విశ్వామిత్రుడు తన వంశం గురించి చెప్పుట
“పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమార్తెను పెళ్ళాడి, ఆవిడకు నలుగురు కుమారులను కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనేవారిని కన్నాడు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులను భూమిని పంచుకుని, న్యాయంగా ప్రజా పరిపాలన చేయవలిసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడి రాజధాని కౌశాంబి, కుశనాభుడి రాజధాని పేరు మహెచయం, ఆధూర్తరజసుడు ధర్మారణ్యమనే పట్టణాన్ని రాజధాని చేసుకున్నాడు. వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన దేశంలోనే, ఈ దేశం చుట్టూ అయిదు అందమైన పర్వతాలున్నాయి. ఈ శోణానది. ఆ పర్వ తాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ, సస్యశ్యామలంగానూ చేస్తున్నది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహించే నది.”
“కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడొకడని చెప్పాను గద. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికి నూరుమంది ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ నూరు మంది కన్యలూ ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూండగా వాయు దేవుడు వారిని చూసి మోహించి, తనను పెళ్ళాడమని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనమూ, చావులేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి, తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడా కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకున్నారు.”
“తన కుమార్తెలు ప్రదర్శించిన ఐక మత్యమూ, వంశాభిమానమూ చూసి కుశ నాభుడు చాలా సంతోషించాడు. వారిని ఇక పెళ్ళిలేకుండా ఉంచటం క్షేమం కాదనుకుని ఆయన, కాంపిల్యపురాన్ని పాలించే బ్రహ్మ దత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్ళిచేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ల కందరికీ పెళ్ళిచేశాక కుశనాభుడు,w^3కొడుకును కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను. నాకు సత్యవతి అనే అక్క ఒకామె ఉండేది. ఆమెను ఋచీకుడి కిచ్చి చేశారు. ఆవిడ మహా పతివ్రత. మేము కుశిక వంశం వాళ్లం గనక మమ్మల్ని కౌశికులనికూడా అంటారు. మా అక్క పేరుతో కౌశికి అనే నది ఏర్పడింది. మా అక్క పైగల అభిమానం కొద్దీ నేను హిమవత్రాంతంలో కౌశికీ నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చా నన్నమాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపోయింది, రామా, ఇక మీరిద్దరూ పడుకుని నిద్రపొండి!”
ప్రయాణపు బడలిక మూలాన రామ లక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి, తెల్లవారి విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యాలు తీర్చుకుని శోణానదిని అందరూ దాటే రేవులో దాటారు. అది లోతైన నది కాదు, ఇసుక తిన్నెలతో చాలా అందంగా ఉన్నది. వారా నదిని దాటి మళ్ళీ నడక సాగించి మధ్యాహ్నం వేళకు గంగా తీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతులేని ఆనందం కలిగింది. అక్కడ వారు స్నానం చేసి, దేవతర్పణాలూ, పితృతర్పణాలు చేసుకుని, హోమం చేసి, భోజనాలు పూర్తిచేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూచున్నారు. అప్పుడా మహర్షి వారందరికీ గంగయొక్క వృత్తాంతం యిలా చెప్పాడు.
హిమవంతుడనే పర్వతరాజుకు గంగా, ఉమా అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్ళి చేసుకున్నాడు. కాలక్రమాన సగర చక్రవర్తి మనమడికి మనమడైన భగీరధుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి, భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు.
విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు గంగావతరణకధా, కుమారస్వామి జన్మ వృత్తాంతమూ సవిస్తరంగా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ గంగయొక్క దక్షిణపు గట్టున గడిపి, మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలానగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలా సేపు చూసినాక రాముడు విశ్వా మిత్రుణ్ణి, “మహామునీ, ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు? వారి కథ ఏమిటి?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు, దేవదానవులు క్షీరసాగరాన్ని మధించటమూ, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటమూ, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడు కుంటూంటే విష్ణువు మోహినీ రూపంలో వచ్చి అమృతాన్ని హరించి, తనను ఎదిరించిన వారినందరినీ చంపి, తనను శరణు జొచ్చిన వారిని కాపాడటమూ మొదలైన విషయాలన్నీ చెప్పి, ఇలా అన్నాడు.
“తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్ళి ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమియ్యవలి సిందని వేడుకున్నది. “నీవు వెయ్యి సంవత్సరాలు నిష్ఠతో ఎలాటి మైలకూడా సోకకుండా, తపస్సు చేసినట్టయితే, ఇంద్రుణ్ణి చంపి, ముల్లోకాలూ ఏలగల కొడుకు కలుగుతాడు,” అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు. దితి సంతోషించి కుశప్లవనమనే చోట చేరి కఠోరమైన తపస్సు ప్రారంభించింది. ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ, నీరూ, సమిధలూ, దర్భలూ, కందమూల ఫలాలూ తెచ్చి ఇస్తూవచ్చాడు.”
“తొమ్మిదివందల తొంభై సంవత్సరాలు గడిచాయి. ఇంకా పదేళ్ళు గడిస్తే దితి గర్భం నుంచి ఇంద్రుణ్ణి చంపగలవాడు బయటికి వస్తాడు. ఒకనాటి మధ్యాన్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, “నాయనా, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నావు. అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్టు నేను చూస్తాలే” అన్నది. అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలసిన చోట ఉంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది. ఈవిధంగా ఆమెకు మైలసోకింది. ఇలాంటి అవకాశం కోసమే వేచివున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలో ప్రవేశించి, గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికాడు. వారే దేవతా – సమానులైన సప్త మారుతాలు. “
“రామా, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలుచేశాడు. అటు తరవాత ఇక్ష్వాకు మహారాజుకు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఈ మహా నగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాలా నగరమనే పేరుపచ్చింది. ఇప్పుడి నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు,” అని విశ్వా మిత్రుడు రాముడితో అన్నాడు. ఈలోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు మంత్రి పురోహితులు మొదలైన వారితో ఎదురువచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమతి అతిథులుగా ఉండి, తెల్లవారగానే మిథిలానగరానికి ప్రయాణమయారు. వారు మిథిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపోవటానికి కారణమేమిటని రాముడు అడిగాడు.
“నాయనా, ఒకప్పుడి ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేశాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో, ఇంద్రుడు గౌతముడు స్నానానికిగాను నదికి వెళ్ళి ఉన్న సమయంలో మునివేషం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతని కోరిక తీర్చి పంపేసింది. ఇంద్రుడికి గౌతముడు తడి బట్టలతో ఎదురై, జరిగినది తెలుసుకుని, ఇంద్రుడికి శాపమిచ్చి, ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాపం ఫలితంగా ఆమె గాలి తప్ప మరొక ఆహారం లేక, ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాపవిమోచనం కలిగే లాగు గౌతముడు అనుగ్రహించాడు గనక మనం ఈ ఆశ్రమం ప్రవేశించి, ఆ అహల్య అందరికీ తిరిగి కనబడేలాగు చేద్దాం,” అన్నాడు.
విశ్వామిత్రుడు, వారు లోపలికి వెళ్ళేసరికి రాముడి కళ్ళకు సూర్యుడి కాంతితో వెలిగిపోతూ, మోహినీ దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది. ఆమె రాముడిని చూడగానే ఆమెను మిగిలిన వారుకూడా చూడగలిగారు. రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళు తాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్ళు తాకి, వారికి అర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగివచ్చాడు.
విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలు దేరి, రామలక్ష్మణులను వెంట బెట్టుకుని మిథిలానగరం ప్రవేశించాడు.