భరతుడు రాముని కోరకు అరణ్యానికి వెళ్ళుట
భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. సదులపై వంతెనలు కట్టారు. దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా అక్కడక్కడా బావులు తవ్వారు. విడిదికి తగిన స్థలాలు చూసి అక్కడ వీధులు, ఇళ్ళూ గలిగిన శిబిరాలు నిర్మించారు. ఇలాటి శిబిరాలు సరయూ నదీ తీరం నుంచి గంగా తీరం వరకూ ఏర్పాటు చేశారు.
ఆ రాత్రి శంఖాలు మోగటమూ, భేరి వాయింపూ, వందిమాగధుల స్తోత్రాలూ విని భరతుడు నిద్ర లేచి, కంట నీరు పెట్టుకుని, “నేను రాజునుగాను, నాకు స్తోత్ర పాఠాలూ, మంగళ వాద్యాలూ వద్దు,” అని వాటిని నిలిపించాడు.
వసిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి, భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులనూ, మంత్రు లనూ, గణనాయకులనూ, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, ఇతర ముఖ్యులనూ వెంటనే పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. త్వరలోనే అందరూ వచ్చి సభను అలం కరించారు. దశరథుడు జీవించి ఉన్నప్పటి లాగే సభ కళకళలాడింది.
అప్పుడు అందరి సమక్షంలోనూ వసిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకో వలిసిందిగా కోరాడు. భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే పేరోలగంలో మళ్ళీ చెప్పి, “నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకురావటానికి శాయశక్తులా యత్నిస్తాను. అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితోపాటు వనవాసం ఉండి పోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇది వరకే ఆరంభమయాయి. మార్గం వేసే వారూ, మార్గరక్షకులూ మొదలైనవారు, ముందే వెళ్ళిపోయారు. ఇంక నేను బయలుదేరటమే తరువాయి,” అన్నాడు.
ఈ మాటలకు అందరూ సంతోషించారు. ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయ వలసిందిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు. అయోధ్యా నగరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది.
మర్నాడు భరతుడు పెందలాడే లేచి ప్రయాణమయాడు. అతని వెంట తొమ్మిది వేల ఏనుగులూ, ఆరవైవేల రథాలు, లక్ష గుర్రాలూ సహా కదిలాయి. కౌసల్యా, సుమిత్రా, కైకేయీ వాహనాలలో బయలుదేరారు. కైకేయికి పట్టిన దయ్యం దిగిపోయింది. తాను చేసినదానికి పశ్చా త్తాపపడుతూ ఆమె మిగిలినవారి కంటె ముందు కదిలింది. పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబండించారు. రాముడికి ఇష్టులైనవారూ, వర్తకులూ, ఇతరులూ రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు. అనేక వేలమంది బ్రాహ్మణులు ఎడ్లబళ్లెక్కి భరతుడి వెంట ప్రయాణమయారు.
ఇంత పెద్ద బలగాన్ని వెంటబెట్టుకుని భరతుడు గంగాతీరాన్ని శృంగిబేరపురం వద్ద చేరుకుని, తన సైన్యాన్ని నది వెంబడి అక్కడక్కడా విడియమని ఉత్తరు విచ్చాడు. అతను మంత్రులతో, “మనం ఈ రాత్రికి ఈ తీరాన విశ్రమించి రేపు ఉదయానే గంగ దాటుదాం. నే నిప్పుడు నదిలో దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను” అన్నాడు.