రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళుట
విశ్వామిత్రుడూ, ఆయన వెనకగా రామ లక్ష్మణులూ ఒక కోసు దూరం నడిచి వెళ్ళి సరయూ నది దక్షిణపుగట్టు చేరుకున్నారు. “నాయనా, రామా! నీవు వెంటనే ఆచమనం చేసి రా. నీకు బల, అతిబల అనే రెండు విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసటా, జబ్బూ, రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలమూ నిన్ను మించిన అందగాడూ, తెలివిగలవాడూ, నేర్పరీ, వాదనలో నిన్ను మించగలవాడూ ఉండరు. ఆకలిదప్పులుండవు. గొప్ప కీర్తి కలుగు తుంది,” అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బలాతి బలలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూ తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి, సరయూ నదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్టానాలు పూర్తి చేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్లీ బయలు దేరి, సరయూనది గంగలో కలిసే చోటికి వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సు చెడ గొట్టటానికి వచ్చి, శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మ మైపోయాడు. అది మొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులుంటున్నారు. మన్మధుడు తన అంగాన్ని అంటే శరీరాన్ని అక్కడ పోగొట్టు కున్నాడు గనక, ఆ ప్రాంతానికి అంగదేశమనే పేరు వచ్చింది. రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని, ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి, మర్నాడు. ఒక పడవలో గంగను దాటారు.
ఆ తరవాత వారు కాలినడకను ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జన సంచారం లేదు. విడవకుండా కీచురాళ్ళ అరుపులూ, సింహగర్జనలూ, పులుల గాండ్రింపులూ, అడవిపందుల గురగురలూ, ఏనుగుల ఘీంకారాలూ వినవస్తున్నాయి. చంద్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొర రాకుండా ఉన్నది ఆ అరణ్యం. రాముడా అరణ్యాన్ని చూసి ఆశ్చర్య పడి ” మహామునీ, ఈ అరణ్యం పేరేమిటి?” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు.
ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదమూ, కరూశమూ అని రెండు గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిణీ, దాని కొడుకు మారీచుడనేవాడూ చేరి రెండు దేశాలను నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, వెయ్యి ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలనూ మహారణ్యంగా మార్చ గలిగింది. ఈ మాట విని రాముడు, “స్వామీ, యక్షులు అల్ప శక్తిగలవారంటారు గదా, ఈ తాటక అనే యక్షిణికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?” అని అడిగాడు.