లక్ష్మణుడు మరియు సీత రాముని వెంట అడవికి వెల్లుటకు సిద్దపడుట

రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తలవంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది.

జరిగినదంతా చెప్పి రాముడామెతో “నేను అడవుల నుంచి తిరిగి వచ్చేవరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడచుకో. అతని ఎదట నన్నెప్పుడూ పొగడకు బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతను సంతోషించేటట్టు మసలుకో. వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు” అని చెప్పాడు.

ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో “ఇవేం మాటలు నన్ను తేలిక చేసి పరాచకాలు ఆడుతున్నావా ఆడదానికి భర్తే కదా గతి? నిన్ను వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా! నీవు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్ళన్నీ నా కాళ్లతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవనా? నీవంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్యభయం ఉండబోదు. అడవిలోని వారందరిని కాపాడగలవాడివి నన్ను కాపాడలేకపోవు అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని అడగబోను నీవు లక్ష చెప్పినా సరే నా మనసు మారదు అన్నది.”

సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు కానీ సీత వాటిని లక్ష్య పెట్టలేదు. “నిన్ను చూసి సాముద్రిక వేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే నన్ను చూసి కూడా జ్యోతిష్యులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను” అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు. సీతకు కోపమూ, దుఃఖము ముంచుకు వచ్చాయి. ఆమె రాముడితో “అయ్యో మా నాన్న అయిన జనక మహారాజు, తన అల్లుడు పురుష రూపంలో ఉన్న ఆడదని తెలిస్తే ఏమనుకుంటాడు నిన్ను శూరుడని తెలియని వారు అనుకుంటున్నారు. నీ భయం దేనికి నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి పోవాలనుకుంటున్నావు.నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు గదా నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా నీవున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే” అంటూ బోరున ఏడ్చింది.

రాముడామెను రెండు చేతులు దగ్గరికి తీసుకొని సముదాయించి, తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ వనవాసానికి సిద్ధంకా నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయ్యి నీ వస్తు సామాగ్రి యావత్తు ముందు పని వాళ్ళకిచ్చి, మిగిలినది బ్రాహ్మణులకు ఇవ్వు. సన్యాసులకు భోజనం పెట్టించు బిచ్చగాళ్లకు దానాలు చేయించు, అన్నాడు. సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది.

ఆ భార్యా భర్తల సంభాషణ’ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, “అన్నా! నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను.” అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, ‘నీవు, నేను కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్యా సుమిత్రలు దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళను కనిపెట్టుకుని ఉండు.” అన్నాడు.

లక్ష్మణుడు ఒప్పుకోలేదు. “నేను రాత్రి, పగలూ నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చితీరాలి,” అన్నాడు. రాముడు సంతోషించి సరేనన్నాడు. వసిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకు రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు. వాటిలో అక్షయతూణీరాలూ, భయంకరా కారాలు గల ధనుస్సులూ, దుర్భేద్యమైన కవచాలూ, బంగారు పూతగల రెండు కత్తులూ ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి, వసిష్ఠుడి వద్దనున్న ఆయుధాలు తెచ్చాడు.

తరవాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వసిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి, ఆయన భార్యకు సీతచేత ఆమె నగలూ, మంచము, పరుపులూ దానం చేయించి, తాను శత్రుంజయమనే ఏనుగునూ, అనేక ఇతర ఏనుగులనూ ఇచ్చి పంపాడు. అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకూ, కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికి, బ్రహ్మ చారులకూ అంతులేని గోవులూ, బంగా రమూ, మణులూ, బట్టలూ దానం చేశాడు.

అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలూ, పడుచు భార్యా ఉన్నారు. ఆయన పరిగ ఏరుకుని, కందమూలాలు తవ్వుకునీ సంసారం నెట్టుకొస్తున్నాడు.

రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు, చిరిగిన పై బట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, “రాజపుత్రా, నేను పేదవాణ్ణి. చాలామంది బిడ్డలు గలవాణ్ణి. ఇంత కాలంగా పరిగ ఏరుకు బతుకుతున్నాం. కాస్త నన్ను కటాక్షించు,” అన్నాడు.

రాముడాయనతో నవ్వుతాలకు, ” అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు. అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవుల నిస్తాను,” అన్నాడు.

ముసలి త్రిజటుడు నడుము బిగించి, ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పివిసిరే సరికి, ఆది సరయూనది అవతలి గట్టున వెళ్ళి పడింది.

రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగ లించుకుని, “అయ్యా, నవ్వుల కన్నాను, కోప్పడ వద్దు. నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందా మనిపించింది. అన్నప్రకారం గోవుల నివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను” అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి అవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

ఈవిధంగా దానాలతో ఆబాలగోపాలాన్ని తృప్తి పరచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు.

Leave a Reply