రామ లక్ష్మణులు మిధిలా నగరానికి వెళ్ళుట

రామలక్ష్మణులను వెంట బెట్టుకుని విశ్వా మిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళీ జనక మహారాజు యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్లాడు. యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలున్నాయి. విశ్వామిత్రుడు కూడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు.  ఈలోపల జనక మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది. ఆయన తన పురోహితుడైన శతానందుడితో సహా వచ్చి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. జనక మహారాజు విశ్వామిత్రుడితో తన యజ్ఞం పూర్తికావటానికి ఇంకా పన్నెండు రోజులున్నదని చెప్పి, రామ లక్ష్మణులను చూసి, ” ఈ రాజపుత్రులు ఎవరు? ఎవరి కుమార్లు ? ” అని అడిగాడు.

Rama Lakshmana goes to Midhila city
Rama Lakshmana goes to Midhila city

విశ్వామిత్రుడు జనకుడికి రామ లక్ష్మణులను పరిచయం చేసి, ” మీ వద్ద ఉండే వింటిని ఎక్కు పెట్టటం సాధ్యమవుతుందేమో చూడడానికే ఈ అబ్బాయిలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు,” అని తెలియపరిచాడు. జనకుడి వద్ద పురోహితుడుగా ఉంటున్న శతానందుడు అహల్యా గౌతముల పెద్ద కుమారుడు. రాముడి వల్ల తన తల్లికి శాప విమోచనం జరిగిందని, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడనీ విని శతానందుడు ఎంతో సంతో షించాడు. అతను రాముడి కేసి తిరిగి, ” రామా, ఈ విశ్వామిత్ర మహాముని అనుగ్రహం సంపాదించటం వల్ల నీవు ధన్యుడవయావు. ఈ మహనీయుడి విచత్రగాథ చెబుతాను విను,” అంటూ, అక్కడ చేరిన వారంతా వింటూండగా విశ్వామిత్రుడి జీవిత వృత్తాతం ఈ విధంగా చెప్పసాగాడు.

“బ్రహ్మదేవుడికి కుశుడనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడి కొడుకైన గాధికి విశ్వామిత్రుడు కొడుకై పుట్టి, చాలా కాలం రాజ్యంచేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేనను వెంట బెట్టుకుని. పర్యటన చేస్తూ, వసిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సులో నిమగ్నులై ఉండే ఋషులతో ఆ ఆశ్రమం రెండో బ్రహ్మలోకంలాగా ఉన్నది. తన  ఆశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వసిష్టుడు అతిథి సత్కారాలు చేశాడు. ఇద్దరూ కుశలప్రశ్నలు వేసు కొన్నారు. కొంచెం సేపు ఇష్టాగోష్ఠి జరి గాక వసిష్ఠుడు తన అతిథికీ ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. “తమ దర్శనమే నాకు గొప్ప విందు. వేరే విందు లెందుకు?” అంటూ విశ్వామిత్రుడు బయలుదేర బోయాడు. కాని వసిష్ట డాయనను బలవంతాన ఉంచేసి, శబల అనే తన కామధేనువును పిలిచి, భక్ష్యభోజ్యలెహ్య  చోష్యపానీయాలతో అందరికీ షడ్రసోపేత మైన విందు ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. ఆ విశ్వామిత్రు ఓ విందుకు ఎంతో ఆనందించి. “మహర్షీ, నాకు శబలను ఇప్పించండి. దీనికి మారుగా లక్ష గోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్ఠమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గనక న్యాయంగా ఈ కామ ధేనువు నాకే చెందాలి,” అన్నాడు. ” మహారాజా, లక్ష గోవులు కాదు, నూరు కోట్ల గోవులనిచ్చినా నేను శబల నివ్వను. ఇది నాకున్న ధనం. మా ఆశ్రమం యావత్తూ దీనిపైనే ఆధారపడి ఉన్నది,” అన్నాడు వసిష్ఠుడు. “

విశ్వామిత్రుడు వసిష్టుడికి అడిగినంత బంగార మిస్తానన్నాడు. రత్న రాసులిస్తానన్నాడు, శబలను ఎలాగైనా తనకి ఇవ్వమని అన్నాడు. వసిష్ఠుడు. నిరాకరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలాత్కారంగా తీసుకుపోవటానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మీ, రంకెలు వేస్తూ, కన్నీరు కారుస్తూ వచ్చి వసిష్ఠుడి కాళ్ళ పైబడి, “ఏమిటీ అన్యాయం” అన్నది. వసిష్ఠుడు  శబలతో, “విశ్వామిత్రుడు అక్షోణి సేనతో వచ్చిన బలశాలి. నాకా బలంలేదు. నేనేం చేసేది ? ” అని అడిగాడు. ” తమ తపశ్శక్తి ముందు . ఈ విశ్వా మిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వనాశనం చేయగల బలాలను నేనే సృష్టిస్తాను, నాకు అనుమతి నివ్వండి,” అన్నది కామధేనువు. కామధేనువు రంకెలు వేస్తూంటే పప్లవులూ, మ్లేచ్చులు అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చెయ్య సాగారు.

విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రయోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులను, కాంభోజులనూ, హారీతులనూ, కరాతులనూ సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టుపెట్టేస్తున్నారు.  ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు నూరుమంది ఆయుధాలతో వసిష్టుడి పైకి వెళ్ళారు. ఆయన ఒక్కసారి హుంకారం చేసేసరికి నూరుగురూ భస్మ మైపోయారు. తన సేన అంతా పోయింది, నూరుగురు కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి, చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారంవేసి, హిమాలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.

కొంత కాలానికి శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దేవతలూ, గంధర్వులూ, యక్షులు, రాక్షసులూ అధి దేవతలుగాగల అస్త్రాలన్నీ తనకు వశం కావాలనీ, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతలామలకం కావాలనీ విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్థానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వసిష్ఠుని నిర్మూలించ దలిచి విశ్వామిత్రుడు వసిష్టాశ్రమం ప్రవేశించి, తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లా చెదరుగా పరిగెత్తారు, పక్షులూ, మృగాలూ పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది.

వసిష్ఠుడు అగ్రహావేశంతో తన బ్రహ్మ దండం ఎత్తి విశ్వామిత్రుడి కెదురువచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వసిష్ఠుడి బ్రహ్మదండాన్ని తగలగానే అది కాస్తా చల్లారిపోయింది. విశ్వామిత్రుడు కొన్ని వందల అస్త్రాలను ప్రయోగించాడు. కాని వసిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వసిష్ఠుడి బ్రహ్మదండం నుంచీ, ఆయన శరీరం నుంచి జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వసిష్ఠుడిని సమీపించి, ” ఓ మహర్షి, విశ్వామిత్రుని జయించావు. ఇక శాంతించు!” అని వేడారు.

“బ్రహ్మతేజోబలం ముందు క్షత్రియబలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మత్వం సంపాదిస్తాను,” అనుకుని విశ్వామిత్రుడు భార్యా సమేతంగా దక్షిణదిశకు వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవిష్యంధుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారధుడు అనే నలుగురు కొడుకులు కలిగారు. కొంత కాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వా మిత్రుడితో, “నీ తపస్సుచేత నీకు రాజర్షి లోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరిచేతా నీవు రాజర్షివని పిలవబడతావు” అని చెప్పాడు.

రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు అనేవాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కుల గురువైన వసిష్ఠుడితో చెబితే, అది అసాధ్యమని ఆయన అన్నాడు. దక్షిణాన ఉంటున్న వసిష్ఠకుమారులు తనకు సహాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశంకును వచ్చిన దారి పట్టమన్నారు. అంతటితో బుద్ధిరాక త్రిశంకు వాళ్ళను దెప్పి, మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వసిష్ఠుడి నూరుగురు కొడుకులు మండిపడి, చండాలుడివి కమ్మని అతడిని శపించారు.

ఆ శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారమూ, నల్లటి బట్టలూ, ఇనప సొమ్ములు కలిగినవాడై వసిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, “నిన్ను ఈ ఆ కారంతోటే స్వర్గానికి పంపుతాను,” అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి, అందుకు ఋషులందరినీ పిలుచుకు రమ్మని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకుని అందరూ వచ్చారుగాని, మహోదయడనేవాడూ, విశ్వామిత్రుడి కొడుకులూ రాలేదు. రాని వారిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు.

యజ్ఞం ఆరంభమయింది. కాని హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, “నేనింత కాలం తపస్సు చేసి సంపాదించిన ఈ శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను,” అన్నాడు. – మునులందరూ చూస్తుండగానే త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక, అతన్ని కిందికి తోసేశారు. త్రిశంకు తలకిందుగా పడిపోతూ, “మహాత్మా, రక్షించు!” అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణదిక్కున మరొక సప్తర్షి మండలాన్ని, కొత్త నక్షత్రా లనూ సృష్టించి, “ఇంకొక స్వర్గాన్ని, కొత్త దేవతలనూ కూడా సృష్టిస్తాను.” అన్నాడు. అప్పుడు దేవతలూ, ఋషులూ భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, “మహానుభావా,  శాపగ్రస్తుడైన త్రిశంకుడును స్వర్గంలో ఎలా ఉంచటం?” అని అడిగారు. “ఇతడిని బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది జరిగితీరాలి.” అన్నాడు విశ్వామిత్రుడు.

త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలకిందులై శాశ్వతంగా ఉండి పోయేటట్టూ, విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టూ ఏర్పాటు జరిగింది. తరవాత విశ్వామిత్రుడు దక్షినాన్ని వదిలీ ఆ పెట్టి, పడమరగా ఉన్న పుష్కరమనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు.

Trishanku haning upside down in starts

ఈ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించగా, ఇంద్రుడు యజ్ఞపశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజ పురోహితుడు యజ్ఞపశువును ఎలాగైనా సంపాదించాలనీ, అది దొరక్కపోతే నరపశువును బలి ఇవ్వవలసి ఉంటుందనీ రాజుతో చెప్పాడు. యజ్ఞపశువు దొరక్కపోవటంచేత అంబరీషుడు నరపశువుకోసం బయలుదేరాడు. భృగుతుండ మనే కొండప్రాంతంలో, ఋచీకుడనే ముని తన భార్యా బిడ్డలతో  ఉంటున్నాడు.

అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, ” లక్ష గోవులిస్తాను, మీ కొడుకులలో ఒకరిని యజ్ఞపశువుగా ఇవ్వండి,” అని ప్రార్థించాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు ఋచీకుడు. ఆఖరువాణ్ణి ఇవ్వనన్నది ఋచీకుడి భార్య. శునశ్శేపుడనే వాడు రెండో వాడు. వాడు రాజుతో, “మా అమ్మా, నాన్నా నన్ను అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు. నన్ను మీ వెంట యజ్ఞపశువుగా తీసుకుపొండి,” అన్నాడు. అంబరీషుడు శునశ్శేపుడుని వెంటబెట్టుకుని మిట్టమధ్యాన్నానికి ఎండదెబ్బ తిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు.

శునశ్శేపుడు విశ్వామిత్రుణ్ణి చూస్తూనే ఆయన ఒళ్ళోపడి, తన కథ చెప్పుకుని, తనను కాపాడమని ఏడ్చాడు. ఆ విశ్వామిత్రుడు వాణ్ణి చూసి జాలిపడి తన నలుగురు కొడుకులతో, ” వీడికి బదులుగా మీరు యజ్ఞపశువులై వీణ్ణ్ని కాపాడండి,” అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్య పెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వసిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు. ఆ తరవాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి రెండు మంత్రాలు ఉపదేశించి, “ నిన్ను యజ్ఞపశువును చేసి యూప స్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహోత్రుడు నీకు సుముఖుడవుతాడు.” అని చెప్పాడు.

అలాగే జరిగిందికూడా. అంబరీషుడి యజ్ఞంలో శునశ్శేపుడికి ఎర్ర గందం పూసి, ఎర్రబట్టలు కట్టి, దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో రెండు మంత్రాలు జపించు కున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘాయువునిచ్చాడు.

Sunassepu sacrifying him self for Ambareesha yagna

విశ్వామిత్రుడు పుష్కరం లో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తి పడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్నా మేనక అనే అప్సరస కనిపించి మనసు చలించింది. ఆయన తన తపస్సు విడిచి తన ఆశ్రమానికి ఆమెతో పదేళ్లు సుఖంగా గడిపాడు.

ఆ తరువాత ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చింది తన తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు ఏమో అనుకున్నాడు ఆయనలో మార్పు గమనించి తను శపిస్తారేమో అని అనుకుని మేనక భయపడింది విశ్వామిత్రుడు ఆమెను ఏమీ అనక ఇందులో నీ తప్పు ఏమీ లేదు తప్పంతా నాదే కనుక నీవు వెళ్ళిపో అన్నాడు.

ఆ తర్వాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికి నది తీరాన నివశిస్తూ మహా దారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మ వెంట దేవతలు వచ్చి ఆయనకు మహర్షి అనే బిరుదు ఇచ్చారు. విశ్వామిత్రుడు బ్రహ్మతో ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించినట్లే నా అని అడిగాడు ఇంకా నీవు జితేంద్రియుడు కావు అన్నాడు బ్రహ్మ.

జితేంద్రియుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు, వాయు భక్షణం చేస్తూ  మహా ఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చూసి చాలా మంది దేవతలకు ఇంద్రుడికి భయం పుట్టింది. ఇంద్రుడు రంభని పిలిచి “నీవు వెళ్ళి విశ్వామిత్రుడు తపస్సు భగ్నం చేయాలి, మన్మధుడునీ వెంట పెట్టుకుని నేను కూడా నీకు తోడు వచ్చి కోయిల రూపం దాల్చి కూస్తాను” అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది.

విశ్వామిత్రుడు తపస్సు లో ఉండగా కోయిల కూత వినిపించింది, కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగం అని తెలుసుకుని ఆయన రంభను రాయికమ్మని శపించాడు, ఇంద్రుడు మన్మధుడు పారిపోయారు. మరుక్షణమే ఆయన అయ్యో ఎందుకు శపించాను కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేక పోయాను అని పశ్చాత్తాప పడ్డాడు ఎవరు ఏమి చేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తి చేత బ్రాహ్మణత్వం సాధించి తీరాలని నిశ్చయించుకున్నారు ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పుదిక్కుకు పోయి మౌనవ్రతం అవలంబించి తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలు దగ్ధం అయ్యేటట్లు కనిపించింది. ఆ స్థితిలో దేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మ వచ్చి విశ్వామిత్రుడుతో బ్రహ్మర్షి నీకు బ్రహ్మత్వం వచ్చింది” అన్నాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించి నేను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు ఒప్పుకుంటే తృప్తి పడతాను అన్నాడు. దేవతలు వశిష్ఠుడిని ప్రార్థించి ఆయన చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు వశిష్ట విశ్వామిత్ర లకు కలహం పోయి స్నేహం ఏర్పడింది.

Leave a Reply