హనుమంతుడు సముద్రాన్ని లంఘించుట
జాంబవంతుడు ప్రోత్సాహం ఇవ్వగా హనుమంతుడు రామముద్రికతో సహా లంకకు దాటి, రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్ట నిశ్చయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి, మహేంద్రగిరి పైన అటూ ఇటూ తిరుగుతూ, పెద్ద వృక్షాలను తన రొమ్ముతో కూలదోస్తూ, మృగాలను చంపుతూ కొంత సేపు సంచరించాడు.
బయలుదేరే ముందు అతను సూర్యుడికీ, ఇంద్రుడికీ, వాయుదేవుడికీ, బ్రహ్మ కూ నమస్కారాలు చేసి, మహేంద్రపర్వతం మీద చేతులూ, కాళ్ళూ ఆనించి ఒక్క ఊపు ఊపాడు. చలనం ఎరగని మహేంద్ర పర్వతం ఆ ఊపుకు కంపించిపోయింది.
దాని మీది శిలలు బద్దలయాయి. గుహలలో ఉండే ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారు పడి ఆకాశంలోకి ఎగిరారు. ఋషులూ, చారణులూ, సిద్ధులూ హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళే యత్నంలో ఉండటం గురించి మాట్లాడుకోసాగారు.
హనుమంతుడు తన శరీరం మీది రోమాలను విదిల్చి, ఒక్క పెడబొబ్బ పెట్టాడు; ఒకసారి దూరం కేసీ, ఒకసారి ఆకాశం కేసీ చూసి, తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, ” నేను రామ బాణం లాగా వేగంతో లంకకు పోతాను,అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళతాను. అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి, ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసివస్తే సీతను తెస్తాను. లేదా, రావణుడితో సహా లంకనే పెల్లగించి యిక్కడికి తెస్తాను,” అన్నాడు.
ఈ మాట చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎగిరిన వేగానికి పెద్ద పెద్ద మానులు అతని వెనకగా గాలిలో లేచి కొంతదూరం ఎగిరి, తరవాత సముద్రంలో పడిపోయాయి. దూరప్రయాణం మీద బయలుదేరే వాణ్ణి బంధువులు కొంతదూరం సాగనంపినట్టుగా చెట్లు ఆ హనుమంతుణ్ణి వెంబడించాయి. అవి పడిపోయిన తరువాత కూడా వాటి పూలు మరికొంత దూరం హనుమంతుడి వెంట వెళ్ళాయి.
దక్షిణ దిక్కుగా హనుమంతుడు అతి వేగంగా సముద్రం మీదుగా పోతూ ఉంటే, అతని చేతుల సందుగా వెళ్ళే గాలి గొప్ప రొద చేసింది. అతను లంకకు చేటు సూచించే తోకచుక్కలాగా లంకకేసి వెళ్ళాడు. అతని వేగానికి అతనికి దిగువగా ఉండే సముద్రంలో పెద్ద తరంగాలు కల్లోలంగా లేచాయి. అతని నీడ సముద్రం మీద పది ఆమడల వెడల్పునా, ముప్ఫై అమడల పొడుగునా పడింది.
ఇలా సముద్రం మీదుగా వెళ్ళే హనుమంతుణ్ణి చూసి దేవతలు మెచ్చారు. సముద్రుడికి కూడా హనుమంతుడికి తోడ్పడాలనే ఆలోచన కలిగింది. ఎందుకంటే సముద్రుణ్ణి వృద్ధిపొందించిన సగరుడు ఇక్ష్వాకువంశం వాడు. అదే వంశంలో పుట్టిన రాముడి పని మీద హనుమంతుడు వెళు తున్నాడు. ఇక్ష్వాకు వంశానికి తన కృతజ్ఞత చూపుకోవాలంటే సముద్రుడికి యిది మంచి అవకాశం.
