రామ లక్ష్మణులు సుగ్రీవుడుతో మైత్రి చేసుకోనుట
హనుమంతుడు నమ్మదగిన వాడేననీ, అతను నిజమే చెబుతున్నాడని తృప్తి కలిగి రామలక్ష్మణులు అతని వెంట వెళ్ళటానికి సిద్ధపడ్డారు. హనుమంతుడు బ్రహ్మచారి రూపు వదిలిపెట్టి వానర రూపం ధరించి, రామలక్ష్మణులను తన వీపు మీద ఎక్కించుకుని ఋశ్యమూక పర్వతానికి వెళ్ళాడు. సుగ్రీవుడు ఋశ్యమూకం మీద లేడు, మలయపర్వతం మీద ఉన్నాడు; హను మంతుడు అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులు వచ్చిఉన్నారనీ, సుగ్రీవుడు వచ్చి వారితో స్నేహం చేసుకోవటం లాభకరమనీ చెప్పాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడి వల్ల కావలిసిన సహాయంకూడా వివరించాడు.
హనుమంతుడి మాటలు విన్నాక సుగ్రీవుడి భయం తీరిపోయింది. అతను సంతోషించి, తన వానరరూపు విడిచి అందమైన మానవరూపు ధరించి రామలక్ష్మణు లను చూడవచ్చాడు. ఆయన రాముడితో, ” మిమ్మల్ని గురించి హనుమంతుడు అంతా చెప్పాడు. మహారాజువైన నీవు నా స్నేహం కోరి రావటం వానరుణ్ణయిన నాకు ఎంతో, గౌరవం, ఎంతో లాభకరం,” అంటూ స్నేహ చిహ్నంగా చెయ్యి చాచాడు. రాముడు సుగ్రీవుడి చేతిని పట్టుకుని తన స్నేహ భావాన్ని అతడికి స్పష్టం చేశాడు. తరువాత రాముడు సుగ్రీవుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.
హనుమంతుడు అరణులు మధించి అగ్ని చేసి, ముందుగా తానా అగ్నిని పూజించి తెచ్చి రామ సుగ్రీవుల మధ్య ఉంచాడు. వారిద్దరూ ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. ఇకనుంచీ ఒకరి సుఖదుఃఖాలు మరొకరివని ప్రమాణం చేసుకున్నారు. సుగ్రీవుడొక మద్దికొమ్మ విరిచి తెచ్చాడు. రాముడూ అతనూ ఆ కొమ్మమీద కూచున్నారు. అలాగే హను మంతుడొక చందనపు చెట్టుకొమ్మ విరిచి తెచ్చి లక్ష్మణుణ్ణి దానిపై కూచోబెట్టాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, “రామా, నా అన్న అయిన వాలి నాకు అన్యాయం చేశాడు, నా భార్యను అపహరించాడు. వాలి భయంతో ఇలా అడవులు పట్టి తిరుగుతున్న నాకు అభయం ఇవ్వాలి,” అన్నాడు.
“సుగ్రీవా, నీ స్నేహానికి ప్రత్యుపకారంగా నేను నీ అన్న అయిన వాలిని చంపేస్తాను. అతని చావు నా బాణాలలోనే ఉన్నది,” అని రాముడన్నాడు.
“నీ అనుగ్రహంతోనే నేను రాజ్యాన్నీ, నా భార్యనూ తిరిగి పొందవలసి ఉన్నది. మీరు ఏ పని మీద ఈ నిర్జన వనాల్లో తిరుగుతున్నారో అదంతా హనుమంతుడు చెప్పాడు. నీవు, నీ తమ్ముడూ లేని సమయం చూసి ఒంటిగా ఉన్న సీతాదేవిని బలాత్కారంగా రావణుడు ఎత్తుకుపోయాడు. తనకు అడ్డు తగిలిన జటాయువును కూడా అతను చంపేశాడు. నీకు త్వరలోనే భార్యా వియోగం పోతుంది. సీతాదేవి మూడు లోకాలలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆమెను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇప్పుడు నాకు ‘అర్థమయింది, నేనా నాడు చూసినది సీతాదేవినే, సందేహం లేదు. రావణుడి ఒడిలో కూచుని ఏడుస్తూ ఆకాశ మార్గాన పోతున్న సీతను నేను చూశాను. ఆవిడకూడా నన్నూ, నా వెంట ఉన్న నలుగురు వానర వీరులనూ చూసింది; చూసి, తన ఆభరణాలను పై బట్టలో మూట గట్టి మా కేసి విసిరింది. ఆ ఆభరణాలను ఇంత కాలంగా భద్రంగా ఉంచాము. వాటిని చూసి నీవు గుర్తు పట్టవచ్చు,” అన్నాడు.
రాముడీ మాట విని ఆ ఆభరణాలు చూడటానికి తహతహ లాడాడు. సుగ్రీవుడు లేచి ఒక గుహలోకి వెళ్ళి, సీత ఆభరణాల మూటతో తిరిగి వచ్చాడు. మూటను చూస్తూనే రాముడు సీత ధరించిన పై బట్టను గుర్తించి శోకావేశంతో కూలిపోయాడు. అతను కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ, “లక్ష్మణా, రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీత పడవేసిన ఈ పై బట్టా, నగలూ చూడు. వీటిని దట్టమైన పచ్చిక మీద వేసింది కాబోలు, కొంచెంకూడా దెబ్బ తగల కుండా ఎలా ఉన్నాయో!” అన్నాడు.
లక్ష్మణుడు సీత ఆభరణాలు చూసి, ” ఈ కేయూరాలు, కుండలాలూ నేను గుర్తించలేదు గాని, సీత కాళ్ళకు నమస్క రించేటప్పుడు కనిపించిన అందెలు మాత్రం ఇవే,” అన్నాడు.
రాముడు సుగ్రీవుడి కేసి తిరిగి, “నీవు చూస్తూండగానే గదా ఆ రాక్షసుడు ప్రాణ సమానురాలయిన నా భార్యను ఎత్తుకు పోయాడు! వాడెక్కడికి వెళ్ళాడు? దయ చేసి చెప్పు, వాడి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను,” అన్నాడు.
రావణుణ్ణి గురించి తనకు ఏమీ తెలియ దన్నాడు సుగ్రీవుడు; అయితే సీత దొరక గలందులకు తగిన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తరవాత అతను రాముడికి ధైర్యం చెబుతూ, “వానర మాత్రుణ్ణి అయి ఉండికూడా నేను భార్య కోసం అలా దుఃఖంతో కుంగి పోలేదు. దుఃఖం వల్ల ప్రయోజనం లేదు, పౌరుషం అవలంబించాలి. ధైర్యంగా ఉండాలి.” అని హితవు చెప్పాడు.
ఈ మాటలు విని రాముడు ధైర్యం తెచ్చుకుని, కళ్ళు తుడుచుకుని సుగ్రీవుడితో, ” నీవు నిజమైన మిత్రుడనదగిన మాట అన్నావు. కష్ట సమయంలో నీలాటి ఆప్తుడు దొరకటం కష్టం. నీవు మాత్రం సీతను వెతికే ప్రయత్నం తప్పక చేయాలి. ఇప్పుడు నేను నీకు చెయ్యవలసిన సహాయం గురించి చెప్పు. ఆ సహాయం నా వల్ల అవుతుందో కాదోనన్న సందేహమేమీ పెట్టుకోకు. వాలిని చంపుతానని మాట ఇచ్చానే. అందులో అబద్ధమేమీ లేదు. నే నెన్నడూ అబద్ధ మాడినవాణ్ణి కాను” అన్నాడు.
రాముడి మాటలకు వానరులు పరమా నందం చెందారు. తరువాత రామ సుగ్రీవుల ఏకాంతంగా సంభాషించుకుని తమతమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, “నా అన్న వాలి బలశాలి. యువరాజుగా ఉన్న నన్ను తిట్టి, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ప్రాణాల కన్న ఎక్కువైన నా భార్యను హరించాడు. నా స్నేహితులను కారాగృహంలో పెట్టాడు. నన్ను చంపే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను పంపిన వానరులను ఎంతమందినో నేను చంపాను. మా అన్న భయంతోనే నేను మిమ్మల్ని చూడగానే మీ ఎదటికి రాలేదు. నా కిప్పుడున్నదల్లా ఈ హనుమంతుడు మొదలైనవారే. వారి చలవవల్లనే నే నింకా బతికి ఉన్నాను. నాకు పరమ విరోధి అయిన ఆ వాలి చస్తే తప్ప నాకు జీవితం లేదు, సుఖం లేదు. ఇది నా విషాదగాధ. కష్టాలు మిత్రులకే చెప్పుకోవాలిగద,” అన్నాడు.