సుగ్రీవుడు వాలినీ యుద్దానికి కవ్వించుట

రామ లక్ష్మణులు సుగ్రీవుడు మొదలైన వారందరూ కిష్కింధకు వెళ్ళారు. మిగిలిన వారంతా దట్టమైన చెట్ల చాటున దాక్కున్నారు, సుగ్రీవుడు మటుకు దట్టీ బిగించి, వాలికి వినపడేలాగా భయంకరమైన, గర్జనలు చేశాడు.

తమ్ముడి గర్జనలు విని మండిపడుతూ వాలి వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ ఘోరంగా తన్నుకున్నారు. రాముడు విల్లూ,బాణము పట్టుకుని కూడా వారిద్దరిలో ఎవరు వాలి అయినదీ ఎవరు సుగ్రీవుడైనదీ తెలుసుకోలేక చూస్తూ ఉండిపోయాడు.

ఈలోపల సుగ్రీవుడు వాలి చేత చావు దెబ్బలు తిని, ఒళ్ళంతా నెత్తురు కారుతూ ఆయాసంతో అటూ ఇటూ చూసి, రాముడు కనబడకపోయేసరికి పారిపోసాగాడు. వాలి అతని వెంట పడ్డాడు. సుగ్రీవుడు వాలికి చిక్కకుండా పారిపోయి ఋశ్యమూకం చేరుకున్నాడు. “బతికి పోయావు పో!” అని వాలి వెనక్కు తిరిగి వచ్చేశాడు.

తరవాత రామ లక్ష్మణులూ, హనుమంతుడూ కూడా ఋశ్యమూకానికి తిరిగి వెళ్ళారు. సుగ్రీవుడు రాముణ్ణి చూసి అవమానంతో తల వంచుకుని, “ఇదేంపని? నన్ను తన్నించటానికా వాలిని యుద్ధానికి పిలవమన్నావు? వాలిని చంపటం చేత కాదని చెప్పి ఉంటే నేను ఇక్కడ నుంచి కదలనే కదలను గద!” అన్నాడు.

జరిగిన దానికి చింతిస్తూ రాముడు, ‘సుగ్రీవుడా, నా మీద ఆగ్రహించకు. మీరిద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. మీ కంఠ స్వరాలు కూడా ఒకటిగానే ఉన్నాయి. ఎవరు ఎవరో తెలియక నేను బాణం వెయ్య లేదు. నా అజ్ఞానం చేత నీకు అపాయం కలిగింది. మన్నించు. నీవు ఏదైనా గుర్తు ధరించి మళ్ళీ వాలితో యుద్ధం చేసినట్టయితే ఒక్క బాణంతో అతన్ని పడగొట్టుతాను, నా మాట నమ్ము,” అన్నాడు.

కొండచరియ పైన గజపుష్పి అనే లత పూలతో సహా పెరుగుతున్నది. లక్ష్మణుడు దాన్ని పెరికి తెచ్చి సుగ్రీవుడి మెడకు చుట్టాడు. అందరూ మరొకసారి కిష్కింధకు బయలుదేరి వెళ్ళారు.

గజపుష్పి మెడకు చుట్టుకున్న సుగ్రీవుడి వెంట నళుడూ, నీలుడూ, తారుడూ కూడా ఉన్నారు. కిష్కింధకు వెళ్ళే దారిలో రాముడికి చెట్లతో దట్టంగా ఉన్న ఒక వనం కనిపించింది. రాముడు దాన్ని గురించి సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు. అది ఒక ఋష్యాశ్రమం. సప్త జనులనే పేరు గల ఏడుగురు ఋషులు ఆ ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేశారు; నీటిలో తల కిందులుగా నిలబడి, వాయుభక్షణ చేస్తూ తపస్సు చేసి, శరీరాలతో స్వర్గానికి వెళ్ళి పోయారు. ఆ ఆశ్రమంలోకి మనుషులు కారు గదా, పశుపక్ష్యాదులు కూడా ప్రవేశించ లేవు; తెలియక లోపలికి వెళితే తిరిగి బయటికి రావటమంటూ ఉండదు.

రామలక్ష్మణు లిద్దరూ సప్తజన మహర్షులను తలుచుకుని ఆ ఆశ్రమానికి సమస్కరించి ముందుకు పోయారు. చాలాదూరం వెళ్ళాక వారు కిష్కింధ చేరుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, “వాలిని చంపుతానని మాట ఇచ్చావు. ఆ పని శీఘ్రంగా చెయ్యాలి,” అన్నాడు.

“ఈసారి వాలిని ఒక్క బాణంతో నిశ్చయంగా పడగొట్టుతాను. ఒకే రూపు గల మీ ఇద్దరిలో తారతమ్యం తెలియటానికి ఈసారి నీ మెడలో గజ పుష్పలత ఉన్నది కద. అందుచేత నీ కేమీ జంకు వద్దు. వాలిని యుద్ధానికి పిలు,” అని రాముడు చెప్పాడు. చుట్టూ ఉండే దట్టమైన అరణ్యంలో అందరూ దాగారు.

సుగ్రీవుడు అరణ్యాన్ని ఒక్కసారి కలయజూసి భయంకరంగా గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు.

ఈ గర్జన వింటూనే వాలికి పట్టరాని ఆగ్రహావేశం వచ్చేసింది. అతను యుద్ధానికి బయలుదేరాడు. ఇది చూసి తార చప్పున లేచి వాలిని పట్టుకుని, ఇలా అన్నది.

“ఈ రాత్రివేళ నీవు వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చెయ్యవద్దు. కావలిస్తే రేపు ఉదయం వెళుదువుగాని. ఈలోపుగా నీ బలం తరిగి పోదు, సుగ్రీవుడి బలం హెచ్చి పోదు. ఇంతలో వచ్చిన తొందర ఏమిటి? కొంచెం ఆలోచించు! నేను అకారణంగా నిన్ను అడ్డగించటం లేదు. ఒకసారి నీ చేత చావు దెబ్బలు తిని దిక్కు తెలియకుండా పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడు ఏ ధైర్యంతో నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు? ఎవరిఅండో చూసుకునే అతను నిన్ను కవ్విస్తున్నాడు. వారెవరో కూడా నాకు తెలుసు.అయోధ్య రాజైన దశరధుడి కొడుకులు రామ లక్ష్మణులు సుగ్రీవుడుండే ఋశ్యమూకానికి పచ్చి అతనితో సఖ్యం చేశారట. వారు ఇదివరకే విరాధుణ్ణి, ఖర దూషణులనూ, కబంధుణ్ణి చంపారట. చాలా పరాక్రమవంతులు. వారిని గురించి మన అంగదుడికి చారులు చెప్పారు. సుగ్రీవుడు చాలా గడుసువాడు. ఒకంతట ఇతరులను నమ్మడు. రాముడి అండ చూసుకునే అతను ఇప్పుడు వచ్చాడు; అందుకేమీ సందేహం లేదు. నీ మేలుకోరి ఇంకొక మాటకూడా చెబుతాను. ఇప్పుడు సుగ్రీవుడు నీ కన్న బలవంతుడని తెలుసుకో. అతన్ని పిలిచి యువరాజుగా అభిషేకించు. నీ తమ్ముడే కదా, కిష్కింధలోనే ఉండనీ నీకు రాముడి, స్నేహం కూడా కలిసి వస్తుంది. సుగ్రీవుడితో యుద్ధ మంటే రాముడితో యుద్ధమే., రాముడితో యుద్ధం నీకు క్షేమకరం కాదు.”

Leave a Reply