శ్రీరాముడు తాటకిని సంహరించుట
“నాయనా, తాటక వృత్తాంతంకూడా చెబుతాను, విను. సుకేతుడనే గొప్ప యక్షుడు ఉండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి, ఆయనకు కొడుకును ఇవ్వక, వెయ్యి ఏనుగుల బలంగల కూతురు కలిగేలా వరమిచ్చాడు. బ్రహ్మ వర ప్రభావంచేత సుకేతుడికి తాటక పుట్టి పెరగ సాగింది. ఆమె యుక్తవయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్ష కుమారుడి కిచ్చి పెళ్ళి చేశాడు. వారిద్దరికీ మారీచుడనే కొడుకు కలిగాడు. వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు, చాలా గర్వంగలవాడు.
ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందు కని తాటకా, మారీచుడూ అగస్త్యుడిపై ఆగ్రహించి, గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదికి వచ్చారు. అప్పుడగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి, నరభక్షిణిగా మారి పోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక ఆయన సంచరించిన ఈ పుణ్య భూమిని పాడు పెట్టేస్తూ భీభత్సం కలిగిస్తున్నది.
అందుచేత, ఓ రామా, నీవా తాటకను వధించు. ఆడదని సంకోచించకు. ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఈమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు,” అని విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడు చేతులు జోడించి, ” మహామునీ, మా తండ్రి మీరు చెప్పినదెల్లా చెయ్యమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను,” అన్నాడు.
ఆ తరవాత రాముడు బాణంచేత పట్టి దాని తాడును బలంగా లాగి ఖంగు ఖంగు మని మోగించాడు. ఈ చప్పుడు వినపడే సరికి తాటాకా వనంలో ఉండేవారంతా ఉలిక్కిపడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వేపు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమకేసి వచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, “చూశావా, లక్ష్మణా, ఈమె ఎంత వికార ఆకారం కలిగి, ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో! ఈ ఆడదాన్ని చంపటానికి నాకు చేతులు రావటం లేదు. దగ్గరికి రానీ, ముక్కూ, చెవులు కోసి, పొగరు అణచి పంపేద్దాం!” అన్నాడు. ఆ తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదికే వచ్చి, దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణు లను కప్పేసి, వారిపై రాళ్ళవాన కురిపించ సాగింది. రాముడు దాని చేతులు రెండూ తన బాణాలతో తెగగొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కూ, చెవులూ కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్ళపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది.
అప్పుడు విశ్వామిత్రుడు, “ రామా, ఈ పాపాత్మురాలిని దయతలుస్తా వేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయ లైనా చెయ్యగలదు. సంధ్యా కాలం లోపల దీన్ని చంపెయ్యి. ఉదయవేళా, సాయం సమయానా రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం,” అని హెచ్చరించాడు. ఈమాట విని రాముడు తాటక రొమ్ము లోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేల మీద పడి, గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకుని, తల వాసన – చూసి, ” నాయనా, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి, తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం,” అన్నాడు.