రాముడు సీత కోరకు దుక్కించుట

ఇంతలోనే వారికి చావ సిద్ధంగా ఉన్న జటాయువు శరీరం ఎత్తుగా కనిపించింది. ” ఇదుగో, వీడే సీతను తినేసి హాయిగా కూచున్నాడు! వీడి ప్రాణాలు తీసేస్తాను,” అంటూ రాముడు జటాయువుపై బాణం ఎక్కు పెట్టాడు.

“నాయనా, నన్ను రావణుడు చంపనే చంపాడు. నీవు మళ్ళీ ఎందుకు చంపు తావు? వాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడి వాడి వింటిని, రథాన్నీ, గాడిదలనూ, సారథిని ధ్వంసం చేశాను. వాడు కత్తితో నా రెక్కలు నరికేశాడు. తరువాత సీతను తీసుకుని ఆకాశమార్గాన వెళ్ళి పోయాడు,” అని జటాయువు చెప్పాడు.

ఈ మాటలు రాముడి చెవులకు శుభ వార్తలాగా వినిపించాయి. ఎందుకంటే సీతను రాక్షసులు చంపి తినలేదు, ఆమెను ఎత్తుకుపోయిన వాడెవడో కూడా తెలిసింది. రాముడు తన విల్లును వదిలి పెట్టి జటా యువును కౌగలించుకుని దుఃఖించాడు. అతను జటాయువును, ” రావణుడికి నే నేమి అపకారం చేశాను ? సీత నెందుకు అపహరించాడు? అతనుండే చోటేది?అతను ఎలా ఉంటాడు? ఎలాటి పరాక్రమం కలవాడు? వాడు తీసుకుపోతూ ఉంటే సీత ఏ స్థితిలో ఉన్నది? ఏమి చెప్ప మన్నది? నీకు శక్తి ఉన్నట్టయితే నాకు సమస్తమూ సవిస్తరంగా చెప్పు,” అని అడిగాడు.

కొనప్రాణాలతో ఉన్న జటాయువు, ” ఆ రావణుడు ఇలా దక్షిణంగా వెళ్ళాడు. వాడు కుబేరుడి తమ్ముడు,” అని మాత్రం చెప్పి ప్రాణాలు వదిలాడు. ఎంతో కాలం గొప్పగా జీవించి తన కోసం ప్రాణాలర్పించిన జటాయువుకు రాముడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపాడు, పిండ ప్రదానానికి కేసరీ మృగమాంసం సంపాదించాడు. అనంతరం రామలక్ష్మణులు గోదావరిలో స్నానాలు చేసి జటాయువుకు జలతర్పణాలు వదిలారు. తరువాత వారిద్దరూ జటాయువు చెప్పిన ప్రకారం సీతను వెతుకుతూ బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *