ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చుట
అశ్వమేధం పూర్తికాగానే ఋష్యశృంగుడు దశరధుడిని చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఆయన అగ్నిలో వేసే హవిస్సులు తీసుకోవడానికి సకల దేవతలూ అక్కడికి వచ్చి, తమ ఉచిత స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాల గురించి చెప్పుకున్నారు.
దానికి బ్రహ్మ, “దుర్మార్గుడైన రావణుడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచేత చావు లేకుండా వరం అడిగాడు గాని మనుషుల మీది తేలిక భావంకొద్దీ వారి వల్ల చావులేకుండా వరం కోరలేదు. ఇడుగో మహావిష్ణువు, దశరథుడి భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు.” అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమానందం చెందారు.
ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకి వచ్చింది. ఆ భూతం తన చేతులలో ఒక కలశాన్ని పట్టుకుని ఉన్నది. కలశం మేలిమి బంగారంతో చేసినది, దానిపై మూతవెండిది. ఆ భూతం దశరథుడితో, “ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యల కిచ్చినట్టయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు,” అన్నది. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకుని, భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే భూతం అంతర్థానమై పోయింది.
దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగం కౌసల్య కిచ్చాడు, మిగిలిన దానిలో సగం సుమిత్ర కిచ్చాడు. సుమిత్ర కివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయి కిచ్చి, ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొక సారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్యా, సుమిత్రా, కైకేయీ గర్భవతులయారు. ఒక వంక మహావిష్ణువు మానవుడుగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతుంటే, ఇంకోపంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు.
దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడూ, బృహస్పతికి తారుడూ, కుబేరుడికి గంధమాదనుడూ, విశ్వకర్మకు పలుడూ, అగ్నికి నీలుడూ, అశ్వినీ దేవతలకు మైండ ద్వివిదులూ, వరుణుడికి సుషేణుడూ, పర్జన్యుడికి శరభుడూ, వాయుదేవుడికి హనుమంతుడూ పుట్టారు. వీరందరూ మహా బలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేలసంఖ్యలో వానరమూక పుట్టింది, వానరులతోబాటే ఎలుగు బంట్లూ, కొండముచ్చులూ కూడా రావణ వధ కోసం పుట్టారు. ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి, వాలి సుగ్రీవులను రాజులుగా | పెట్టుకుని, నలుడూ, నీలుడూ, హను మంతుడూ మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు.