లక్ష్మణుడు సుగ్రీవునిపై ఆగ్రహించుట

ఒకనాడు లక్ష్మణుడు ఫలాల కోసం కొండ కోనలన్నీ చెడతిరిగి వచ్చేసరికి రాముడు అగాధమైన దుఃఖంలో ముణిగి ఉన్నాడు. అతనికి శరత్కాలంతోబాటు సీతా వియోగ బాధ కలిగి దుఃఖం ముంచు కొచ్చింది. లక్ష్మణుడు తన అలవాటు ప్రకారం రాముణ్ణి ఊరడించి, దుఃఖం నిరుపయోగ మనీ, కర్తవ్యం నెరవేర్చటానికి ధైర్యమూ, ఉపాయమూ కావాలనీ జ్ఞాపకం చేశాడు.

అంతా విని రాముడు, “లక్ష్మణా, వానాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చింది. ఈ నాలుగు నెలలూ ఎంతో బాధతో గడిపాను. రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయం వచ్చినా సుగ్రీవుడి జాడలేదు. అతను ఏ ప్రయత్నంలోనూ ఉన్నట్టు కనపడడు. అతనికి నా మీద ఇంకా దయ రాలేదు. ‘రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు, అడవుల పాలై, భార్యను రావణు డపహరించగా దైన్యంతో మన శరణు జొచ్చాడు,’ అని సుగ్రీవుడు నన్ను అనాదరంగా చూస్తు న్నట్టున్నాడు. లేక తన పని గడిచింది గదా అని తాను చేసిన వాగ్దానాన్ని మరిచాడో ! నీవు కిష్కింధకు వెళ్ళి నేను చెప్పినట్టుగా అతనితో చెప్పు, అన్న మాట నిలబెట్టుకొని వాడు పురుషాథముడు. ప్రత్యుపకారం చెయ్యని వాడి శవాన్ని కాకులూ గద్దలూ కూడా ముట్టవు. అతనికి నా బాణం యొక్క ధ్వని మళ్ళీ వినాలని ఉన్నదేమో! ఇందుకేనా ఈ సుగ్రీవుడితో నేను స్నేహం చేసి, వాలిని చంపింది? వాలిని ఒక్కణ్ణి చంపాను, ఈ సుగ్రీవుణ్ణి బంధువులతో సహా చంపగలను. అందుచేత నీవు సుగ్రీవుడితో ఎలా చెప్పాలో అలా చెప్పు,” అన్నాడు.

లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపై పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను రాముడితో, “నీ మూలానే తనకు రాజ్యప్రాప్తి, భార్యాప్రాప్తి కలిగిందని కూడా తలచకుండా సుగ్రీవుడు, తాగి భార్యలతో తల కిందులై పోతున్నాడు. ఇలాటివాణ్ణి రాజుగా ఉండనివ్వరాదు. నాకు మండిపోతున్నది. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి వాలి దగ్గిరికి పంపించేస్తాను, సీతను వెతకటానికి అంగదుడున్నాడు, వానర వీరులున్నారు,” అన్నాడు, బాణాలు తీసుకుని బయలుదేరుతూ.

రాముడు లక్ష్మణుడితో శాంతంగా, “లక్ష్మణా, తొందరపడకు. మిత్రవధ చేసి నిష్కారణంగా పాపం అంటగట్టుకోకు. సుగ్రీవుడు అన్న సమయానికి రాకపోవటం తప్ప వేరే మహాపరాధం ఏం చేశాడు? నీవు వెళ్ళి అతనితో మృదువుగానే మాట్లాడు,” అని అతన్ని పంపేశాడు.

లక్ష్మణుడు కిష్కింధ చేరి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు. అణగని కోపంతోనూ, అతి వేగంతోనూ పోతున్న లక్ష్మణుణ్ణి చూసి పెద్ద పెద్ద వానర వీరులు, అతనెవరో శత్రు వనుకుని, అతని పైన వెయ్యటానికి చెట్లు పీకారు. అది చూసి లక్ష్మణుడు వారి కేసి నిప్పులు కక్కుతూ చూశాడు. దానితో వారు భయపడి దూరంగా తొలగారు. కొందరు సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నాడని చెప్పారు. కాని సరస సల్లాపాలలో ముణిగి ఉన్న సుగ్రీవుడా మాట వినిపించుకోలేదు.

