హనుమంతుడు సముద్రాన్ని లంఘించుట
హనుమంతుడు అక్కడి నుంచి ఆకాశంలోకి మరింత ఎత్తుగా ఎగిరి ముందుకు సాగాడు. మైనాకుడిచ్చిన ఆశ్రయాన్ని నిరాకరించి దీక్షతో లంకకు వెళ్ళే హనుమంతుడికి దేవతలు పరీక్ష పెట్ట గోరి, పాములకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, “వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా ఎగురుతూ లంకకు పోతున్నాడు. నీవు భయంకరాకారం ధరించి అతని దారికి అడ్డం తగులు. అతను నిన్ను జయించి పోతాడో, నిన్ను చూసి భయపడతాడో చూడగోరుతున్నాం. అతని పరాక్రమం ఎంతటిదో తెలుసుకోవాలని మా అందరి కోరిక,” అన్నారు.
సురస వారి కోరిక తీర్చటానికై కొండంత రాక్షసరూపం ధరించి, పెద్ద కోరలతోనూ, గోరోజనం రంగుగల కళ్ళతోనూ భయంక రంగా తయారై, హనుమంతుడి దారికడ్డంగా నిలబడి, ” హనుమంతుడా, నిన్ను భక్షించటానికి దేవతలు నాకు అనుజ్ఞ ఇచ్చారు. కనక నీవు నా నోట్లోకి ప్రవేశించు,” అన్నది.
హనుమంతుడు సురసకు నమస్కారం చేసి, నవ్వుతూ, “రాముడు వనవాసం చేస్తూండే సమయంలో, ఆయన లేనప్పుడు, రావణుడు ఆయన భార్య అయిన సీతను ఎత్తుకు పోయాడు. నేను రాముడి దూతగా ఇప్పుడు సీత వద్దకు పోతున్నాను. రాముడి రాజ్యంలో ఉండే దానివే గనక నీవుకూడా శ్రీరామకార్యానికి తోడ్పడాలి. కాదంటావా, రాముడి వద్దకు వెళ్ళి అనుమతి పొంది, నీ నోట ప్రవేశిస్తాను. ఇందుకు నా కేమీ అభ్యంతరం లేదు,” అన్నాడు.
సురస ఆ మాటకు జవాబివ్వక, ” నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు. ఆ విధంగా నాకు వరం ఉన్నది. నా నోటి ముందుకు వచ్చిన వాడు తప్పించుకు పోలేకుండా నాకు బ్రహ్మ వరమిచ్చాడు. కనక నా నోట ప్రవేశించు,” అంటూ నోరు తెరిచి హనుమంతుడి ముందు నిలబడింది.
ఈ మాటకు హనుమంతుడు అలిగి, “అయితే నన్ను మింగేటంతగా నోరు తెరు!” అంటూ, తన శరీరాన్ని పది ఆమడల ప్రమాణానికి పెంచాడు. వెంటనే సురస తన నోటిని ఇరవై ఆమడల ప్రమాణానికి పెంచింది. హనుమంతుడు కోపంతో తన దేహాన్ని ముప్ఫై ఆమడలకు పెంచాడు. సురస తన నోటిని నలభై ఆమడలు చేసింది. హనుమంతుడు తన శరీరాన్ని యాభై ఆమడలకు పెంచాడు.
ఈ విధంగా పోటీ పడటంలో హను మంతుడి శరీరం తొంభై ఆమడలూ, సురస నోరు నూరామడలూ అయాయి.
అకస్మాత్తుగా హనుమంతుడు తన శరీరాన్ని వేలంతగా చేసి, తూనీగలాగా సురస నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి వచ్చి, “ఓ సురసా, బ్రహ్మదేవుడు నీ కిచ్చిన వరం సార్థక మయింది. నీ నోటి ముందుకు ‘ వచ్చిన నేను నీ నోట ప్రవేశించాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టు. సీత ఉండే చోటికి వెళ్ళాలి.” అన్నాడు.
