సీతారామ లక్ష్మణులు అత్రిమహా ముని ఆశ్రమానికి వెల్లుట
భరతుడు వెళ్ళినాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది. అ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడువారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళి పోబోతున్నారని కూడా తెలిసింది.
ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన ఘుసలి ముని వద్దకు వెళ్ళి, ” మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట. నేనుగాని, నా తమ్ముడుగాని, నా భార్యగాని తెలియక చేయగూడని పని ఏదైనా చేయలేదు గద?” అని అడిగాడు.
దానికి కులపతి, “మీరేమీ చెయ్యలేదు. గాని, నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తమ్ముడు ఖరుడనే వాడు జనస్థానంలో చేరి. అక్కడి మునులను పారదోలాడు. ఎప్పుడో మాకూ పీడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలి పోవాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి, నీకైనా ఈ చోటు వదలటమే మంచిది,” అన్నాడు.
తరువాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి వెళ్ళి పోయారు. రాముడు మాత్రం కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం. విడిచిపెడితే మంచిదని నిశ్చయించు కున్నాడు. ఆ ప్రకారమే అతను సీతాలక్ష్మి ణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి, తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు.
తరవాత అత్రిమహాముని జగద్విఖ్యాతు రాలైన తన భార్య అనసూయను పిలిచి, ఆమెకు వారిని పరిచయం చేశాడు. అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు. జుట్టంతా తెల్లబడిపోయింది, అవయవాలు సడలిపోయాయి. కాని ఆమె తపశ్శక్తి సాటిలేనిది.
అత్రిమహాముని రాముడితో, “ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసిమునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయే టట్టు చేసింది. పది రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగ మరొక సందర్భంలో చేసింది. సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను,” అన్నాడు.
రాముడు సీతతో, “ఈ మహాత్ముడి మాట విన్నావు కదా, అనసూయాదేవికి నమస్కరించు. అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది,” అన్నాడు.
సీత అనసూయకు తన పేరు చెప్పుకుని నమస్కారం చేసి ఆమెను కుశల మడిగింది అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి, “తల్లీ, నీవు బంధువులనూ, ఐశ్వర్యాన్నీ, అహంకారాన్నీ, సమస్తాన్నీ విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం ! అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను, స్త్రీని సమస్తవేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూలేరు, నీవిలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు,” అని చెప్పింది.
“నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు, నా మీద ఆచంచలమైన ప్రేమగలవాడు, నాకు తల్లి వంటివాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు; అటువంటి భర్తను సేవించటానికేం? నేను చిన్నతనం నుంచి పతివ్రతా ధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌసల్య కూడా నాకా ధర్మం బోధించింది. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను,” అన్నది సీత ఎంతో వినయంగా.
సీత తియ్యగా మాట్లాడుతూంటే అన సూయకు ఎంతో ముచ్చట అయింది. ఆమె సీతతో, ” అమ్మా, నీ కేమైనా కోరిక ఉంటే చెప్పు నేను తీర్చుతాను,” అన్నది.
సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, “మీరా మాట అనటమే నాకు పదివేలు” అని సమాధాన మిచ్చింది.
“అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది. నీవు తీసుకోవాలి” అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాలా, ఒక చీరా, కొన్ని ఆభరణాలూ, శరీరానికి పూసుకునే పూతా, మంచి పరిమళగంధమూ ఇచ్చింది.
తరువాత అనసూయ సీతతో, “నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను. ఆ కథంతా చెబుతావా, అమ్మా ?” అడిగింది.
సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది : “మా తండ్రి జనకమహారాజు మిధిలకు రాజు. ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నే నాయనకు దొరికాను. ఆయన కప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి, పెంచమని తన పెద్ద భార్య కిచ్చాడు.”
“నాకు పెళ్ళియీడు వచ్చాక ఆయనకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పు డాయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి, తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కు పెట్టిన వాడికి నన్నిచ్చి పెళ్ళిచేయ నిర్ణయించాడు. ఎందుకంటే దైవాంశ ఉన్నవారు తప్ప మామూలు మనుష్యులు దానిని ఎత్తనైనా శక్తిలేని వారవుతారు.”
“ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్తలేక దణ్ణం పెట్టి వెళ్ళిపోయారు. అంతలో విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడవచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడా ధనువును అవలీలగా ఎత్తి, తాడు తగిలించి లాగేసరికి ధనుస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది.”
“వెంటనే నా తండ్రి కన్యాదానం చెయ్య టానికి జలకలశం తెప్పించాడు. కాని రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు. తరవాత మాతండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించినాక మాకిద్దరికీ పెళ్ళి జరిగింది.”
ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదటనే అలంకరించుకోమని చెప్పి, తరువాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు ఆమె అలంకరణలన్నీ చూసి, “ఇవన్నీ ఎక్కడివి?” అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామ లక్ష్మణులు పరమానందం పొందారు.
సీతారామలక్ష్మణులు ఆ రాత్రి ఆత్రిమహాముని ఆశ్రమంలో గడిపి, మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు. “నాయనా, ఈ అరణ్యంలో నరభక్షకు లైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చేదారి చూపుతాను, ఆ దారినే వెళ్ళండి,” అని అత్రి చెప్పాడు.
ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామలక్ష్మణులు భయంకరమైన దండకారణ్యం ప్రవేశించారు.