భరతుడు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట
భరతుడు భరద్వాజముని వద్ద ‘యధోచితంగా సెలవు తీసుకుని తన బల గంతో చిత్రకూటానికి బయలుదేరాడు. వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ తెలుసుకు రమ్మని భరతుడు సైనికులను పంపాడు.
కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒక చోట పొగ వస్తూండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చేచోట ఎవరో ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి.. లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మును లైనా కావాలి. భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, సుమంత్రుణ్ణి, సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు.
రాముడు చిత్రకూటానికి వచ్చి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించ టానికి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే ప్రవహించే మందాకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, “నీవూ, లక్ష్మణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్ళపాటయినా ఇక్కడే ఉండిపోగలను” అన్నాడు.
ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒకచోట కూచున్నారు. అదే సమయంలో రాముడికి పరిగెత్తిపోతున్న ఆడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే అరుపులు వింటే భయపడి పరిగెత్తు తున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట ఉండే పేనను చూసి బెదిరినవే.
రాముడు లక్ష్మణుడితో, “చూడు, లక్ష్మణా! ఏనుగులూ, ఎనుబోతులూ, సింహాలూ కూడా బెదిరి పారిపోతున్నాయి. ఎవరైనా. రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూరమృగమేదైనా వచ్చిందా? కారణ మేమిటో చూడు!” అన్నాడు. లక్ష్మణుడు ఎత్తయిన చెట్టెక్కి అన్ని దిక్కులా కలయజూసే సరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, “ఏదో పెద్ద సేన మనకేసి వస్తున్నది. అగ్ని చల్లార్చి, సీతను గుహలో దాచి, కవచం తొడిగి, ధనుర్బాణాలు, తీసుకో” అన్నాడు.
“సరిగా చూడు, లక్ష్మణా! అది ఎవరి సేనలాగుంది ?” అన్నాడు రాముడు.
లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి, “భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని, అంతటితో తృప్తిచెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనని చంపటానికి వస్తున్నాడు. మనం పర్వతం మీద దాక్కుందామా ? లేక యుద్ధ సన్నద్ధులమై అక్కడే ఉందామా?” అని రాముణ్ణి అడిగాడు.
అతను అంతటితో ఆగక, “ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు. మనకి కష్టాలన్నీ తెచ్చిపెట్టిన ఈ భరతుణ్ణి తప్పక చంపేస్తాను. అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు. కైకేయినీ, ఆ మంథ రనూ, వాళ్ళవాళ్ళ సందరినీ కూడా చంపే స్తాను. అటువంటి పాపులు బతికి ఉండ రాదు,” అన్నాడు.
ఈ మాటలు విని రాముడు తన తమ్ముణ్ణి మెత్తగా చివాట్లు పెట్టాడు. “తనకుతానై భరతుడు మనను చూడ వస్తూ ఉంటే యుద్ధం చేస్తానంటా వేమిటి?”
“తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి, భరతుణ్ణి చంపేనసి లోక నిందకు పాలు కమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రినీ, తమ్ములనూ చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా అను మానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చి, మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతుడు రాగానే రాజ్యం నీ కిమ్మంటాను. అతను నా మాట కాదనడు.”
ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గు పడి తల వంచుకుని, “మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు,” అని మాట మార్చాడు.
రాముడు లక్ష్మణున్ని చెట్టు దిగి రమ్మ న్నాడు. లక్ష్మణుడు దిగి వచ్చాడు.
ఈ లోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంతదూరంలో చూసి, తన తల్లులను తీసుకు రమ్మని వసిష్ఠుడికి చెప్పి, సుమం త్రుణ్ణి, శత్రుఘ్నుణ్ణి వెంట బెట్టుకుని ముందుకు వచ్చాడు. పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులూ, పేర్చిన కట్టెలూ, పిడకల పోగులూ, చెట్లకు గుర్తుగా కట్టిన పేలికలూ ఉన్నాయి.
