రావణుడు సీతను అపహరించుట
రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీత వద్దకు వచ్చాడు. అతను సన్నని కాషాయవస్త్రం ధరించి, గొడుగు వేసుకుని, పావుకోళ్ళు కాళ్ళకు ధరించి, దండానికి కమండలం తగిలించి ఎడమ భుజానికి ఆన్చి, వేదాలు చదువుతూ వచ్చి, కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూశాడు. ఆమె పచ్చని పట్టుచీర కట్టుకొని ఉన్నది. ఆమె సర్వావయవాలలోనూ సౌందర్యం తొణికిసలాడుతున్నది. ఆమె
మెడలోని రత్నహారాలు మెరుస్తున్నాయి. రావణుడు సీతను పలకరించి, ‘అమ్మాయీ, నీ వెవరు? పార్వతివా? అప్సరవా? లక్ష్మీదేవివా? కాంతిదేవతవా? మానవ దేవ యక్ష కిన్నర గంధర్వులలో నీ వంటి సుందరిని నేనెన్నడూ చూడలేదు. ఇంత సుకుమారివి, సుందరివి, చిన్నదానివి ఈ రాక్షస మయమైనచోట ఏంచేస్తున్నావు? ఒంటరిగా ఎందుకున్నావు?” అని అడిగాడు.
సీత రావణుణ్ణి చూసి నిజమైన సన్యాసి అనుకుని ‘అర్ఘ్యపాద్యాదు లిచ్చి అతిథి సత్కారాలు చేసి, పీట వేసి, వంట సిద్ధంగా ఉన్నది, భోజనం చెయ్యమని అహ్వానించింది. ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్న లకు సమాధానం చెబుతూ, తన వివాహం జరగటమూ, తాను పన్నెండేళ్ళు కాపురం చేసిన అనంతరం తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తల పెట్టటమూ, కైకేయి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి తన భర్తను అడవులకు పంపటమూ మొదలైన వృత్తాంతమంతా చెప్పింది. అంతా చెప్పి, ఆమె రావణుణ్ణి, “మీ పేరేమిటి? గోత్ర మేమిటి? మీరీ దండకారణ్యంలో ఒంటిగా ఎందుకు తిరుగుతున్నారు?” అని అడిగింది.
సీత ఈ ప్రశ్న అడగగానే రావణుడు, “నేను రాక్షసరాజును, రావణుణ్ణి, నాకు ఎందరో భార్యలున్నారు గాని ఒక్కరూ నీతో సమానం కారు. నేనుండే లంకా పట్టణం సముద్రం మధ్య ఎత్తయిన పర్వతం మీద ఉన్నది. ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చెయ్యి. ఉద్యాన వనాలలో విహరించుదము. నీకు అయిదువేల మంది దాసీలను ఏర్పాటు చేస్తాను,” అన్నాడు.
ఈ మాటలు విని సీత భయపడటానికి బదులు మండిపడింది. రావణుణ్ణి తిట్టింది, బెదిరించింది. రాముడి పరాక్రమం వివరించింది. అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు. తాను కుబేరుడి తమ్ముణ్ణనీ, కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొన్నాననీ, తన పేరు చెబితేనే సమస్త దేవతలూ భయపడతారనీ అన్నాడు. రాముడు అసమర్థుడు గనకనే రాజ్యం వదిలిపెట్టి అడవులలో అష్టకష్టాలూ పడుతున్నాడన్నాడు. “నీవు రాముడికి భయపడి నాతో వచ్చెయ్యటానికి జంకు తున్నావేమో, నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చేయలేడు. అతడు నా గోటికి చాలడు,” అన్నాడు.
“కుబేరుడి తమ్ముణ్ణని చెప్పుకుంటూ ఇలాటి పాపపు బుద్ధులేమిటి? నీకీ పరస్త్రీ వాంఛ పోకపోతే నీవు, నీ రాక్షసులూ నాశనం కాక తప్పదు,” అన్నది సీత.
రావణుడు మండి పడి చేతులు చరిచి తన నిజ రూపం ధరించి భయంకరంగా సీత ఎదట ప్రత్యక్షమయాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లాగున్నాయి, శరీరం నల్లగా ఉన్నది. చెవులకు బంగారు పోగులున్నాయి. అతను సీతతో, ” పిచ్చిదానా, నీకు నా కన్న ఖ్యాతి గల భర్త ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు నన్ను నిరాకరించి తరువాత పశ్చాత్తాప పడతావు,” అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఎడమచేత్తో సీత జుట్టూ, కుడిచేత్తో తొడలూ పట్టుకుని రావణుడు ఆకాశానికి ఎగిరాడు. సీత గిలగిలా తన్నుకుంటూ రాముణ్ణి కేక పెట్టింది, లక్ష్మణుణ్ణి పిలిచింది. “రావణుడు సీతను ఎత్తుకు పోయినాడని రాముడితో చెప్పండి,” అని చెట్లతో మొర పెట్టుకున్నది.