హనుమంతుడు సీతను కలుసుకోనుట

సీత హనుమంతుని చూసి “నేను దశరథుడి కోడల్ని, జనకుడి కూతురిని, రాముడి భార్యను. నా పేరు సీత అంటారు నేను కాపురానికి వచ్చిన పదమూడో ఏట నా భర్తకు రాజ్యాభిషేకం జరగనుండగా, దశరధుడి భార్య అయిన కైకేయి అనే ఆమె రామ పట్టాభిషేకం చేస్తే తాను ప్రాణ త్యాగం చేస్తానని రాముణ్ణి వనవాసం పంపెయ్యమని కోరింది తండ్రి ఆశించిన మీదట రాముడు తాను పుచ్చుకోనున్న రాజ్యాన్ని తిరిగి తండ్రికి ఇచ్చివేశాడు. అతను నార బట్టలు కట్టుకుని వనవాసం పోతూ నన్ను తన తల్లి అయిన కౌశల్య వద్ద ఉండమన్నాడు. నేను రాముణ్ణి విడిచి ఉండలేక వెంట బయలుదేరాను. నాకన్న ముందే నార బట్టలు కట్టి బయలుదేరాడు లక్ష్మణుడు. మేము దండకారణ్యంలో ఉండగా  దుర్మార్గుడైన రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఆ రావణుడు నన్నింకా రెండు నెలలు బతకనిస్తాడు, ఆ తరువాత నా ప్రాణాలు తీస్తాడు,” అన్నది.

సీత దుఃఖం చూసి హనుమంతుడికి కూడా దుఃఖం వచ్చింది. అతను ఆమెకు దుఃఖోపశమనం కలిగేటట్టుగా, “సీతాదేవి,రాముడి దూతగా నేను నీ వద్దకు వచ్చాను. రాముడు తన క్షేమం నీకు చెప్పి, నీ క్షేమం తెలుసుకు రమ్మన్నాడు. లక్ష్మణుడు నీకు సాష్టాంగ నమస్కారం చేశాడు అని చెప్పాడు ఈ మాటలు వినగానే సీతకు శరీరమంతా పులకించింది. మనిషి బ్రతికి ఉండాలే గాని నూరేళ్ళకైనా ఆనందం కలగకపోదంటారు. అది నా విషయంలో నిజమైంది,” అన్నదామె.

సీతకు తనపై నమ్మకం కుదిరిందనుకుని హనుమంతుడు ఆమెను సమీపించాడు. ఇది చూసి సీత రావణుడే వానర రూపంలో వచ్చాడని అనుమానించి, అతనితో ఆత్మీయంగా మాట్లాడినందుకు భయపడుతూ అశోక వృక్షం కొమ్మ విడిచి నేలపై చతికిలబడింది.తనకు నమస్కారం చేస్తున్న హనుమంతుడి ముఖం చూడడానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె హనుమంతుడితో “నీవు నిజంగా రావణుడవే. ఇప్పుడు ఈ కోతి రూపంలో వచ్చావు. ఆనాడు సన్యాసి రూపంలో వచ్చావు. నేను అసలే దుఃఖంతోను ఉపవాసాలతో కృశించి ఉన్నాను. నన్నిలా మరింత బాధపెడుతున్నావెందుకు? ఇది నీకు మంచిది కాదు. ఒకవేళ నీవు నిజంగా రామదూతవే అయితే రాముడి గుణకణాలు వర్ణించు. రామలక్ష్మణుల గుర్తులు చెప్పు. రాముడితో నీకెప్పుడు సంబంధం కలిసింది? నీవు రామలక్ష్మణుల నెలా ఎరుగుదవు? నరవానరులకు పొత్తు ఎలా కుదిరింది? “అని అడిగింది.

హనుమంతుడు రాముడి గుణగణాలు వివరించాడు. రాముణ్ణి ఆపాదమస్తకమూ వర్ణించాడు. సీతాపహరణానంతరం రామ లక్ష్మణులు ఋశ్య మూక పర్వతప్రాంతానికి వచ్చినది మొదలు తాను లంకకు వచ్చిన దాకా జరిగినదంతా పూసగుచ్చినట్టు సీతకు చెప్పాడు. తాను హనుమంతుణ్ణనీ, సుగ్రీవుడి మంత్రిననీ తెలిపి రాముడిచ్చిన ముద్రికను సీత చేతిలో పెట్టాడు.