ఈలోపల సుగ్రీవుడి మంత్రులు, లక్ష్మ ణుడు నిజంగా వస్తున్నాడేమో చూసి రమ్మని కొందరు వానరులను పంపారు. వాళ్ళతో బాటు వచ్చిన అంగదుణ్ణి చూసి లక్ష్మణుడు, ” నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. నాతో మాట్లాడతాడో లేదో, తెలుసుకుని వెంటనే రా!” అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, అతనికి నమస్కారం చేసి, లక్ష్మణుడు చెప్పమన్నట్టే చెప్పాడు. కాని సుగ్రీవుడు తాగిన మత్తులో ఉండి ఏమీ వినిపించుకోలేదు. అయితే లక్ష్మణుడి రౌద్రాకారం చూసి వానరులు చేసిన కలకలానికి సుగ్రీవుడి మత్తు కొంత వదిలింది.

అంగదుడు అవతలికి వెళ్ళి ప్లకుడూ, ప్రభావుడూ అనే మంత్రులతో సుగ్రీవుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను కొంత స్పృహలో ఉన్నాడు. వారు అతనితో లక్ష్మణుడు మాట్లాడటానికి వచ్చాడని చెప్పారు.

లక్ష్మణుడు ఉత్తగాకాక ధనుర్బాణాలతో సహావచ్చాడనీ, చాలా కోపంలో ఉన్నాడనీ సుగ్రీవుడికి తెలిసింది.

సుగ్రీవుడు మంత్రులతో, “నేనేమీ తప్పు చేయలేదే, లక్ష్మణుడికి ఆగ్రహం ఎందుకు కలిగి ఉంటుందీ? నా శత్రువు లెవరో అతనితో నాపై చాడీలు చెప్పి ఉంటారు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని కోప కారణం తెలుసుకోవాలి. రామలక్ష్మణులంటే నాకు భయమని కాదు, కానీ మిత్రుడికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందటం సహజం. రాముడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యటం నాకు సాధ్యంకాదు,” అన్నాడు.

అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, “రాజా, రాముడికి నీ మీద అలక వచ్చి ఉంటుందేగాని నిజమైన ఆగ్రహం రాదు. నీవు ఏమరుపాటున శరదృతువు రావటం గమనించలేదు. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు.. అతను కాస్త పరుషంగా మాట్లాడినా నీవు సహించాలి, ఎందుకంటే తప్పు నీదే. రాముడికి ఆగ్రహం తెప్పించటం ఎవరికీ మంచిది కాదు. అతని వల్ల లాభం పొందిన నీకు అది బొత్తిగా అనుచితం,” అన్నాడు. ఈలోపుగా లక్ష్మణుడు సుగ్రీవుడి అంతఃపురం దాకా వచ్చి, లోపల ఆడవాళ్ళ అలికిడి విని అక్కడే ఆగిపోయాడు. లక్ష్మ ణుడు చేసిన ధనుష్టంకార ధ్వని విని సుగ్రీవుడు అతని ఎదట పడడానికి జంకి, లక్ష్మణుడితో మాట్లాడమని తారను పంపాడు.

తార లక్ష్మణుడున్న చోటికి వచ్చి, “మీకు కోపం వచ్చిందిట, దేనికి ? మీ మాటను ఎవరైనా అతిక్రమించారా?” అని అడిగింది.

“సుగ్రీవుడు అస్తమానమూ తాగి ఉండి రాచకార్యాలు చూడడు, మా సంగతి ఆలోచించడు, నీకు తెలియదా? యుద్ధ సన్నాహానికి నాలుగు మాసాలు వ్యవధి తీసు కున్నాడు. గడువు దాటిపోయింది. మా పని ప్రారంభం కాలేదు. మేమేం చెయ్యాలో నీవే చెప్పు,” అన్నాడు లక్ష్మణుడు.

తార అతనితో, “సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నందుకు ఆగ్రహించ వద్దు. అతను మీ పని మరవలేదు ఇదివరకే అతను మీ పనికి వానరులను హెచ్చ రించాడు. ఎక్కడెక్కడి పర్వతాల నుండో వానరులు లక్షల కోట్ల సంఖ్యలో వచ్చి చేరారు,” అని చెప్పి అతన్ని తన వెంట అంతఃపురంలోకి తీసుకుపోయింది.

తీరా లక్ష్మణుడు లోపలికి వెళ్ళే సరికి సుగ్రీవుడు, తాగిన మత్తులో ఎర్రబడిన కళ్ళతో, అనేకమంది స్త్రీల నడుమ కనిపించాడు. లక్ష్మణుడికి అతన్ని చూడగానే మండిపోయింది. అతను సుగ్రీవుణ్ణి చూసి, ఉపకారం చేసిన మిత్రులకు అబద్దపు ప్రతిజ్ఞ చేసేవాడు పరమపాపి. కృతఘ్నుడు. వాణ్ణి ఎవరైనా చంపవచ్చు. రాముడి చేత నీ పని పూర్తి చేయించుకుని సీతను వెతికే ప్రయత్నం ప్రారంభించిని నీవు కృతఘ్నుడవు. వాలి వెళ్ళిన దారి జ్ఞాపకం ఉంచుకుని సీత కోసం వెతికించు,” అన్నాడు.

