సుగ్రీవుడి పట్టాభిషేకం

రాముడు దుఃఖంతో మూర్ఛపోయి ఉన్న తారను చూశాడు. అది గమనించి వానరులు తారను వాలి శరీరం మీది నుంచి పట్టి లేవదీశారు. తార రాముణ్ణి చూసి అతన్ని సమీపించి, “రామా, నా భర్త ప్రాణాలు తీసిన బాణంతోనే నన్ను కూడా చంపి, నా భర్త వద్దకు చేర్చు, సీత కోసం నీవు ఎలా తపిస్తున్నావో, వాలి నా కోసం ఆ లోకంలో అలా తపిస్తాడు. భార్యా వియోగం ఏమిటో నీకు తెలుసు గదా ! వాలి పోయాక నేను జీవచ్ఛవాన్నే గనక స్త్రీ హత్యాదోషం నిన్నంటదు” అంటూ ఏడ్చింది. రాముడు తారనూ, సుగ్రీవుణ్ణి యథోచితంగా ఊరడించాడు. వాలి దహన క్రియల పని చూడమని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు.

తారుడు కిష్కింధకు వెళ్ళి వాలిని మొయ్యటానికి ఒక పల్లకీ తెచ్చాడు. సుగ్రీవుడూ, అంగదుడూ వాలిని ఎత్తి పల్లకీలో పడుకో బెట్టారు. బలిష్ఠులైన వానరులు పల్లకి మోస్తూ వెళ్ళారు. వెనక కిష్కింధా నగర స్త్రీలు ఏడుస్తూ వెళ్ళారు. ఒక వాగు ఒడ్డున ఇసుక ప్రదేశంలో వాలికి చితి ఏర్పాటయింది. అంగదుడు శాస్త్రోక్తంగా చితికి నిప్పు పెట్టాడు. తరువాత వానరులు వాలికి జలతర్పణాలు విడిచారు.

ఉత్తరక్రియలు పూర్తి కాగానే సుగ్రీవుడు తడి బట్టలతో, తన మంత్రులను వెంట బెట్టుకుని రాముడి వద్దకు వచ్చాడు.

అప్పుడు హనుమంతుడు రాముడితో, “మీ అనుగ్రహం చేత సుగ్రీవుడు వానర రాజ్యాన్ని పొందగలిగాడు. అతనిక రాజ్య భారం వహించవలిసి ఉన్నది. అందుచేత మీరు వచ్చి అతనికి సక్రమంగా పట్టాభి షేకం చేయించండి,” అన్నాడు.

దానికి రాముడు, “హనుమంతుడా, తండ్రి ఆనతి ప్రకారం నేను పద్నాలుగేళ్ళ పాటు గ్రామాలలోకీ, నగరాలలోకి అడుగు పెట్ట వీలులేదు. అందుచేత మీరంతా సుగ్రీవుణ్ణి కిష్కింధకు తీసుకుపోయి శాస్త్ర ప్రకారం పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి,” అన్నాడు. రాముడు సుగ్రీవుడితో అంగదుణ్ణి యువరాజును చెయ్యమని, వర్షాకాలం ఆరంభం కాబోతున్నది గనుక వానలు పోయేదాకా తానూ, లక్ష్మణుడూ ఋశ్యమూకం మీది గుహలో ఉంటామనీ, కార్తికమాసం ఆరంభమయేటప్పుడు సుగ్రీవుడు రావణుడిపై యుద్ధ యత్నాలు ఆరంభించవలిసి ఉంటుందనీ చెప్పాడు.

సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి యధావిధిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కిష్కింధ వాసులందరు సంతోషించారు. గజుడూ, గవాక్షుడూ, గవయుడూ, శరభుడూ, గంధమాదనుడూ, హనుమంతుడూ, జాంబవంతుడూ, నళుడూ బంగారు కలశాలతో సుగ్రీవుణ్ణు అభిషేకించారు.

తన పట్టాభిషేకం పూర్తి కాగానే సుగ్రీవుడు అంగదుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేసి, అంగదుడిపై ఆదరాభిమానాలు గల కిష్కింధ పౌరులకు ఆనందం కలిగించాడు. తరువాత అతను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, కిష్కింధకు తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా కాలం గడపసాగాడు.

రాము లక్ష్మణులు తమ నివాసాన్ని ప్రస్రణ పర్వతం పైన ఉండే ఒక విశాలమైన గుహకు మార్చుకున్నారు. ఈ గుహ అన్ని విధాలా సౌకర్యంగా ఉన్నది. గుహాలోకి వాన జల్లు రాదు, ఈదురుగాలి రాదు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. సమీపంలోనే నది ఉన్నది. అదీకాక ఈ గుహ కిష్కింధకు చాలా దగ్గర కిష్కింధలోని గీత వాద్య ధ్వనులూ, వానరుల కేకలూ ఆ గుహకు వినిపిస్తున్నాయి.

ఇలాటి గుహలో రాముడు అహెూరాత్రాలు సీతకై విరహం పొందుతూ, లక్ష్మణుడి చేత హెచ్చరించబడుతూ, సుగ్రీ వుడు ప్రత్యుపకారం చెయ్యకపోతాడా అని ఆశ్చర్యపడుతూ, ఈ నాలుగు మాసాలూ గడిచి శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు.

వానాకాలం వచ్చింది, వెళ్ళింది. సుగ్రీవుడు తన భార్య అయిన రుమతో భోగాలలో ముణిగి తేలుతూ, రాజ్యభారం మంత్రులపై వేసి, రామకార్యం నిర్వర్తించే సమయం వచ్చిందన్న మాటకూడా తలపెట్టలేదు.

అందుచేత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి, “నీకు రాజ్యమూ, కీర్తి లభించాయి. శత్రుభయం ఏమీలేదు. కాని మన మిత్రులు పని చూడవలిసిన బాధ్యత అలాగే ఉండిపోయింది. ఇలాటి పనులలో జాప్యం కూడా తప్పే. అందుచేత వెంటనే సీతను వెతికే పని ప్రారంభించు. నీ సహాయం కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, భార్యా వియోగంతో ఎంతగా తపించి పోతున్నప్పటికీ రాముడు నీ బాధ్యతను జ్ఞాపకం చెయ్యటం లేదు. అతను అడగక ముందే మనం పని ప్రారంభిస్తే మనకు అలక్ష్యదోషం ఉండదు. నీ మాట నీవు నిలబెట్టుకుంటావనే ఉద్దేశంతో అతను ఎదురు చూస్తున్నాడు. ఇంక ఆలస్యం చెయ్యటం భావ్యం కాదు,” అన్నాడు. ఈ హెచ్చరికతో సుగ్రీవుడు చైతన్యం పొందాడు. అతను నీలుణ్ణి పిలిచి సైన్యాలన్నిటినీ రప్పించమని ఆజ్ఞాపించాడు; ఏ వానరుడు గాని పదిహేను రోజుల లోపుగా కిష్కింధకు చేరకపోతే వాడికి మరణ దండన విధించమన్నాడు; జాంబవంతాదుల దగ్గరికి అంగదుణ్ణి వెంట బెట్టుకుని నీలుణ్ణి స్వయంగా వెళ్ళమన్నాడు.

Leave a Reply