త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి, దానికి ఈశాన్యాస అగ్ని వేదికను చూశాడు. తరువాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు. పక్కనే సీతా లక్ష్మణులున్నారు రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. అతను రాముడి దగ్గరికి పరిగెత్తుకుపోయి, కన్నీరు కారుస్తూ, రాముడి పాదాలు కనబడక నేలపై బోర్లాపడ్డాడు. అతని నోట మాట రాలేదు. శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముడి కాళ్ళకు వందనం చేశాడు. రాముడు భరతశత్రుఘ్నుల నిద్దరినీ కౌగలించుకుని కన్నీరు కార్చాడు.
అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురి పించాడు. “నాయనా, చాలా కాలానికి నిన్ను చూశాను. మారిపోయావు. గుర్తించ లేక పోయాను. చాలా సంతోషం. ఇప్పుడెందుకిలా ఈ అరణ్యానికి వచ్చావు ? నాయనగారు విచారం లేకుండా ఉన్నారా? తల్లులందరూ క్షేమమా ? నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా? నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు గద? మంత్రులు అన్ని వేళలా నీకు సహాయంగా ఉంటున్నారా?”
భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా, “అన్నా, మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించు కునే ఆచారం ఎన్నడన్నా ఉన్నదా? నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని, మన వంశాన్ని తరింపజెయ్యి. ఇప్పుడు మన తండ్రికూడా లేడు. నేనింకా కేకయరాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు. నీవూ, సీతా, లక్ష్మణుడూ వెళ్ళి పోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకున్నది. ముందు తండ్రిగారికి జల తర్పణాలు చెయ్యి. నిన్నే తలచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫల ప్రదమవుతాయి,” అన్నాడు.
తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు. సీతా భరతలక్ష్మణ శత్రుఘ్నులు చన్నీరు చల్లి రాముడికి మూర్ఛ తెలిసేటట్టు చేశారు. రాముడి విచారానికి అంతులేదు. తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకూ, ఆయనకు తాను ఉత్తర క్రియ చెయ్యనందుకూ తనను తాను తిట్టుకున్నాడు. తరువాత అతను. తండ్రికి ఉదకదానం చెయ్యటానికి బయలు దేరుతూ, స్త్రీలూ పిల్లలూ ముందు నడవాలి గనక, సీతనూ లక్ష్మణుణ్ణి ముందుగా నదికి బయలుదేరమన్నాడు.
సీతారామలక్ష్మణులు మందాకినీ నది రేవులో స్నానాలు చేసి దశరథుడికి నీళ్ళు వదిలేశారు. తరువాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు, గార గానుగుపిండిని రేగుపళ్ళతో కలిపి ముద్దలుచేసి దర్భలపై ఉంచాడు. తరువాత వారు ముగ్గురూ పర్ణశాలకు తిరిగివెళ్ళారు.
అంతవరకూ దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన ధ్వనులు వినగానే ఆటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి ముని వేషంలో ఉన్న రాముణ్ణి, అతని తమ్ము లనూ, సీతనూ ఒక్కచోట చూశారు. రాముడికి కొందరు నమస్కారాలు చేశారు. కొంద రిని రాము డాలింగనం చేసుకున్నాడు.
ఈ లోపల దశరథుడి భార్యలు వసిస్ధుడి వెంట మెల్లిగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డు మీదుగా పర్ణశాల కేసి వచ్చారు. వారికి స్నానాల రేపూ, దానికి ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలూ కనిపించాయి. కౌసల్య సుమిత్రతో, “మన వాళ్ళు ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు. నీ కొడుకు రాముడి కోసం ఇక్కడినుంచే నీళ్ళు తీసుకుపోతాడు కాబోలు.
ఇక లక్ష్మీణుడి కష్టాలు తీరాయిలే. భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా! ఈ గార గానుగుపిండి ముద్దలు చూశావా? భూమండలమంతా ఏలిన దశరథ మహారాజుకు ఈ ముద్ద లేమిటి, ప్రారబ్ధంగాకపోతే ? పాపం, రాముడిదే తింటున్నాడు కాబోలు. తలుచు కుంటే నా గుండె పగిలిపోతున్నది!” అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.
వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సీత కూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది. వనవాసంతో చిక్కి పోయి ఉన్న సీతను కౌసల్య కౌగలించు కుని, “జనకమహారాజు కూతురూ, దశరథ మహారాజు కోడలూ అయి ఉండి నీకి వనవాసం గతి పట్టిందా, తల్లి ?” అని ఎంత గానో వాపోయింది.