తార లక్ష్మణుడికి అడ్డం వచ్చి, లక్ష్మణా, తొందరపడి సుగ్రీవుణ్ణి నిందించ వద్దు. అతను రామ కార్యం ఏమర లేదు. వానరు లందరూ పదిహేను రోజులలో రావాలనీ, రాని వారికి మరణశిక్ష అనీ సుగ్రీవుడు అదివరకే ప్రకటించాడు. ఈవాళే గడువు ఆఖరు రోజు. చాలాకాలం కష్టాలు అనుభవించిన సుగ్రీవుడు ఇప్పుడు భోగలాలసుడై ఉన్న మాట నిజమే. కాని నీవు దానిని క్షమించవచ్చు. అందుచేత నీవు కోపం మాను,” అన్నది.

తార మాటలతో లక్ష్మణుడు మెత్త బడ్డాడు. అది చూసి సుగ్రీవుడికి కాస్త ధైర్యం వచ్చింది. అతను లక్ష్మణుడితో, “లక్ష్మణా, రాముడు నాకు చేసిన మహోూపకారంలో నే నాయనకు చెయ్యబోయేది. ఏపాటి? రాముడి పట్ల నాకున్న చనువుకొద్ది నేను కొంచెం జాప్యం చేసి ఉంటే నన్ను క్షమించాలి. లోకంలో తప్పు చెయ్యనివాడు. ఉండడుగదా,” అన్నాడు.

దానికి లక్ష్మణుడు, “సుగ్రీవా, నీ సహాయం మాకు దేతవలు చేసే సహాయమే. నీవు ఒకసారి వచ్చి ఎంతో దుఃఖంలో ఉన్న రాముణ్ణి ఊరడించు. ఆయన దుఃఖం చూడలేకనే నేను ఆగ్రహం చెందాను, నన్ను క్షమించు,” అన్నాడు.

సుగ్రీవుడు హనుమంతుడి కేసి తిరిగి, ‘వాసరుల నందరినీ పిలుచుకు రమ్మని నే నింతకు ముందే దూతలను పంపాను.. వారి వెనక ఇప్పుడు మరికొందరు వానరులను పంపి, అనేక పర్వతాలలోనూ, సముద్ర తీరాలా, వనాలలోనూ ఉండే రకరకాల వానరులు శీఘ్రంగా వచ్చి చేరే ఏర్పాటు చెయ్యి. వారిని రప్పించటానికి సామదానాది ఉపాయాలు ప్రయోగించు. పది రోజులలోగా రాని వానరులకు మరణ శిక్ష !. ఇది నా ఆజ్ఞ!” అన్నాడు.

అలాగే హనుమంతుడు అనేకమంది వానరులను అనేక దిక్కులకు పంపాడు. క్రమంగా వానర బలగాలు కిష్కింధకు రాసాగాయి. నల్ల కోతులు, పచ్చ కోతులు, తెల్ల కోతులు, భయంకరమైన ఎర్ర కోతులు అన్ని రకాల కోతులూ వచ్చాయి.

వానరులు తాముండే చోట దొరికే పళ్ళూ, సువాసనగల పూలూ కూడా తెచ్చారు; వాటిని సుగ్రీవుడికి కానుకగా ఇచ్చారు.

తమ నిమిత్తమై పెద్ద ఎత్తున పని ప్రారంభించిన సుగ్రీవుడి పైన భక్తి విశ్వాసా లేర్పడి లక్ష్మణుడు అతన్ని తాముండే చోటికి ఆహ్వానించాడు. సుగ్రీవుడు సమ్మ తించి, తన పల్లకి తెప్పించి, అందులో లక్ష్మణుణ్ణి ఎక్కమని, అతనితోబాటు తాను కూడా ఎక్కికూచుని, రాముడుండే చోటికి బయలుదేరాడు. వానరు లతనికి తెల్ల గొడుగు పట్టారు, వింజామరాలు వీచారు, శంఖ ధ్వానాలు చేశారు, భేరీ భాంకారాలు మోగించారు, స్తోత్ర పాఠాలు దారి పొడుగునా చదివారు. కొన్ని వందలమంది వానర వీరులు పల్లకి వెంట నడిచారు.

Leave a Reply