సురస రాక్షస రూపం విడిచిపెట్టి మామూలు రూపు ధరించి, “వెళ్ళిరా, నాయనా నీకు విజయం కలుగుతుంది. రామున్ని సీతను తిరిగి కలుపు! అని చెప్పి తన నివాసానికి వెళ్ళింది.
హనుమంతుడు తిరిగి ప్రయాణం సాగించాడు. ఆకాశంలో ఎగిరిపోయే హనుమంతుడిని సింహిక అనే రాక్షస జంతువు సముద్రంలో ఉండి చూసింది. అది ఆకలితో ఉండటం చేత హనుమంతుడిని తినగోరి అతని నీడను పట్టుకొని ఈడ్చింది. తనను ఎవరో వెనక్కు లాగేస్తూండటం గమనించి హనుమంతుడు ఆశ్చర్యపోయి, అటూ, ఇటూ, అన్ని పక్కలా చూసేసరికి సముద్రం మీద సింహిక కనిపించింది. అది తన నీడను పట్టుకుని ఉండటం చూడగానే హనుమంతుడికి సుగ్రీవుడు ఎప్పుడో అన్న మాట జ్ఞాపకం వచ్చింది. దక్షిణ సముద్రంలో ఒక వింత జంతు వున్నదని, అది నీడను పట్టుకోగలదనీ సుగ్రీవు డన్నాడు. అదే ఇది అయి ఉంటుందని హనుమంతుడ కున్నాడు.
సింహిక శక్తి ముందు హనుమంతుడి పరాక్రమం ఎందుకూ పనికి రాలేదు. అది అతన్ని తన కేసి ఈడ్చుకున్నది. హనుమంతుడు తన శరీరాన్ని అపారంగా పెంచాడు. అందుకు తగ్గట్టుగానే సింహిక కూడా భయంకరంగా నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటి, కుండా హనుమంతుడు దాని శరీరంలోని మర్మస్థానాలు గమనించి, తన శరీరాన్ని చిన్నదిగా చేసి, లోపలికి ప్రవేశించి, సింహిక మర్మాలు చీల్చేసి, అది తిరిగి నోరు మూసే – లోపుగా బయటికి వచ్చేసి, తన శరీరాన్ని పెద్దది చేసుకున్నాడు. సింహిక గుండెలు చీలిపోయి స్పృహ తప్పి చచ్చి, నీటిపై తేలింది. చచ్చిన సింహికనూ, చంపిన హనుమంతుణ్ణి చూసి ఆకాశంలో సంచరించే భూతాలు ఎంతో సంతోషించి, హనుమంతుణ్ణి కీర్తించాయి.
హనుమంతుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత సేపటికి అతనికి సముద్రపు అవతలి తీరం కనిపించింది. అక్కడ అడవు లున్నాయి. పోయినకొద్దీ లంకా ద్వీపమూ, అక్కడి వనాలూ, చెట్లూ మరింత బాగా కనిపించాయి. లంకలోని నదులు సముద్రంలో వచ్చి పడటం కనిపించింది.
తన దేహం ఇంకా పెద్దదిగానే ఉండటం హనుమంతుడికి జ్ఞాపకం వచ్చింది. లంకలోని రాక్షసులు అంత శరీరంతో ఉన్న తనను చూశారంటే హాహాకారాలు చేసి, అందరికీ చెబుతారు; అప్పుడు తాను వచ్చిన పనికాస్తా పాడైపోతుంది. అందుచేత హనుమంతుడు తన దేహాన్ని చిన్నదిగా చేసుకున్నాడు.
ఆ శరీరంతో అతను ఆలంబపర్వతం మీద దిగాడు. దాని మీద విరిగిచెట్లూ, మొగలి పొదలూ, కొబ్బరిచెట్లూ ఉన్నాయి. ఎత్తుగా త్రికూటపర్వతం పైన లంకానగరం కనిపిస్తున్నది. అది దేవేంద్రుడి అమరావతీ నగరంలాగున్నది.