రావణుడు మరీచుని సహాయం కోరుట

రథం సిద్ధం చెయ్యమని రావణుడు తన సారధితో చెప్పి, అందులో ఎక్కి, కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడి ఆశ్రమానికి వచ్చిచేరాడు. మారీచుడు అతనికి అతిథి సత్కారాలుచేసి, ” ఇంత లోనే మళ్ళీ రావటానికేమి కారణం ? లంకలో అందరూ క్షేమమా ?” అని అడిగాడు.

“రాముణ్ణి క్షమించటానికి వీల్లేదు. వాడు దుష్టుడు, క్రూరుడు, మూర్ఖుడు, లుబ్ధుడు. మన రాక్షసుల నందరినీ నాశనం చెయ్యటమేగాక నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు. సీతను అపహరించదలిచాను. నాకు నీ సహాయం కావాలి. నీవు పరాక్రమం గలవాడవు, యుక్తిపరుడవు. నీకు మాయలు తెలుసు. నీ వల్ల కావలిసిన సహాయం చెబుతాను విను. నీవు వెండి చుక్కలు గల బంగారు లేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనపడేలాగా తిరుగు. నిన్ను పట్టితెమ్మని సీత రామలక్ష్మణులను తప్పక పంపు తుంది. ఆ సమయంలో నేను సీతను ఎతుకుపోతాను. సీత పోయినాక రాముడు విచారంతో కృశించిపోతాడు. ఆ స్థితిలో అతను యుద్ధానికి వచ్చినా సునాయాసంగా ఓడించేస్తాను.” అని రావణుడు చెప్పాడు.

ఈ మాటలు విని మారీచుడికి భయంతో నోరెండిపోయింది. అతను చేతులు జోడించి, “రాక్షసరాజా, ఈ లోకంలో ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు. నచ్చక పోయినా హితమైన మాట చెప్పేవారుండరు, ఒకవేళ చెప్పేవారున్నా వినేవారుండరు. రాముణ్ణి గురించి నీ వనుకునేదంతా అబద్ధం. అతను దుష్టుడూ, మూర్ఖుడూ, లుబ్ధుడూ, క్రూరుడూ ఎంత మాత్రమూ కాడు. అతను ఎవరి జోలికీ వెళ్ళలేదు. శూర్పణఖ సీతను తరిమితే పరాభవించి పంపాడు. ఖరదూషణులు తన పైకి వచ్చి పడితే వారిని చంపాడు, తప్పా? ఈ రాముడు మీసకట్టు కూడా రాని వయనులో, వెయ్యి ఏనుగుల బలంగల నన్ను వెయ్యి యోజనాలు వెళ్ళి సముద్రంలో పడేలా కొట్టాడు. అంతటితో బుద్ధిరాక నేను మరి ఇద్దరు రాక్షసులతోబాటు జింకరూపు దాల్చి, మునిలాగా ఉన్నాడు కదా, ఏం. చెయ్యగలడులెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతన్ని చంపబోయాను. రాముడు మూడు బాణాలు ఎక్కుపెట్టాడు. వాటిని చూడగానే నేను తప్పుకుని పారిపోయాను; కాని నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసు లిద్దరూ చచ్చారు. నాకు బుద్ధి వచ్చింది. నా కిప్పుడు రాముడంటే సింహ స్వప్నం. ఎక్కడ చూసినా నాకు రాముడే. కనిపిస్తాడు. రకారంతో ప్రారంభమయే మాటలు వింటేనే గుండె అవిసిపోతాయి. నామానాన నేను తపస్సు చేసుకుంటున్నాను. నీకు కాలంమూడి రాముడితో తలపడాలని ఉంటే తలపడు. నన్ను మాత్రం ఇందులోకి ఈడవకు. నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతివో నీకు సర్వ నాశనం తప్పదు,” అన్నాడు.

రావణుడి కీ మాటలు తల కెక్కలేదు. అతను మారీచుడితో, ” దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు. నా నిర్ణయం మంచిదా, చెడ్డదా అని నేను నిన్నడిగానా? అడగని మాట లెందుకు చెబుతావు? నేను నిన్నొకటి చెయ్యమని అడిగినప్పుడు నీవు చెయ్యవలిసిందే గాని బదులాడరాదు. నేను చెప్పినట్టు బంగారు లేడి రూపం ధరించి “సీతను ఆకర్షించి, ఆ తరవాత నీదారిన నీవు వెళ్ళి పో. నిన్ను పట్టటానికి రాముడు ఒక్కడే వస్తే అతని కంఠధ్వనితో, “అయ్యో ! సీతా లక్ష్మణా!’ అని ఆరు. అప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు. సీత నాకు దక్కుతుంది. ఈ ఉపకారం చేస్తవా నీకు నా అర్థరాజ్య మిస్తాను. నిరాకరించావో, ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తారు. రాముడు నిన్ను చంపటం అబద్ధమూ, నేను చంపటం నిజమూ అవుతుంది,” అన్నాడు.

మారీచుడికి మండిపోయింది. ‘నన్ను చంపుతానంటున్నావు గాని నీ కీ ఆలోచన చెప్పిన దుర్మార్గుల నెందుకు చంపవు? ఇటువంటి మతిలేని ఆలోచన చేస్తూంటే నీ మంత్రులు నిన్నెందుకు నివారించలేదు? దైవికంగా ఇది వచ్చిపడటంచేత నేను చస్తే అంత ప్రమాదంలేదు. కాని నా తరువాత నీవూ, రాక్షసవంశము, లంకానగరమూ కూడా నాశనం కాక తప్పదే, అది ఎంత ఘోరం!” అని మారీచుడు రావణుడితో అని, పోదాం పద మన్నాడు.

అనరాని మాటలన్నీ అన్నప్పటికీ చివరకు తన మాట పాటించాడన్న ఆనందంతో రావణుడు మారీచుణ్ణు ఆలింగనం చేసుని విమానంలాటి తన రథంలో అతన్ని ఎక్కించుకుని, అరటి చెట్ల మధ్యనున్న రామాశ్రమం దగ్గిర అతన్ని దించాడు.

వెంటనే మారీచుడు ఒక ఆకర్షవంత మైన, అపూర్వమైన లేడిరూపం ధరించి, గరికిమేస్తూ మెల్లిగా రామాశ్రమం ప్రవే శించి అక్కడే తారట్లాడాడు. ఈ మాయా లేడి శరీరం బంగారు రంగులోనూ, దాని మీది చుక్కలు వెండిరంగులోనూ, పొట్ట తెల్లగానూ, గిట్టలు నిగనిగలాడే నలుపు రంగులోనూ, తోక పంచవర్ణాలలోనూ, కొమ్ముల చివరలు నీలం రంగుగానూ, నోరు కెంపు రంగుగానూ ఎంతో అందంగా ఉన్నాయి. అది కాస్సేపు మేస్తూ, మధ్య – మధ్య పచ్చికపై పడుకుంటూ, ఆ ప్రాంతం లోనే చాలాసేపు తిరిగింది.

Leave a Reply