భరతుడు భరద్వాజ మహా మునిని కలుసుకొనుట

భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణి, మంత్రులనూ వెంటబెట్టు కుని ఆశ్రమానికి వెళ్ళాడు.

మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు, వసిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్ళారు. వారని చూస్తూనే భరద్వాజుడు, “అర్ఘ్యం తీసుకు రండి,” అని కేక పెట్టి లేచి నిలబడ్డాడు. భరతుణ్ణి వసిష్ఠుడు పరిచయం చేసి నాక క్షేమసమాచారాలడిగి, “నాయనా, నీవు రాజ్యంచేసు కోక ఇలా ఎందుకు వచ్చావు?” అన్నాడు.

భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకుకూడా కలిగింది. భరతు అందుకు ఎంతో నొచ్చుకుని, భరద్వాజుడితో తన ఉద్దేశం చెప్పాడు. అంతా విని భర్తద్వాజుడు సంతోషించి, “సీతారామలక్ష్మిణులు చిత్రకూటంలో ఉంటున్నారు. ఇవాళ ఇక్కడ ఉండి రేపు పోదువుగాని,” అన్నాడు. ఇందుకు భరతుడు సమ్మతించాడు.

“నీ సేనలకన్నిటికీ నేను విందు చేయాలనుకుంటున్నాను. వారి నందరినీ దూరాన ఎందుకు ఉంచి వచ్చావు? ఇక్క డికి వారిని కూడా నీ వెంట తేవలిసింది,” అన్నాడు భరద్వాజుడు.

“మహాత్మ ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా తొలగి వెళ్లాలన్న నియమాన్ని బట్టి నేను దూరంగా ఉంచాను” అని భరతుడు సవనియంగా చెప్పాడు.

“ఫరవాలేదు, నీ సేనను పిలిపించు,” అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటుచేశాడు. విశ్వకర్మ వచ్చి క్షణంలో ఇళ్ళు ఏర్పాటుచేశాడు. నదులన్నీ వచ్చి నీరూ, మైరేయం అనే మద్యమూ సిద్ధంచేశాయి. దిక్పాలకులు పిలిపించబడ్డారు. పాటలు పాడటానికి విశ్వావసువూ, హాహా, హూహూ అనే గంధర్వులు, అనేకమంది అప్సరసలు పిలిపించబడ్డారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలు, పుష్పమాలలూ, పానీయాలూ, మాంసాలూ సిద్ధంచేశాడు.

మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో సిహాసనంతో కూడిన రాజసభ ఉన్నది. భరతుడు సింహాసనం మీద కూర్చున్నాక, మంత్రుల ఆసనం పైన కూచుని తన పరివారాన్నీ, గుహుణ్ణి యధోచితస్థానాలలో కూచోబెట్టాడు.

బ్రహ్మదేవుడూ, కుబేరుడూ, దేవేంద్రుడూ తలా ఒక ఇరవైవేల మంది అప్ప రసలనూ పంపారు. భరతుడు కొలువుతీరి ఉండగా నారద తుంబుర గోపులనే గంధర్వ రాజులు గానం చేశారు. అలంబున, మిశ్ర కేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు.

భరద్వాజాశ్రమంలో గల చెట్లూ, పొదలూ, లతలూ స్త్రీ రూపాలు ధరించి భరతుడి సైనికులకు స్నానాలు చేయించాయి “మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, తినండి,” అని వారిని హెచ్చరించాయి. సైనికులకు ఏలోటూ లేదు. వారు బాగా తిని, తాగి ఆనందపారవశ్యంలో మైమరచి, “మేము అయోధ్యకు పోము, దండకార ణ్యానికి పాము, ఇక్కడే ఉంటాము. రాముడూ, భరతుడూ క్షేమంగా ఉంటారు. గాక!” అన్నారు. కొందరు, ” స్వర్గమంటే ఇదే!” అని కేకలుపెట్టారు. వాళ్ళు పూల మాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు, పాటలు పాడారు, నృత్యాలు కూడా చేశారు. రకరకాల పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంతతిన్నా వారికి తనివి తీరలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది.

మర్నాడు భరతుడు భరద్వాజుడి దర్శనం | చేసుకుని, తమకు జరిగిన అతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని, రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్ళటానికి దక్షిణంగా ఒక మార్గమూ, నైరృతి దిశగా ఒక మార్గమూ ఉన్నాయని, సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమనీ భరద్వాజుడు సలహా ఇచ్చాడు.

దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ, కోపంతో దహించుకు పోయాడు. అది చూసి భరద్వాజుడు, ” రాముడు అడవికి వెళ్ళటం కైకేయి దోషం చేతనని ఒక్కనాటికి అనుకోకు. అందువల్ల ముందు ముందు చాలా లాభం కలుగు తుంది,” అన్నాడు.

Leave a Reply