రామ లక్ష్మణులు విశ్వామిత్రుని సిద్దాశ్రమానికి వెల్లుట

మర్నాడు వేకువ జామునే ఆయన రాముణ్ణి లేపి, తాను శుచి అయి, తూర్పు ముఖంగా కూచుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి, జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదట రూపంతో నిలబడి, చేతులు జోడించి, “మేము నీ భృత్యులం. ఏ పని చెబితే అది చేస్తాం,” అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, “ఇప్పటికి మీరంతా నా మనసులో చేరి ఉండండి,” అని చెప్పాడు.

తరవాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరవాత వారు ముగ్గురూ ప్రయాణం సాగించారు. వారు కొంతదూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడది చూసి, “స్వామీ, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమనికూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి?” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు.

“నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి, మూడు లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి, మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి, బలి చేసే మహా యాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు మూడడుగులూ కొలిచి మూడు లోకాలూ పుచ్చుకుని బలిని అధోలోకానికి పంపేశాడు. ఆ వామనుడూ, ఆయన తండ్రి కశ్యపుడూ కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు. అందుచేత నేనుకూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికీ వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి.”

విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి, రామ లక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రమించి ప్రయాణపు బడలిక తీర్చుకుని, విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, “మహామునీ, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము,” అని చెప్పారు.

అ రాత్రి గడిచింది. రామలక్ష్మణులు లేచి, సంధ్యానుష్ఠానాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే , హోమం  ముందు కూచుని ఉన్నాడు. వారు విశ్వామిత్రుడికి నమస్కరించి, “మహాత్మా, రాక్షసులు ఎప్పుడు వస్తారు ? వాళ్ల కోసం మేము ఏ సమయాలలో కాచుకుని ఉండాలి?” అని అడిగారు. విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు, కాని యజ్ఞ వేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో, “నాయనలారా, విశ్వా మిత్రుడు యాగదీక్షలో ఉండటంచేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు ఆరు రోజులదాకా మీరు మమ్మల్ని కాపాడాలి,” అని చెప్పారు. రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి, రాత్రివేళ నిద్రకూడా మాని అయిదు పగళ్ళూ, అయిదు రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు. ఆరో రోజు వచ్చింది.

Rama Fighting Marecha

యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది. విధ్యుక్తంగా, మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు మారీచులూ, వారి బలగానికి చెందిన రాక్షసులూ కారుమేఘాల లాగా ఆకాశం ఆవరించి యజ్ఞవేదిక పై రక్తవర్షం కురిపించసాగారు. రాముడు రాక్షసుల ఆర్బాటాలు విని, తలఎత్తి ఆకాశంలోని రాక్షస మూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కు పెట్టి మారిచుని కొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. తరవాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబహున్ని, వాయువ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులనూ చంపేశాడు. విశ్వామిత్రుడి యాగం పూర్తి అయింది. ఆయన రాముడితో, “నాయనా, నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు,” అంటూ అతన్ని ప్రశంసించాడు.

తాటకను సంహరించి, మారీచ సుబాహు లను కొట్టి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్వి ఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామ లక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనే లేచారు. వారు కాలకృత్యాలు తీర్చుకుని, విశ్వామిత్రుడూ ఇతర మునులూ ఉండే చోటికి వెళ్లి, వారందరికీ నమస్కారాలు చేసి, విశ్వామిత్రుడితో, “మహామునీ మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చెయ్యవలిసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి,” అని అడిగారు. అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు : ” మిథిలానగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగం చెయ్యబోతున్నాడు. మేమంతా బయలు దేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడా జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనుస్సు సంపాదించాడు. దేదీప్య మానంగా వెలిగిపోయే ఆ ధనుస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధధూప దీపాలతో అర్చిస్తూ ఉంటాడు. ఆ ధనుస్సును దేవతలుగాని, రాక్షసులు గాని ఎక్కు పెట్టలేరంటే ఇక మనుషులమాట చెప్పాలా ? మహా బలశాలులైన రాజులు, రాజకుమారులూ ఎందరో ప్రయత్నించికూడా దాన్ని ఎక్కు పెట్టలేక పోయారు. మీరుకూడా వచ్చినట్టయితే జనక మహారాజు చేసే యాగాన్నీ, ఆ అద్భుతమైన ధనుస్సును చూడగలుగుతారు.”

అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, “నేను మిగిలిన మునులందరినీ వెంటబెట్టుకుని గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను,” అని చెప్పి, సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి తిరిగివచ్చాడు. తరవాత మునులందరూ రామలక్ష్మణు లతో ఉత్తరాభిముఖులై బయలుదేరారు. వారి వెనక కొన్ని వందల బండ్లమీద సమిధలూ, ఇంధనాలు మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు శోణానదీ తీరాన్ని చేరుకున్నారు.

అక్కడ వారంతా స్నానసంధ్యానుష్టానాలన్నీ తీర్చుకున్నాక రామలక్ష్మణులు విశ్వా మిత్రుడికి ఎదురుగా కూర్చుండి, “స్వామీ, అందమైన వనాలుగల ఈ దేశం ఏది? దీని వృతాంతమేమిటి?” అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించి, తన వంశం గురించి ఇలా చెప్పాడు 

Leave a Reply