అశోక వనాన్ని నాశనం చేసి, హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేయుట

కింకరులను చంపి నిలబడి ఉన్న హనుమంతుడికి అశోక వనంలోని చైత్యంలాటి భవనం జ్ఞాపకం వచ్చింది. దాన్ని అతను ధ్వంసం చెయ్యలేదు. ఆ పని చేద్దామని అతను ఒక్క ఎగురున ఆ చైత్య ప్రాసాదం మీదికి దూకాడు. ఆ ప్రాసాదాన్ని రక్షించే వారు నూరుమంది రాక్షసులు ఆయుధాలు తీసుకుని హనుమంతుడి పైకి వచ్చారు. వారి ఆయుధాలు తగిలి హనుమంతు డాగ్రహించి తన శరీరాన్ని ఇంకా పెంచాడు. అతను ఆ ప్రాసాదంలోని ఒక స్తంభాన్ని ఒక్క ఊపున పెరికి దాన్ని గిరగిరా తిప్పేసరికి, ఆ వడికి నిప్పుపుట్టి చైత్య ప్రాసాదమంతా తగలబడిపోయింది. హనుమంతుడా స్తంభంతోనే నూరుగురు రాక్షసులనూ చంపాడు.

తరవాత అతను గట్టిగా అరుస్తూ, “నా వంటి వానరులు అనేక వేల సంఖ్యలో సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడి చేత పంపబడ్డారు. లక్షల, కోట్ల వానరులతో సుగ్రీవుడిక్కడికి వస్తాడు. మీరు రాముడితో వైరం పెట్టుకున్నారు. ఇక లంక ఉండదు. నాశనమవుతుంది. మీరూ ఉండరు చస్తారు. రావణుడూ ఉండడు,” అన్నాడు.

ఎర్రని పూలమాలలు ధరించి, తలలో పూలు పెట్టుకుని, కుండలాలు ధరించి, ఇంద్ర ధనుస్సులాటి విల్లూ, అందమైన బాణాలూ తీసుకుని జంబుమాలి గాడిదలు పూన్చిన రథంలో వచ్చేసరికి హనుమంతుడు ద్వారతోరణం పైన కూర్చుని ఉన్నాడు. జంబుమాలి ఎల్లెక్కు పెట్టి అనేక బాణాలు ప్రయోగించి హనుమంతుడి ముఖాన్నీ, దేహాన్ని గాయపరిచాడు; హనుమంతుడు పెద్ద రాయి విసిరితే దాన్ని బాణాలతో పడగొట్టాడు; సాలవృక్షం పీకితే దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. చివరకు హనుమంతుడు మొదట తీసుకున్న పరిఘనే తీసి గిరగిరా తిప్పి విసిరే సరికి జంబుమాలితోబాటు రథమూ, గాడిదలూ నజ్జునజ్జయిపోయాయి.

కింకరులతో బాటు జంబుమాలి కూడా చచ్చాడని విని రావణుడు ఆగ్రహావేశం ‘చెంది, అస్త్రవేత్తలయిన ఏడుగురు మంత్రి పుత్రులను హనుమంతుడి పైకి పంపాడు. వారు తమతమ సైన్యాలను వెంటబెట్టుకుని, ఎవరు ముందు వెళ్ళి శత్రువుతో తల పడతారా అని పోటీలు పడుతూ, అమితోత్సాహంతో బయలుదేరారు. వాళ్ళు తన మీద వదిలిన బాణవర్షాన్ని తప్పించుకుని హనుమంతుడు గాలిలోనే సంచరిస్తూ, రాక్షసమూకను చేతులతోనూ, కాళ్ళతోనూ కొట్టి చంపాడు. వారు పెట్టిన చావు కేకలకు లంక యావత్తూ పిక్కటిల్లింది.

మంత్రి పుత్రులు కూడా ఎప్పుడైతే చచ్చారో, రావణుడికి భయం ఆరంభమయింది. కాని అతను దాన్ని లోపలనే అణచుకుని, విరూపాక్షుడూ, యూపాక్షుడూ, దుర్ధరుడూ, ప్రఘసుడూ, భాసకర్ణుడూ అనే అయిదుగురు అగ్రసేనానాయకులను పిలిచి, ” సేనాధిపతులారా, మీరు చతురంగ బలాలతో వెళ్ళి ఆ వానరుణ్ణి శిక్షించండి. వాడు వానరుడుగా నాకు తోచలేదు. ఏ ఇంద్రుడో తపస్సు చేసి ఈ భూతాన్ని మన పైకి పంపాడేమో! నేను కూడా మహా బలవంతులైన వానరులను, వాలి సుగ్రీవ నీల ద్వివిదాదు లను చూశాను గాని, వారి కన్న ఈ వానరుడు మిన్నగా కనబడతాడు. ఇదేదో వానర రూపంలో ఉన్న భూతం. ప్రయాసపడి ఎలాగైనా ఈ వానరుణ్ణి మీరు పట్టాలి. యుద్ధం చేసేటప్పు డేమాత్రమూ ఆశ్రద్దగా ఉండకండి,” అని హెచ్చరించాడు.

