రాముడు ఖర ధూషణులను సంహరించుట
జనస్థానంలో ఖరుడు అనేకమంది ఇతర రాక్షసులతో సహా కూచుని ఉన్న చోటికి, రక్తం కారుతూ శూర్పణఖ వచ్చి చేరి నేల మీద పడిపోయింది. నెత్తురు వరదలు కారుతూ వికార రూపంలో తన చెంత వచ్చి పడిన శూర్పణఖను చూసి ఖరుడు, “నన్ను చూసి మూడు లోకాలవారూ భయపడతారు గదా, నిన్నీ విధంగా చేసి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్న వాడెవడు ? ” అని అడిగాడు.
శూర్పణఖ అతనితో సీతారామ లక్ష్మణులు గురించి, వారు తనకు చేసిన పరాభవం గురించి చెప్పి, “నీవు వారి ముగ్గురినీ చంపి వారి రక్తం తెప్పిస్తే తాగేస్తాను. ఇదే నా కోరిక,” అన్నది.
ఖరుడు తన అనుచరులలో పధ్నాలుగు మందిని ఏరి, “మీరు వెళ్ళి, శూర్పణఖ చెప్పే ముగ్గురినీ చంపి, వాళ్ళ రక్తం శూర్పణఖ కివ్వండి,” అని ఆజ్ఞాపించాడు. వారు పధ్నాలుగురూ శూర్పణఖను వెంట బెట్టుకుని రాముడి పర్ణశాలకు వచ్చారు. శూర్పణఖ సీతా రామ లక్ష్మణులను వారికి చూపి, ” ఆ ముగ్గుర్నీ వెంటనే చంపెయ్యండి,” అన్నది.
వారంతా ఆయుధాలతో సహా రావటంగమనించి రాముడు, లక్ష్మణుడితో, “వీళ్ళసంగతి నేను చూస్తాను. నీవు సీత వెంట ఉండు,” అని చెప్పి, రాక్షసులు కెదురు వెళ్ళి, “మీరంతా ఏమని నా మీదికి దండెత్తి వచ్చారు? ఇక్కడి మునులను రాక్షస బాధ నుండి కాపాడతానని మాట ఇచ్చి ఈ ధనుర్భాణాలు వెంట పెట్టుకుని ఉన్నాను. నా చేతిలో చావాలని లేనట్టయితే వెంటనే పారిపొండి,” అని చెప్పాడు.
రాక్షసుల మాటలు విని మండిపడి, ” నీవు మా దొర అయిన ఖరుడికి కోపం తెప్పించావు. నిన్ను చంపి పోవటానికే వచ్చాం. మేము చాలా మందిమి, నీవు ఒక్కడివి. అందుచేత నీకు చావు తప్పదు,” అంటూ పద్నాలుగు మంది తమ చేతుల్లో ఉన్న శూలాలు రాముడి పైన విసిరారు. రాముడు పధ్నాలుగు బాణాలతో ఆ శూలా అన్నిటినీ దారిలోనే ఖండించి, వాటినే మళ్ళీ తీసుకుని వింటితో ఎక్కుపెట్టి పధ్నాలుగు మంది రాక్షసులనూ కొట్టాడు. అందరూ పడిపోయి ప్రాణాలు వదిలారు.
ఇది చూసిన శూర్పణఖ కంగారు పడి, పెద్దపెట్టున అరుస్తూ, పరిగెత్తి పోయి మళ్ళీ ఖరుడి సమీపాన కుప్పకూలిపోయింది. ఖరుడామెను చూసి చిరాకు పడుతూ, “ఇంకాఎందుకు ఏడ్చి, పొర్లిగింతలు పెడుతున్నావు? ఇప్పుడే గద నీ పని చేసుకు రమ్మని పధ్నా లుగు మంది మెరికలలాటి వాళ్ళను పంపాను? వాళ్లు అజేయులు. ఇక ఊరడిల్లు!” అన్నాడు.
“నీవు పంపనూ పంపావు, వారంతా ఆ రాముడి చేత చావనూ చచ్చారు. నేను ఏడుస్తున్నానంటే నాకు భయం ముంచు కొచ్చింది. ఆ రాముడు సామాన్యుడు కాడు. అతనూ, లక్ష్మణుడూ మహా పరాక్రమవంతులు. నా పగా, చచ్చినవాళ్ళ పగా తీర్చదలిస్తే నీవే వచ్చి ఆ రాముణ్ణి చంపు. ఆ పని చెయ్యకపొయ్యావో నీ శూరత్వం కేవలం దంభమే; అసలు నీవీ జనస్థానంలో ఉండటానికి కూడా అర్హుడవు కావన్నమాట. ఎందుకంటే ఎప్ప టికైనా ఆ రాముడు వచ్చి నీ ప్రాణాలు తీసితీరుతాడు. రాముడంతటి బలం నీకూ ఉన్నదంటావా, వెంటనే వచ్చి అతణ్ణి చంపు. చంపలేకపోతే అతని చేతిలో చావనన్నాచావు!” అంటూ శూర్పణఖ భోరున ఏడ్చింది.
రాక్షసుల మధ్య తనను ఇలా అవమానించే సరికి ఖరుడికి పౌరుషం వచ్చింది. “రాముడి పరాక్రమం నేను లెక్కచేస్తానా? నీకు జరిగిన అవమానం తలుచుకుంటే నాకు పట్టరాని కోపం వచ్చేస్తున్నది. ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి నేనే స్వయంగా నరికేస్తాను. నీవు వారి రక్తం తాగు,” అన్నాడు ఖరుడు.
ఖరుడి వద్ద పధ్నాలుగు వేల మందితో కూడిన రాక్షస సేన ఉన్నది. దానికి నాయకుడు దూషణుడు, దూషణుడు ఆ సేనను ఆయత్త పరిచాడు. ఖరుడు రథమెక్కి, సేనతో సహా రాముడి పైకి యుద్ధానికి బయలుదేరాడు.
ఖరుడి వెంట పన్నెండు మంది రాక్షస ప్రముఖులూ, దూషణుడి వెంట మరి నలుగురు సేనాపతులూ ఉన్నారు.
తన పైకి ఒక పెద్ద రాక్షససేన’ వస్తు న్నట్టు గ్రహించి రాముడు సీతను లక్ష్మణుడి వెంట ఒక రహస్యమైన గుహకు పంపాడు. వారు వెళ్ళాక రాముడు తన కవచం ధరించి రాక్షసుల రాకను ఎదురు చూడసాగాడు.
ఇంతలో కోలాహలంగా అరుస్తూ, భేరులు మోగిస్తూ, అరణ్యమంతా మారుమోతలు వస్తూండగా, రాక్షస సైన్యం రానే వచ్చింది. రాముడికి ఎటు చూసినా రాక్షసులు కానవచ్చారు. ఖరుడి రథం రాముడి వద్దకు, పర్ణశాల సమీపానికి వచ్చింది. రాక్షసులు రాముడి మీద బాణవర్షం కురిపించారు.వాటిలో కొన్నిటిని రాముడు తన బాణాలతో కొట్టేశాడు, కాని రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు కొన్ని రాముణ్ణి గాయపరిచాయి. అయినా అతను పర్వతంలాగా చలించక నిలబడ్డాడు. అయితే రాముడు ప్రయోగించిన తీవ్రమైన బాణాలకు రాక్షసులు చావనారంభించారు.
అనేకమంది రాక్షసులు రాముడి చేత చావగా కొందరు భయపడి ఖరుణ్ణు శరణు జొచ్చారు. దూషణుడు వారికి ధైర్యం చెప్పి తాను రాముడి పైకి వచ్చాడు. అలా వచ్చిన దూషణుడి పైనా, అతని వెంట వచ్చిన రాక్షసుల పైనా రాముడు గాంధ శ్వాసం ప్రయోగించాడు. వేలకు వేలు బాణాలు వచ్చి రాక్షసులకు తగిలి వారి ప్రాణాలు హరించాయి. రాముడికి దూపణుడికి యుద్ధమయింది. ఈ యుద్ధంలో రాముడు దూషణుడి సారథినీ, గుర్రాలనూ, చివరకు దూషణుడి రెండు చేతులనూ బాణాలతో నరికేశాడు, దూషణుడి వెంట వచ్చిన అయిదు వేల మంది రాక్షనులనూ చంపేశాడు.
క్రమంగా రాముడు, తాను ఒంటరిగాడై ఉండికూడా, పధ్నాలుగు వేల మంది రాక్ష సులనూ చంపేశాడు. వారిలో ఖరుడూ, త్రిశిరు డనేవాడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆగ్రహానికి అంతు లేదు. అతడు రాముడి పైకి పోతూండటం చూసి త్రిశిరుడు అడ్డుపడి, ” రాముణ్ణి నేను చంపుతాను. నీవు చూస్తూ ఉండు. ఒకవేళ రాముడే నన్ను చంపితే తరువాత నీవు అతన్ని చంపవచ్చు,” అని బతిమాలాడు. ఖరుడు సరేనన్నాడు.
త్రిశిరుడికి రాముడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో త్రిశిరుడు తన గుర్రాలనూ, సారథిని, ధ్వజాన్ని పోగొట్టుకుని, రొమ్మున బాణాలు తగిలి మూర్ఛపోయాడు. ఆ స్థితిలో రాముడు మూడు బాణాలు వేసి త్రిశిరుడి తల నరికేశాడు.
తరవాత రాముడికి ఖరుడితో యుద్ధం జరిగింది. ఖరుడు రాముడి చేతి బాణాన్ని విరగగొట్టటమే గాక, అతని కవచాన్ని ముక్కలు ముక్కలు చేసి, రాముడి మర్మస్థానాలను తన బాణాలతో ఛేదించాడు. రాముడు నిలువునా రక్తం కారుతూ, అగస్త్యుడిచ్చిన విల్లు తీసుకుని భయంకర మైన బాణాలు ప్రయోగించి ఖరుణ్ణి విరధుణ్ణి చేశాడు. ఖరుడు తన గదను రాముడి పైకి విసిరివేశాడు. అది రాముడి బాణాలతో తుత్తునియలు కాగా, సమీపంలో ఉన్న చెట్టును పెరికి, దాన్ని రాముడిపై వేశాడు. రాముడు దాన్నికూడా తన బాణాలతో ఖండించి, ఖరుణ్ణి ఒక్క క్షణంలో చంపేశాడు.
రాముడిలా ఖర దూషణులనూ, పధ్నాలుగు వేల మంది రాక్షసులను చంపెయ్యటంతో దండకారణ్యానికి రాక్షస భయం తీరిపోయింది.
యుద్ధం అయిపోయినట్టు గ్రహించి, సీత గుహలో నుంచి బయటికి వచ్చి, రాముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషం పొందింది.