హనుమంతుడు సీత జాడ తెలుసుకొనుటకు లంకకు బయలు దెరుట
వానరులు కొత్త ఉత్సాహంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్ళు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్ళి. వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు.
అంతులేని ఆ సముద్రాన్ని చూడగానే వానరులకు భయం పుట్టింది. ఆ సముద్రంలో నూరామడల దూరాన లంక ఉన్నది. దీన్ని ఎలా దాటటం ? అంగదుడు మేటి వానరులను సమావేశపరిచి, “మనం ఎలాగైనా ఈ సముద్రాన్ని దాటనిదే సీతాదేవిని చూడలేము. సీతను చూడకుండా తిరిగిపోయే కన్న ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యటం మేలు. సముద్రాన్ని చూసి భయపడి ప్రయోజనం లేదు. మీలో ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరో చెప్పండి,” అన్నాడు.
సముద్రం దాటి లంకకు చేరగల ఘటికుడి పైన అందరి క్షేమమూ ఆధారపడి ఉన్నది. గజుడు పది ఆమడల దూరం దూకగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గవయుడు ముప్ఫై ఆమడలూ దూకగల మన్నారు. నలభై ఆమడలు దూకగల నన్నాడు శరభుడు, గంధమాదనుడూ, మైందుడూ, ద్వివిదుడూ వరసగా యాభై, అరవై, డెబ్భై ఆమడలు దూకగల మన్నారు. సుషేణుడు ఎనభై ఆమడలు దూకగల నన్నాడు. జాంబవంతుడు, “ఒకప్పుడు నేను ఎంత దూరమైనా దూకేవాణ్ణి. త్రివిక్రముడు వామనావతార మెత్తి మూడడుగులతో మూడు లోకాలూ ఆక్రమించి నప్పుడు నేను అతని చుట్టూ ప్రదక్షిణం తిరిగి వచ్చాను. ఇప్పుడు ముసలివాణ్ణి, తొంభై యోజనాలు మించి దూకలేను,” అన్నాడు.
అందరన్న మాటలూ విని అంగదుడు, “నేను నూరు ఆమడల దూరం సులువు గానే దూకగలను. కాని తిరిగి రాగలనని నిశ్చయంగా చెప్పలేను,” అన్నాడు.
ఆ మాట విని జాంబవంతుడు, ‘నాయనా, మాకు రాజువంటి వాడవు. నీవు మాలో ఒక్కణ్ణి లంకకు పంపవచ్చు. గాని నిన్ను మేమెలా పంపుతాము? అది పొసగదు,” అన్నాడు.
“నేనూ వెళ్ళక, మీలో వెళ్ళేవారూ లేకపోతే ఇక మనకు ప్రాయోపవేశమేగదా గతి ?” అన్నాడు అంగదుడు.
“నాయనా, ఆ విషయం నీ వేమీ విచారించకు. మన పని సానుకూలం చెయ్య గల మహామహుడు అడుగో దూరాన ఒంటరిగా కూచున్నాడు,” అంటూ జాంబ వంతుడు హనుమంతుణ్ణి చూపాడు.
అతను హనుమంతుడి వద్దకు వెళ్ళి, “మేమంతా తలలు పగల గొట్టుకుంటూ ఉంటే మా కందరికీ మేటివైన నీవు ఉలుకూ పలుకూ లేకుండా ఇక్కడ ఒంటిగా కూర్చున్నావేమిటి? పుట్టుతూనే సూర్యుణ్ణి చూసి పండనుకుని ఆకాశాని కెగిరిన వాడవుకదా, నీవు కాక ఈ మహా సముద్రాన్ని మరెవరు దాటగలరు? వేగంలో వాయువుకు సమానమైన వాడవు, గరుత్మంతుడికి తీసిపోనివాడవు. ఎగరటంలో నీకు సరి వచ్చేవాళ్ళు మాలో ఎవరున్నారు? నీ ప్రజ్ఞ చూడటానికి ఈ వానరులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి లే లేచి నీ శక్తి చూపించు!” అని ఉత్సాహపరిచాడు.
ఈ మాటలు వింటూంటే హనుమంతుడి శరీరం పొంగిపోయింది. హనుమంతుడి శరీరం పెరిగిపోతున్న కొద్దీ వానరులు ఉత్సాహాతిశయంతో సింహనాదాలు చేశారు.
వారి ప్రశంసలు వింటున్న కొద్దీ హను మంతుడి బలం కూడా పెరగ సాగింది. ఆ ఉత్సాహంలో అతను, “ఔను, ఈ సముద్రాన్ని అవలీలగా దాటుతాను. కావలిస్తే నేను సూర్యుడితో బాటు తూర్పు నుంచి బయలుదేరి పడమరకు వెళ్ళి మధ్యాహ్నాని కల్లా సూర్యుడికి ఎదురు రాగలను. శుభ శకునాలు కలుగుతున్నాయి. నేను సీతాదేవిని తప్పక చూసి వస్తాను. మీరేమి దిగులు పడకండి,” అన్నాడు.
తాను భూమిని తన్ని పైకి లేచేటప్పుడు భూమి కంపిస్తుందనే ఉద్దేశంతో హనుమంతుడు సమీపంలో ఉన్న మహేంద్ర పర్వత శిఖరాన్ని ఎక్కాడు. అతను అక్కడ నడుస్తుంటే అతని పాద ఘట్టనకు రాళ్ళు పిండి అయాయి, మహేంద్రగిరిపై ఉండే జంతువులు భయపడి నలు దిక్కులకు పారిపోయాయి.