ఆ అయిదుగురూ బయలుదేరి ఆశోకవన ద్వారం దగ్గరికి వెళ్ళి హనుమంతుణ్ణి చూసి, అతన్ని అన్నివైపుల నుంచీ చుట్టుముట్టి యుద్ధం ఆరంభించారు. దుర్ధరుడు హను మంతుడి తలను అయిదు బాణాలతో కొట్టాడు. హనుమంతుడొక్క పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడినుంచి అతను అతి వేగంగా, సూటిగా దుర్దరుడి రథం పైకి దూకే సరికి, ఆ పాటుకు రథము, దానికి కట్టిన ఎనిమిది గుర్రాలూ, అందులో వున్న దుర్ధరుడూ క్షణంలో నాశనమయారు.

దుర్ధరుడు చచ్చేసరికి విరూపాక్షు యూపాక్షులు ఆగ్రహం చెంది ఆకాశానికి ఎగిరి, ముద్గరాలతో హనుమంతుణ్ణి రొమ్ము మీద కొట్టారు. హనుమంతుడొక మద్దిచెట్టు పెరికి, దాంతో వారిద్దరిని చావ మోదాడు. ముగ్గురు చావగా మిగిలిన ఇద్దరూ అడ్డకత్తి, హలమూ తీసుకుని హనుమంతుడిపై కలియబడి, అతన్ని గాయపరిచారు. హనుమంతుడొక పర్వత శిఖరాన్ని, దానిపై గల వృక్షాలతోనూ, జంతువులతోనూ సహా విరిచి, దాన్ని ఎత్తి ప్రఘసుడి పైనా, భాసకర్ణుడి పైనా కొట్టి, వారిని కూడా చంపాడు.

ఇలా అయిదుగురు యోధులనూ చంపి హనుమంతుడు వారి సేనలను అవలీలగా నిర్మూలించాడు.

ఈ వార్తకూడా తెలియరాగానే రావణుడి కన్ను యుద్ధోద్రిక్తుడై ఉన్న తన కొడుకు అక్షుడి పైన పడింది. తండ్రి తన కేసి చూడటమే ఆలస్యంగా అక్షుడు చివాలున లేచి, బంగారం పొదిగిన తన విల్లు తీసుకుని, బంగారు అలంకరణలు గల తన గొప్ప రథమెక్కి హనుమంతుడి పైకి వెళ్ళాడు. ఆ రథం నిండా ఆయుధాలున్నాయి. అది యుద్ధానికి ఆయత్తం చేయబడి ఉన్న రథం. అతని వెంట సైన్యం కూడా వెళ్ళింది.

హనుమంతు డింకా అశోకవన ద్వారం వద్దనే ఉన్నాడు. అతన్ని చూస్తూనే అక్షుడు తన శత్రువు పరాక్రమవంతుడని గ్రహించి గౌరవభావంతో చూశాడు. ఇద్దరికీ గొప్ప యుద్ధం జరిగింది. అక్షుడు కుర్రవాడైనా అతని పరాక్రమం చూసి హనుమంతుడు కూడా సంతోషించాడు. అతను అక్షుడి బాణాలకు అందకుండా తప్పుకుంటూ గాలిలో తిరుగుతూ, ” ఈ కుర్రవాణ్ణి ఎలా చంపడం? అయినా వీడిప్పుడే ఇంత ప్రతాపం చూపుతున్నాడే, ముందుముందింకా ఎంత ప్రబలుడవుతాడో! ఇప్పుడే వీణ్ణి చంపటం మంచిది,” అనుకున్నాడు.

అక్షకుమారుడి రథం ఆకాశంలో కూడా సంచరించగలది. అది ఆకాశంలో ఉండగానే హనుమంతుడు ఆ రథానికి గల గుర్రాలను చేత్తో కొట్టి చంపి, చక్రాలు విరిచాడు. రథం నేల కూలింది, కాని అక్షుడు విల్లుతో రివ్వున ఆకాశంలోకి లేచాడు. అలా లేచిన అక్షుడి కాళ్ళు రెండూ ఉపాయంగా పట్టుకుని, హనుమంతుడు అతన్ని గాలిలో గిరగిరా తిప్పి, బలంగా నేల కేసి కొట్టి చంపేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *