వానర సేన స్వయంప్రభను కలుసుకోవడం

వానరులు తిరిగి తిరిగి అలిసిపోయి, ఆకలి దప్పులతో అలమటిస్తూ, మయుడు నిర్మించిన ఋక్షబిలం వద్దకు చేరుకున్నారు. అందులోనుంచి పక్షులు ఎగిరి వస్తున్నాయి, సువాసనలు వెలువడుతున్నాయి. కాని బిలానికి అడ్డంగా లతల పొదలు ఉండటం చేత లోపలికి వెళ్ళటం కష్టంగా ఉన్నది.

“ఈ బిలం లోపలినుంచి పక్షులు రావటం చూస్తేనూ, బయట ఉన్న పొదలు నవనవలాడుతూ ఉండటం చూస్తేనూ దీని లోపల బావో, చెరువో ఉంటుందని తోస్తుంది.” అన్నాడు హనుమంతుడు, వెంటనే వానరులు ఆ బిలం లోపలికి ప్రవేశించారు. లోపల గాఢాంధకారం.

ఆ కటిక చీకటిలో వారు ఒకరి చేతు లొకరు పట్టుకుని ముందుకు పోగా పోగా ఒక అద్భుతమైన ప్రదేశం వచ్చింది. ఆ ప్రదేశం, కాంతివంతంగా ఉన్నది. పెద్ద పెద్ద చెట్లున్నాయి. వెండి బంగారాలతో చేసి రత్నాలతో అలంకరించిన ఇళ్ళున్నాయి. బంగారు, వెండి, కంచు పాత్రలు రాసులుగా పోసి ఉన్నాయి. అలాగే అగరు చందనాలూ, ఫలాలు, పానీయాలూ, బట్టలూ, రత్న కంబళ్ళూ, తోళ్ళూ, బంగారమూ పెద్ద పెద్ద రాసులలో కనిపించాయి.

దగ్గిరలోనే ఒక స్త్రీ కృష్ణాజినమూ, నార బట్టలు ధరించి, కాంతితో వెలిగిపోతూ తపస్సు చేసుకుంటున్నది. హనుమంతు డామెను ” సమీపించి నమస్కరించి, ” నీవెవరు ? ఇదేమి బిలం ? మేము చాలా దూరం ప్రయాణించి, ఆకలి దప్పులతో అలమటిస్తూ నీరు దొరుకుతుందనే ఆశతో తొందరపడి ఈ బిలం ప్రవేశించాం. ఇక్కడి వింతలన్నీ చూస్తే ఇదంతా రాక్షసమాయేమో ననిపిస్తున్నది. ఈ ఇళ్ళూ,ఈ పళ్ళూ ఎవరివి? ఇక్కడి నీళ్ళలో బంగారు కమలాలూ, బంగారు చేపలూ, బంగారు తాబేళ్ళూ ఎవరి మహిమ చేత కలిగాయి?” అని అడిగాడు.

దానికి ఆ తపస్విని ఈ విధంగా సమా ధానం చెప్పింది :

“దానవుల విశ్వకర్మ అయిన మయుడు ఇక్కడ నివసించేవాడు. ఆయన దీర్ఘ తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు పొందాడు. ఆయనే తన శక్తిచేత ఈ ప్రదేశం సృష్టించి, హేమ అనే అప్సరతో ఇక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చాడు. అది చూసి సహించలేక దేవేంద్రుడు మయుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. తరవాత బ్రహ్మ ఈ ప్రదేశం హేమ కిచ్చేశాడు. హేమ నా ఇష్ట సఖి. నేను మేరుసావర్ణి కుమార్తెను. నా పేరు స్వయం ప్రభ. ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నాను. మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు? ఇక్కడి ఫలాలూ నీళ్ళూ పుచ్చుకుని మీ ఆకలి దప్పులు తీర్చుకుని మీ వృత్తాంతం చెప్పండి.”

వానరులందరూ పళ్ళు తిని నీరు తాగి సంతృప్తులయినాక హనుమంతుడు స్వయం ప్రభకు తమ పూర్వోత్తరాలు ఇలా చెప్పాడు.

“దశరథ మహారాజు కొడుకు రాముడు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడితో సమానుడు. అతను తన తమ్ముడైన లక్ష్మణుడితోనూ, భార్య అయిన సీతతోనూ దండకారణ్యానికి వచ్చాడు. వారు జనస్థానంలో ఉండగా సీతాదేవిని రావణుడు బలాత్కారంగా తీసుకుపోయాడు.’ రాముడి మిత్రుడైన సుగ్రీవుడు సమస్త వానరులకు రాజు. ఆయన సీతాదేవిని వెతికే నిమిత్తమై మమ్మల్ని దక్షిణ దిశకు పంపాడు. మేము దక్షిణ దిశ అంతా కలయ వెతికి, ఆకలి చెంది, అలసిపోయి ఒక చెట్టు కింద కూచుని ఉండగా లతలు కప్పి ఉన్న గొప్ప అంధకార బిలం కనిపించింది. తడి విదిలించుకుంటూ ఈ బిలం నుంచి పక్షులు బయటికి రావటం చూసి నేనే ఈ వానరులందరినీ ప్రోత్సహింప జేసి బిలంలో ప్రవేశించమన్నాను. మేము ఇలా వచ్చి ఇక్కడ చేరుకున్నాం. అదృష్టవశాన నీవు మాకు తటస్థపడి మా ఆకలి తీర్చి, మేలు చేశావు.”

హనుమంతుడు స్వయంప్రభ కు ఈ విధంగా తమ వృత్తాంతమంతా చెప్పి, “నీవు మాకు ప్రాణదానం చేశావు. దీనికి ఏ ప్రత్యుపకారం కోరినా చేస్తాము. మేము ఈ బిలంలో ప్రవేశించామేగాని ఇందులో నుంచి ఎలా బయట పడాలో తెలియటం లేదు,” అన్నాడు.

స్వయంప్రభ తన కేమీ ప్రత్యుపకారం అవసరం లేదనీ, వానరులంతా కళ్ళు మూసుకుంటే వారిని తన తపశ్శక్తిచే బిలం వెలుపల చేర్చుతాననీ అన్నది. వానరులందరూ కళ్ళు మూసి తెరిచేసరికి బిలం వెలుపల ఉన్నారు. స్వయంప్రభ వారున్న చోటికి కొండ గుర్తులు చెప్పి బిలంలోకి వెళ్ళి పోయింది.

Leave a Reply