను దేవతల చేత వరాలు పొందిన వాడని తెలిసిన మునులు, అతను తమ నారబట్టలనూ, అగ్ని హెూత్రాలనూ, కుండలనూ, కృష్ణాజినాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పటికీ చూసి చూడనట్టుగా ఉండిపోయారు. ఒక వంక కేసరీ, మరో వంక వాయుదేవుడూ వద్దని చెబుతున్నా హనుమంతుడు తన ఆకతాయితనం మానలేదు. చివరకు మహర్షులు హనుమంతుడి పైన అలిగి, “నీ బలం చూసుకునే గదా నువ్వీ దుండగాలు చేస్తున్నావు? ఇంకొకరు చెబితే తప్ప నీ బలం నీకు తెలియకపోవు గాక !” అని అతడికి శాపం పెట్టారు.
అటు పైన హనుమంతుడు తన సంగతి తానే ఎరగకుండా బుద్ధిమంతుడై ఆశ్రమాలలో ఉంటూ వచ్చాడు. ఆ కాలంలో వాలి సుగ్రీవుల తండ్రి అయిన ఋక్షరజసుడు వానరరాజుగా ఉంటూ చనిపోయాడు. అప్పుడు వానరులు, పెద్దవాడైన వాలికి రాజ్యాభిషేకం చేసి, చిన్నవాడైన సుగ్రీవుణ్ణి యువ రాజు చేశారు. హనుమంతుడికి, సుగ్రీవుడికి బాల్యంలోనే ఎడతెగని స్నేహం ఏర్పడింది. కాని, వాలికీ, సుగ్రీవుడికి వైరం ఏర్పడి సుగ్రీవుడు నానా పాట్లూ పడినప్పుడు హనుమంతుడు తన బలం తానే ఎరగని కారణం చేత అతనికి ఏ విధం గానూ సహాయపడలేక పోయాడు.
ఈ విధంగా హనుమంతుడి కథ రాముడికి చెప్పి అగస్త్యమహాముని, ” రామా, ఈ హనుమంతుడు ఎలాటి శక్తి గలవాడనుకున్నావు? ఇతను వ్యాకరణం నేర్చుకోగోరి సూర్యుడితో బాటు ఉదయగిరి నుంచి ఆస్తగిరి దాకా తిరిగేవాడు. ఏ విద్య లోనూ ఇతనితో సమానులు లేరు. ఇతను ముందు కాబోయే బ్రహ్మ,” అన్నాడు.
ఈ విధంగా హనుమంతుడి కథ విన్న రాముడు అగస్త్యుడితో, “స్వామి, వాలి సుగ్రీవుల తండ్రి అయిన ఋక్షరజసు డెవరు? వారి తల్లి ఎవరు? ఆ కథ కూడా చెబితే సంతోషిస్తాను,” అన్నాడు.