శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టుట
ఖరదూషణులూ, త్రిశిరుడూ మొదలైన రాక్షసవీరులు తమ పధ్నాలుగువేల రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా అకంపనుడనే రావణుడి చారుడు ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు.
“రావణరాజేశ్వరా, జనస్థానంలో ఉండే మనరాక్షసు లందరూ యుద్ధంలో వధ అయారు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పటానికి వచ్చాను.” అని అకంపనుడు అంటూండ గానే రావణుడు కళ్ళెర్రజేసి అగ్నిహోత్రుడులా అయిపోయి, “ఎవడికి కాలం మూడింది? నేను అగ్నినే దగ్ధం చేస్తాను, మృత్యువునే చంపగలను. సూర్య చంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమై పోతారు,” అని రంకెలు పెట్టాడు.
ఈ అట్టహాసం గమనించి అకంపనుడు. ముందుగా రావణుడి వద్ద అభయం పొంది, రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ ఎలా చంపిందీ వివరించి చెప్పాడు.
రావణుడంతా విని బుసకొడుతూ, “ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు కాబోలు ?” అన్నాడు.
“లేదు, లేదు. రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి తోడుగా అతని తమ్ముడు లక్ష్మణు డొకడున్నాడు. జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడొక్కడే!” అన్నాడు అకంపనుడు.
అలా అయితే నేను జనస్థానానికి వెళ్ళి ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపేస్తాను.” అన్నాడు రావణుడు.
అకంపనుడు లబలబలాడుతూ, “ఆ రాముడి బలపరాక్రమాలు నేను సరిగా చెప్పలేకపోయాను. అతడికి చెలియలి కట్టను భేదించి ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది. ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం చెయ్యగలడు. మూడు లోకాలూ నిర్మూలించి, కొత్తసృష్టి ప్రారంభించగలడు. రాముడు నీ చేతిలో ఎన్నటికీ చావడు. అతడు చావటానికి ఒక్కటే ఉపాయం: అతడి భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి, సర్వాంగ సుందరి. ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో సమానం. ఆమెను ఎత్తుకువస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చస్తాడు!” అని సలహా ఇచ్చాడు.
రావణుడు కొంచెం ఆలోచించి, తలపంకించి “మంచిది, రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి ఆ సీతను తీసుకువచ్చే స్తాను” అన్నాడు.
మర్నాడు ఉదయానే అతను ప్రకాశం వంతమైన రథానికి గాడిదలను పూన్చి దానిలో ఎక్కి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తాటక కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి, “ఇలా తలవని తలంపుగా వచ్చారు, రాక్షసులందరూ క్షేమమే గదా?” అని అడిగాడు.
ఆ మాటకు రావణుడు, మారీచా, జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ ‘రాముడు వధించాడు. అతడి భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను. నీ సహాయం కావాలి,” అన్నాడు.
“అయ్యో, హితం కోరిసవాడిలాగా వచ్చి నీకు సీత మాట చెప్పిన దుర్మార్గు డెవరు? నిశ్చయంగా నీ నాశనం కోరేవాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి ఉంటాడు. ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి, లంకకు వెళ్ళి నీ భార్యలతో సుఖంగా ఉండు; ఈ దండ కారణ్యంలో ఆ రాముణ్ణి తన భార్యతో సుఖంగా ఉండనీ, ఆ రాముడి జోలికి పోవటం నిద్రించే సింహాన్ని లేవగొట్టటమే!” అన్నాడు నూరీచుడు.
మారీచు ఇంతగా చెప్పినాక రావణుడు. తన యత్నం మానుకుని లంకకు వెళ్ళి పోయాడు. ఇంతలో శూర్పణఖ కూడా లంకకు వెళ్ళింది. నిండు కొలువులో ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి, పరుషంగా మాట్లా డుతూ, “భోగలాలసుడవై మదించి నీకు వచ్చిపడే ఘోరాన్ని కూడా తెలుసుకో కుండా ఉన్నావు! నీ కన్న పసిపిల్లలు నయం! జనస్థానంలో రాముడు ఋషుల కోరికపై నీ వాళ్ళనందరినీ చంపి, దండ కారణ్యంలో రాక్షసపురుగు లేకుండా చేస్తే నీకా సంగతి చెప్పటానికి చారులు కూడా లేరు, నీ వింకేం రాజ్యం చేస్తావు? ఈ రాజ్యం ఉండదు; నీవు త్వరలోనే నశిస్తావు!” అన్నది.
రావణుడి మాటలు సహించలేక రోషంతో, “ఎవడీ రాముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఉంటాడు? ఏపాటి పరాక్రమం గలవాడు?” అని శూర్పణఖను అడిగాడు.
“రాముడు దశరధుడి కొడుకు, ఆజాను బాహువు. నవమన్మధుడు. అతడు యుద్ధం చెయ్యటం నేను కళ్ళారా చూశాను. వర్షంలాగా బాణాలు వచ్చిపడటం నాకు కనిపించిందేగాని, అతను బాణాలు తీయటమూ, ఎక్కు పెట్టటమూ, విడవటమూ నాకు కనిపించలేదు. ఒక్కడే క్షణంలో పధ్నాలుగు వేలమంది రాక్షసులను చంపేశారు. ఆడదాన్ని గదా అని నన్ను చంపక అవమానించి పంపాడు. రాముడి తమ్ముడు లక్ష్మీణుడు ముక్కోపి, మహాబలశాలి. అన్నకు కుడిభుజం. ఇక రాముడి భార్య సీత! ఇంతంత కళ్ళు! నిండు చంద్రుడులాట ముఖం! బంగారువంటి శరీరచ్ఛాయ! సన్నటినడుము ! చక్కని విరుదులు! అటు వంటి భార్య ఉంటే వేరే స్వర్గం దేనికి? ఆ సీతను ఎలాగైనా ఇక్కడికి తీసుకువచ్చి నీకు భార్యను చేతామని ప్రయత్నించేసరికి లక్ష్మణుడు నన్నిలా ముక్కు చెవులు కోశాడు. సీతను ఒక్కసారి చూస్తే నీవు మరువలేవు. ఆ రాముణ్ణి చంపేసి నీవాళ్ళ కోసం పగతీర్చుకో, సీతను తెచ్చుకుని భార్యగా ఏలుకో. వెంటనే బయలుదేరు!” అని శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టింది.
రావణుడు సభ చాలించి ఒంటరిగా కూచుని సీతాపహరణం గురించి వివరంగా ఆలోచించాడు. సీతను పరాక్రమంతో తీసుకురావటం కన్న దొంగతనంగా తీసుకు రావటమే మేలని అతనికి అనిపించింది. ఎందుకంటే అంతమంది రాక్షసులనూ, రాక్షసవీరులనూ చంపినవాణ్ణి ఓడించి సీతను ఎత్తుకురావటం మాటలు కాదు. అయితే రావణుడు తన ఆలోచనను మండోదరికి గాని మంత్రులకు గాని చెప్పలేదు; వారు నివారిస్తారని భయపడ్డాడు.