అందుకని సముద్రుడు తనలో దాగి ఉన్న మైనాక పర్వతంతో, “ఓ మైనాకుడా, పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా అడ్డం ఉన్న నీకిప్పుడు చిన్నపని చెబుతాను. వానర శ్రేష్టుడైన హనుమంతుడు రాముడి పని మీద అత్యంత సాహసంతో లంకకు ఎగురుతూ ఇటుగా వస్తున్నాడు.. నీకు పైకి, పక్కలకు కూడా పెరిగే శక్తి ఉన్నది గనక, నీటి పైకి పెరిగి ఆ హను మంతుడికి కాస్సేపు విశ్రాంతి ఇయ్యి నీ పైన కాస్సేపు విశ్రమించిన మీదట హనుమంతుడు. మిగిలిన దూరం మరింత తేలికగా వెళ్ళగలడు,” అన్నాడు.
అప్పుడు బంగారు శిఖరాలు గల మైనాక . పర్వతం సముద్రుడు కోరిన ప్రకారం ఆకాశంలోకి పెరిగింది. దాని బంగారు శిఖరాలు నూరు సూర్యుళ్ళలాగా వెలిగాయి.
ఆకస్మికంగా తన దారికి అడ్డంగా పెరిగిన మైనాకాన్ని చూసి హనుమంతుడు, ” ఇది నా పనికి విఘ్నంచెయ్యాలనే దుర్బుద్ధితో నా దారికి అడ్డంగా లేచింది,” అనుకుని ఆ పర్వతాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసేసరికి, అది పక్కకు పడిపోయింది.తనను సునాయాసంగా పడదోసిన హనుమంతుడి వేగానికి మైనాకుడెంతో సంతోషించి, మానవరూపం ధరించి ఒక శిఖరంపై నిలబడి, “వానరవీరుడా, నీవు అసాధ్యమైన సముద్ర లంఘనం చేస్తూ కూడా, కొంచెమైనా అలియకపోగా, నన్ను పడదోశావు. నా శిఖరం మీద కాస్సేపు విశ్రమించు. ఒకప్పుడు రాముడి పూర్వీకుడైన సగరుడూ, అతని కొడుకులూ సముద్రుడికి మహోపకారం చేశారు. అందుచేత రాముడి పని మీద వెళ్ళే నీకు కొంత సహాయంచేసి ఇక్ష్వాకులకు ప్రత్యుపకారం చెయ్యాలని సముద్రుడి కోరిక. అందుచేత నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నన్ను కోరాడు. నా మీద నిలిచి, అలసట తీర్చుకుని కందమూలఫలాలు ఆరగించి మరీ వెళ్ళు. ఏ అతిథి అయినా పూజ నీయుడే అన్నప్పుడు, నీ వంటి అతిథి మాట వేరే చెప్పాలా ? నీవు మహాపండితుడవు, అది అలాగుంచి, వాయుదేవుడి కుమారుడవు. నేను వాయుదేవుడికి ఋణపడి ఉన్నాను. ఎలాగంటే. కృతయుగంలో పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. అవివేగంగా గాలిలో ఎగురుతూ ఉండేవి.అందుచేత వాటిని చూసి దేవతలూ, ఋషులూ కూడా భయపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు అనేక వేల సంఖ్యలో తెగవేశాడు. నా రెక్కలు కూడా తెగవేయటానికి ఇంద్రుడు రాగా, నీ తండ్రి అయిన వాయు దేవుడు నన్ను అతివేగంగా తీసుకుపోయి ఇంద్రుడి బారినుండి కాపాడాడు. ఆయన దయ వల్ల నా రెక్కలు దక్కాయి. అందు చేత నీవు కాదనకుండా, నేనూ, సముద్రుడూ చేసే ఆతిథ్యాన్ని స్వీకరించాలి.” అని చెప్పాడు.
దానికి హనుమంతుడు, సంతోషం ! నీ మాటలే నాకు ఆతిథ్యం. మీ ఆతిథ్యాన్ని నిరాకరించి నందుకు మీరు కోపగించ వద్దు. కార్యార్థినైన నేను విశ్రాంతి తీసుకోవటం అసాధ్యం. రామబాణంలాగా లంకకు పోతానని వానరులకు మాట ఇచ్చాను,” అంటూ మైనాకుణ్ణి తన చేతితో తాకి, సంతోషం తాండవించే ముఖంతో ముందుకు సాగాడు. “నీకు కార్యసిద్ధి అగుగాక!” అని సముద్రుడూ, మైనాకుడూ అతన్ని దీవించారు.