రామ లక్ష్మణులు హనుమంతుని కలుసుకొనుట

వసంతకాలం. పంపాసరస్సులోని జలం నిర్మలంగా ఉన్నది. అందులో కమలాలూ, నల్ల కలువలూ పూస్తున్నాయి. సరస్సు చుట్టూ ఉండే అరణ్యం అత్యంత మనోహరంగా ఉన్నది. గండు కోయిలలు కూస్తున్నాయి. నెమళ్లు నాట్యం చేస్తున్నాయి.

ఈ వసంత శోభను గమనించి రాముడు ఒక వంక ఆనందమూ, మరొక వంక సీతకై విరహమూ పొంది తన స్థితికి ఎంతగానో విలపించాడు. ఎటు చూసినా, దేన్ని చూసినా అతనికి సీతే జ్ఞాపకం వచ్చింది. అతను లక్ష్మణుడితో నిరాశాపూరితంగా మాట్లాడాడు. “లక్ష్మణా, ఈ మనోహరమైన ప్రాంతంలో నా వెంట సీతే ఉంటే జీవితంలో ఇంకేమీ కోరను. కాని సీత లేకుండా ఏ జీవించటం అసంభవంగా ఉన్నది. నేను ప్రాణాలు వదిలేస్తాను, నీవు భరతుడి వద్దకు వెళ్ళి పో,” అని పెద్ద పెట్టున ఏడవసాగాడు.

లక్ష్మణుడు రాముడికి హితం చెప్పాడు. సీతపై గల అమితమైన ప్రేమచేతనే దుఃఖం కలుగుతున్నదనీ, ఆ ప్రేమనూ, విరహాన్నీ దూరంగా ఉంచమనీ, రావణుడి జాడ తెలుసుకుని సీతను తెచ్చుకోవలసి ఉన్నదనీ, రావణుడు.. మంచిగా సీత నివ్వకపోతే అతణ్ణి వధించవలిసి ఉంటుందని, ఇందుకు ధైర్యం అవసరమనీ, దుఃఖం కార్యనాశకమనీ లక్ష్మణుడు రాముడికి చెప్పి ధైర్యం కలిగించాడు. వారిద్దరూ ఆ వనమంతా తిరగసాగారు.

రామలక్ష్మణులు పంపాసరస్సు వద్దకు వచ్చిన క్షణం నుంచీ, ఋశ్యమూక పర్వతం మీద ఉంటున్న సుగ్రీవుడనే వానరరాజు వారిని చూస్తూనే ఉన్నాడు. ఏనుగు గున్నల్లా గున్న ఆ ఇద్దరూ ఆ ప్రాంతానే తచ్చాడుతూ ఉండటం చూసి సుగ్రీవుడికి దడ పుట్టు కొచ్చింది. తనకు కీడు చేసే ఉద్దేశంతో తన అన్న అయిన వాలి వారిని పంపి ఉంటా డనుకుని సుగ్రీవుడు తన మంత్రులైన వానరులతో సహా మతంగాశ్రమంలోకి వెళ్ళి కూచున్నాడు. ఎందుకంటే అక్కడ వారికి వాలి భయం లేదు. వాలి తాలూకు మనుషులు కూడా అక్కడికి రాలేరు.

సుగ్రీవుడు తన మంత్రులతో, ” వీరెవరో నారబట్టలు కట్టి, మారు వేషాలు వేసుకుని, పని బెట్టుకుని ఈ అరణ్యంలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? వాలే వీరిని పంపి ఉంటాడు,” అన్నాడు. ఆ మాటలు విని అందరూ భయపడ్డారు.

అప్పుడు, సుగ్రీవుడి మంత్రులలో ఒకడైన హనుమంతుడు, ” మీరంతా ఎందుకిలా భయపడుతున్నారో తెలియకుండా ఉంది. ఈ ఋష్యమూకం మీదికి వాలి రాడు, అతని జాడకూడా ఏమీ కనిపించలేదు. రాజైన వాడికి ఇలాటి చపలచిత్తం కూడదు,” అని చెప్పాడు.

ఆ మాట విని సుగ్రీవుడు, “వాలి ఇక్కడికి వచ్చాడని నే ననలేదు. ఆ మనుషులను చూడు; పొడుగైన వాళ్ళ చేతులు చూడు, ఆ చేతుల్లో ఉండే కత్తులూ, వారి విల్లంబులూ చూడు! వారిని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. వాలే వారిని తప్పక పంపి ఉంటాడని నా అనుమానం. వాలి రాజు గనక అతనికి ఎందరో సహాయకులుంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనని శత్రువులు ఏమార్చి నాశనం చేసేస్తారు. వాలి మహాదక్షుడు. అందుచేత నీవు మారువేషంతో వెంటనే వారి వద్దకు వెళ్ళి, వారితో మాట్లాడి వారి రహస్యం ఏమిటో తెలుసుకు రావాలి,” అన్నాడు.

తమ రాజైన సుగ్రీవుడి అభిప్రాయం తెలుసుకుని హనుమంతుడు వానర రూపం వదిలి బ్రహ్మచారి రూపం ధరించి రామ లక్ష్మణుల వద్దకు వెళ్ళి, వినయంతో వారికి నమస్కారం చేసి, “అయ్యలారా, మీరు వ్రతదీక్ష బూని తపస్సు చేసుకునే రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు. ఎక్కడో రాజ్యాలేల వలసిన మీరు ఈ పంపాసరోవర ప్రాంతాన, నారబట్టలు కట్టి ఎందుకు తిరుగుతున్నారు? మీరెవరు? మా రాజైన సుగ్రీవుడనే వానరుడు అన్న చేత వెళ్ళగొట్టబడి, దీనుడై తిరుగుతున్నాడు. నే నాయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా తండ్రి వాయుదేవుడు. సుగ్రీవుడి కోరికపై నేను ఈ బ్రహ్మచారి రూపు ధరించి ఋశ్యమూక పర్వతం నుంచి వచ్చాను. నాకు కామరూప, కామగమన శక్తులున్నాయి,” అని చెప్పాడు.

హనుమంతుడి మాటలు వింటూంటే రాముడి ముఖాన ఆనంద రేఖలు గోచరించాయి. అతను లక్ష్మణుడితో, “ఇతనికి నీవే సమాధానం చెప్పు. ఇతని మాటల తీరు చూడగా మంచి భాషా జ్ఞానమూ,పాండిత్యమూ కలవాడుగా కనిపిస్తున్నాడు. ఇలాటి దూతలు గల రాజేరాజు,” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి కేసి తిరిగి, “హనుమంతుడా, వానర రాజైన సుగ్రీవుణ్ణి గురించి మాకు బాగా తెలుసు. మేమాయనకోసమే వెతుకుతూ వస్తున్నాము. ఈయన మా అన్న రాముడు. ఇతనికి మీ సుగ్రీవుడి సహాయం కావలసి ఉన్నది. సుగ్రీవుడికి ఈయన తిరిగి రాజ్యం ఇప్పించ గలడు,” అంటూ తమ కథ యావత్తూ హనుమంతుడికి సవిస్తరంగా చెప్పేశాడు. చిట్టచివరకు, “రాముడి భార్యను తీసుకు పోయిన రాక్షసుడి జాడ సుగ్రీవుడు చెప్పగలడని కబంధుడి ద్వారా మాకు తెలిసింది. సీతను వెదకటానికి సుగ్రీవుడు మాకు సహాయపడాలి. అడిగిన వారికి అంతులేని దానాలు చేసిన ఈ రాముడు ఈ సహాయం కోసం సుగ్రీవుడి శరణుజొచ్చాడు,” అని లక్ష్మణుడు హనుమంతుడితో అన్నాడు. ఈ మాటలు నోటి వెంట అనటానికి లక్ష్మణుడికి ఎంతో దుఃఖం కలిగింది.

హనుమంతుడు లౌక్యంగా, “మీరు మహానుభావులు. మిమ్మల్నే సుగ్రీవుడు వెతుక్కుంటూ రావలిసింది. ఆయన పుణ్య వశాన మీరే ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడుపూర్తిగా మీకు సహకరిస్తాడు. ఇంక మనం సుగ్రీవుడి వద్దకు పోదామా ?” అన్నాడు.

Leave a Reply