శ్రీ సీతా రాముల కల్యాణం

శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసే సరికి సూర్యాస్తమయం అయింది. జనకమహారాజు విశ్వామిత్రుని రాకకు తన సంతోషం తెలుపుకొని వెళ్ళిపోయాడు. మరునాడు తెల్లవారగానే ఆయన విశ్వామిత్రుడిని, రామలక్ష్మణులను యజ్ఞశాలకు పిలిపించాడు. జనకుడు తన వద్ద ఉండే శివధనస్సు గురించి విశ్వామిత్రుడికి  చెప్పాడు. దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనుస్సు ఎత్తి దేవతలను చంపబోయాడు. చివరకు దేవతలమొర విని, ఆ ప్రయత్నం మాని, ఆ ధనుస్సును దేవతలకే ఇచ్చేశాడు దేవరాతుడు అనే వాని కాలం నుంచి ధనుస్సు జనకమహారాజు వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరు ఎక్కు పెట్టలేరు కనీసం కదిలించలేరు.

ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతుండగా, చాలులో నుండి ఒక ఆడ శిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని, తన కుమార్తె లాగా పెంచుతూ వస్తున్నాడు. శివధనుస్సును ఎక్కు పెట్టిన వారికి సీతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి ఆ ధన్వును ఎక్కుపెట్టలేకపోయారు. చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమై దండెత్తి వచ్చి ఒక ఏడాది పాటు నగరాన్ని ముట్టడించారు. జనకుడు ఏమి చెయ్యడానికి శక్తి లేక దేవతలను ప్రార్ధించాడు. వారు సేనలను పంపి నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలేరు. విశ్వామిత్రుడు ఆ ధనుస్సును రాముడుకి చూపించమన్నాడు. దాన్ని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. ఎనిమిది చక్రాలు గల ఇనుప పెట్టె లో ఉండే ఆ శివధనుస్సును నగరం నుంచి యజ్ఞశాలకు తెచ్చారు.

దీన్ని ఎత్తడానికి, ఎక్కు పెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ రాముడు పెట్టె తెరిచి ధనుస్సు ని మధ్యభాగంలో పట్టుకొని, పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టడానికి ప్రయత్నించగా, అది ఉరుము లాంటి శబ్దంతో మధ్యకు విరిగిపోయింది. జనకుడు పరమానందం చెంది “సీతను శౌర్యవంతుడుకె ఇవ్వాలని అనుకున్నాను ఇప్పటికీ నా ఆశ నెరవేరినది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు, వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను” అన్నాడు. జనకుడి దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి, నాలుగో రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివధనుర్భంగం వృత్తాంతం చెప్పి, సీతారాముల వివాహానికి తరలి రమ్మని కోరారు. దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి మంత్రులతో సంప్రదించి జనకమహారాజు తో సంబంధం ఉచితమని తెలుసుకొన్నాడు.

Rama mounting shivas bow

జనకుడు దశరథుడు ఒకచోట చేరారు. జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వశిష్టుడు, జనకుడికి దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తర్వాత జనకుడు తన వంశవళిని తానే దశరథుడికి చెప్పాడు. రెండు గొప్ప వంశాలు వియ్యం పొందదగినవి. జనకమహారాజుకు సీత కాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడుకు మాండవి, శ్రుతకీర్తి అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీతారాముల వివాహం ముహూర్తానికే, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడికి మాండవిని, శతృఘ్నుడుకి శ్రుతకీర్తిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు.

ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయింది. పెళ్లికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుని మేనమామ కూడా మిథిలకు వచ్చాడు. అగ్ని సాక్షిగా నలుగురు వివాహాలు జరిగాయి. దశరధుని కొడుకులు నలుగురు తమ భార్యను వెంటబెట్టుకుని విడిదికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయాలకు వెళ్ళి పోయాడు. దశరథుడు కూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు.

అలా వారంతా ప్రయాణం చేస్తుండగా, దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది, ధూళి లేచింది, పెనుగాలి వీచింది అదే సమయంలో ప్రళయకాల రుద్రునిలా గా పరుశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలి, చేతిలో కాంతివంతమైన ధనుర్భాణాలు ఉన్నాయి. ఆయన రాముడితో “ఓ రామా నువ్వు మహాశివుడు ధనస్సు వీరిచావని విన్నాను, చాలా ప్రజ్ఞ కల వాడివైతే నువ్వు దాని కన్నా శక్తివంతమైన ఈ విష్ణు ధనుస్సు ఎక్కుపెట్టగల వేమో చూడు. అంత శక్తి నీకు ఉన్నట్లయితే నాతో ద్వంద్వయుద్ధం చేద్దువుగాని” అన్నాడు.

పరుశరాముడు రాముడితో విష్ణు ధనుస్సు గురించి ఇలా చెప్పాడు “దీనిని కూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. శివుని విల్లు లాగే ఇదీ ధనస్సులలో శ్రేష్టమైనది. దీనిని దేవతలు విష్ణువుకు ఇచ్చారు. శివవిష్ణువుల బలాబలాలు తెలుసుకునేందుకు వారు బ్రహ్మ ద్వారా కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లు ఉన్నది. వారు మహా భయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విష్ణువుదే పై చేయి అయినది. శివకేశవులులో కేశవుడే ఎక్కువ, అని దేవతలు గ్రహించి యుద్ధం మన వలసిందిగా ఇద్దరు దేవుళ్లను ప్రార్థించారు. తనకన్నా విష్ణువు ఎక్కువ అని నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి, తన ధనస్సును బాణాలను విదేహ దేశపు రాజు అయినా దేవరాతుకు ఇచ్చేశాడు. విష్ణువు తన ధనస్సును బృగి వంశీకుడైన  ఋచీకుడు వద్ద దాచాడు. అది ఋచీకుడు కొడుకైన జమదగ్నికి, ఆయన కొడుకైన పరశురామునికి సంప్రదించింది.

దశరథుడు భయంతో వణికిపోతూ, పరశురాముడి కాళ్ళపై పడి “స్వామి 21 మార్లు దండెత్తి క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞ చేశారు. నా కొడుకుని కాపాడు లేకపోతే మేమంతా నాశనం అయిపోతాం.” అన్నాడు దశరథుడు. పరశురాముడు దశరధుని మాటలు పెడచెవిన పెట్టాడు. రాముడికి కోపం వచ్చింది రాముడు పరశురాముడు నుండి విష్ణు ధనుస్సు తీసుకొని, అవలీలగా ఎక్కుపెట్టి బాణం సంధించి “ఓ బ్రాహ్మణ ఈ బాణంతో నీ ప్రాణం తీయగలను కానీ బ్రాహ్మణ హత్య నాకు ఇష్టం లేదు, అందుచేత దీనితో నీ కాలు విరగ కొట్టమంటావా, నువ్వు తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకాలను ధ్వంసం చేయమంటావా?” అని అడిగాడు రాముడు. పరుశురాముడు నిర్వీర్యుడు అయిపోయాడు. తన ఉత్తమ లోకాలను పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరువాత పరశురాముడు మహేంద్రగిరి కి వెళ్ళిపోయాడు. రాముడు మూర్చపోయినా తన తండ్రిని లేపి అనంతరం అందరూ అయోధ్యకు వచ్చేశారు. 

కొద్ది రోజులు గడిచాయి, యుదాజితు తన మేనల్లుడైన భరతుడిని తన ఇంటికి తీసుకు పోతానన్నాడు. ఇందుకు దశరథుడు సమ్మతించాడు. భరతుడు శత్రుఘ్నుడుని వెంటబెట్టుకుని తన మేనమామ వెంట వెళ్లిపోయాడు. సీతారాములు అన్యోన్య ప్రేమతో తమ దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసును ఒకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. రాముడు రాజ కార్యాలతో తండ్రికి సహాయ పడుతున్నాడు. రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి.

Leave a Reply