సీతకు హనుమంతుడి యందు నమ్మకం కుదిరింది. ఆమె ముఖం విప్పారింది. ఆమె ఆంజనేయుణ్ణి పొగడుతూ, అతను మామూలు కోతి కాడనీ, ఎంతో శక్తిసామర్థ్యా లుండబట్టే సముద్రం దాటి రాగలిగాడనీ, రావణుడు కూడా అతన్ని ఏమీ చేయలేడని అన్నది. అప్పటికప్పుడే ఆమె రాముడు వచ్చి తనను రక్షిస్తాడనీ, అయోధ్య నుంచి భరతుడు కూడా వానరసేనకు తోడుగా ఒక అక్షౌహిణి సేనను పంపుతాడని, రామలక్ష్మణులు సపరివారంగా రావణుణ్ణి యుద్ధంలో హతమార్చుతారనీ కలలు కన్నది. రాముడు తనను తీసుకుపోతాడో పొడో అన్న అనుమానం కూడా ఆమెకు కలి గింది; తీసుకుపోకపోతే ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నది.

రాముడు అస్తమానమూ సీతనే స్మరిస్తూంటాడనీ, ఆమె వెళ్ళిపోయిన తరువాత అతను మాంసాహారమూ, మద్యపానము. కూడా మానేశాడనీ, సీత ఇక్కడ ఉన్నదని తెలియగానే వచ్చి వాలుతాడనీ హనుమంతుడు చెప్పాడు. తనకు రావణుడిచ్చిన ఏడాది గడువులో పది నెలలు నిండవచ్చాయని, మిగిలిన రెండు మాసాలలోగా రాముణ్ణి రమ్మని చెప్పమనీ సీత హనుమంతుడితో అన్నది. ఆమె హనుమంతుడితో ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పింది. లంకలో సీత పక్షం వహించిన వారున్నారు. వారిలో విభీషణుడూ, అతని భార్యా, అతని పెద్ద కూతురు నలా, అవింధ్యు డనే ఒక రాక్షసుడూ ఉన్నారు.

హనుమంతుడు సీతతో, “అమ్మా, నీవింక ఒక్క క్షణం కూడా దుఃఖించ నవసరంలేదు. నా వీపు పైన ఎక్కు, ఒక్క క్షణంలో సముద్రాన్ని దాటేస్తాను,” అన్నాడు.

హనుమంతుడు చిన్న ప్రమాణంలో ఉండటం చూసి సీత అతని మాటలు నమ్మలేక, “నీవేమిటి? నన్ను వీపున ఎక్కించుకుని సముద్రం దాటటమేమిటి? మొత్తానికి కోతి వనిపించావు,” అన్నది.

ఈ మాట హనుమంతుడికి అవమానమయింది. అతను సీతకు కొంచెం ఎడంగా వెళ్ళి తన శరీరాన్ని భయంకరంగా పెంచాడు. అతని శరీరం మండుతున్నట్టు కాంతి వంతంగా కనబడింది. “సీతాదేవి, నిన్నే కాదు, ఈ లంక నంతా పాదుతో సహా పెరికి తీసుకుపోగలను. అందుచేత భయపడక నా వెంబడి వచ్చెయ్యి,” అన్నాడతను.

కాని సీత అభ్యంతరాలు చెప్పింది. తనను వీపున ఎక్కించుకుని సముద్రం మీదుగా బయలుదేరగానే సాయుధులైన రాక్షసులు చుట్టు ముట్టుతారనీ, తాను భయపడి సముద్రంలో పడిపోవచ్చుననీ, అందువల్ల తనకూ, హనుమంతుడికి కూడా అపాయం కలగవచ్చుననీ, ఒక వేళ హనుమంతుడే రాక్షసులనందరినీ చంపినా అందువల్ల రాముడికి అపకీర్తి వస్తుందనీ, అందుచేత హనుమంతుడు వెంటనే తిరిగి వెళ్ళి శీఘ్రంగా రాముణ్ణి తీసుకురావటమే మేలనీ అన్నది. హనుమంతుడు పర పురుషుడు గనక అతని శరీరాన్ని తాకటానికి తన కభ్యంతరంవున్నట్టు సీత వ్యంగ్యంగా, “నేను పతివ్రతను. రాముడి శరీరాన్ని తప్ప తాకలేదు. ‘రావణుడు నిన్ను తాక లేదా ?” అంటావేమో, ఆ సమయంలో నేను ఏమి చెయ్యటానికి అసమర్థురాలిని,పైన దుఃఖవివశనై ఉన్నాను, నా భర్త దగ్గిర లేడు. అలాటిస్థితిలో రావణుడు నన్ను తాకాడు,” అన్నది.

హనుమంతు డీ అభిప్రాయాన్ని గ్రహించి, ” పరపురుషుడి నైన నా వీపుపై ఎక్కటానికి నీ కభ్యంతరం ఉండటం భావ్యమే. నిన్ను నేను చూసినట్టు గుర్తుగా రాముడికి ఏమైనా ఇయ్యి,” అన్నాడు.

Leave a Reply