సుగ్రీవుడు వానర సేనలను సీత జాడ కోరకు పంపుట
ప్రస్రణ పర్వతం మీది గుహ వద్ద పల్లకి దిగింది. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి రాముణ్ణి సమీపించి, చేతులు పైకెత్తి నమస్కారం చేసి నిలబడ్డాడు. మిగిలిన వానరులంతా అలాగే చేతులు పైకెత్తి నమస్కారాలు చేస్తూ నిలబడ్డారు. వారి చేతులు రాముడికి చెరువులోని తామర మొగ్గల్లాగా కనిపించాయి.
రాముడు సుగ్రీవుణ్ణి సమీపించి, అతను సాష్టాంగ పడగా లేవనెత్తి ఆలింగనం చేసుకుని, లాంఛనగా సహాయం అడిగాడు. దానికి సుగ్రీవుడు, “రామా, నా దూతలు పిలవగా ప్రపంచంలోని అన్ని మూలల నుంచి మహా పరాక్రమవంతులైన వానరులు వేల,లక్షల, కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారు రావణాసురుని చంపి సీతను నీకు తెచ్చి ఇవ్వడానికి సమర్థులు అన్నాడు.
రాముడి మాటకు సంతోషించి, “సుగ్రీవుడా, నీ వంటి వాడి సహాయంతో నేను రావణుణ్ణి అవలీలగా చంపి సీతను తెచ్చుకో గలను,” అన్నాడు.
ఇంకా కిష్కింధ పరిసరాలలో దుమ్ము లేస్తూనే ఉన్నది, భూమి కంపిస్తూనే ఉన్నది. వానరులింకా వస్తూనే ఉన్నారు. తార తండ్రి సుషేణుడు పదివేల కోట్ల వానరులతో వచ్చాడు. సుగ్రీవుడి మామా, రుమ తండ్రీ అయిన తారుడు వెయ్యి కోట్ల వానరులతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి కేసరి ఇరవైయొక్క వేల ఎనిమిది వందల డెబ్భై మంది వానరులతో వచ్చాడు.. గోలాంగూలాలకు రాజయిన గవాక్షుడు వెయ్యి కోట్ల వానరులతో వచ్చాడు. ధూమ్రుడనేవాడు రెండువేల కోట్ల భల్లూకాలను తెచ్చాడు. ఇదే విధంగా పవనుడూ, నీలుడూ, గవయుడూ, దరీముఖుడూ, అశ్వనీ దేవతల కొడుకులైన మైందద్వి విదులూ, గజుడూ, జాంబవంతుడూ, రుమణ్వంతుడూ, గంధమాదనుడూ, అంగదుడూ మొదలైనవారు అంతులేని బలాలను వెంట తెచ్చారు. ఈ వానరుల నందరినీ వనాలలోనూ సెలయేళ్ళ దగ్గిరా, కొండల వద్దా విడియింపజేశారు. సుగ్రీవుడు ఈ వానర బలాలన్నిటినీ రాముడి పరంచేసి, వారిని కావలిసిన విధంగా ఉపయోగించుకోమని చెప్పాడు.
“సుగ్రీవుడా, ముందుగా మనకు రెండు విషయాలు తెలియాలి. సీత బ్రతికి ఉన్నదా, లేదా అన్నది మొదటి విషయం. రెండో విషయం రావణుడి వాస స్థల మెక్కడ అన్నది. ఈ రెండు వార్తలూ తెలిసినాక కర్తవ్యం నిర్ణయింతాం. ఈ వార్తలు సేకరించటానికి నేనూ, లక్ష్మణుడూ సమర్థులం కాము.. ఆ పని నీ వల్లనే జరగాలి,” అని రాముడన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు వినతుడనే వానర నాయకుణ్ణి పిలిచి, “నీవు లక్ష వానరులను తీసుకుని తూర్పు దిక్కుగా వెళ్ళు. రావణుడుండే చోటు తెలుసుకుని సీత యొక్క స్థితిగతులు కనుక్కునిరా.” అన్నాడు. ఇలా సీతను వెదకబోయేవారు నెల రోజుల లోపుగా తిరిగి రావాలనీ, రానివారికి మరణ దండన విధించబడుతుందనీ సుగ్రీవుడు హెచ్చరించాడు.
తరువాత అతను నీలుణ్ణి , హనుమంతుణ్ణి, మహాబలుడు జాంబవంతుణ్ణి, మహెూత్రుణ్ణి, శరారినీ, శరగుల్ముణ్ణి, గుణ్ణి, గవాకుణ్ణి, గవయుణ్ణి, ఋషభుణ్ణి, మైందుణ్ణి, ద్వివిదుష్టు, విజయుణ్ణి, గంధ మాదనుణ్ణి, ఉల్కాముఖుష్టు, అసంగుణ్ణి, అంగదుణ్ణి, మరికొందరు వానర వీరులనూ దక్షిణ దిశ అంతా వెదకమన్నాడు. అతను వారికి దక్షిణానగల దేశాలన్నీ వివరించి, “మీరు దక్షిణ తీరం చేరినాక సముద్రం మీదుగా పోయే ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే సముద్రంలో నూరు యోజనాల వైశాల్యం గల లంక ఉన్నది. అదే రావణుడి నివాస స్థానం. సీత కోసం అక్కడ చక్కగా వెతకండి. సముద్రంలో ఇంకా పర్వతాలున్నాయి. వాటన్నిటిమీదా మీరు సీతాదేవిని వెదకండి. దక్షిణ దిక్కుగా ఇంకా ఏయే రహస్య ప్రదేశాలున్నా వాటి నన్నిటినీ గాలించండి. నెల లోపలగా ఎవరైతే తిరిగి వచ్చి, ‘చూశాను సీతను’ అని చెబుతాడో వాడికి నాతో సమమైన భోగ భాగ్యాలు కలుగుతాయి. వాణ్ణి నా ప్రాణాల కన్న ఎక్కువగా చూసుకుంటాను,” అని వానరులతో అన్నాడు.
ఇదే విధంగా సుగ్రీవుడు పడమటి దిక్కుగా తార తండ్రి అయిన సుషేణుడు మొదలైన వారిని రెండు లక్షల వానర బలగంతో పంపాడు. లక్షమంది వానర వీరులతో సహా శతవలి అనే వాళ్లు ఉత్తరంగా పంపాడు.
ఇంతమంది వానరులను అన్ని దిశలకూ పంపుతున్నప్పటికీ సుగ్రీవుడి ఆశలన్నీ హనుమంతుడిపైనే ఉన్నాయి. అందుచేత అతను హనుమంతుడితో, “నీవు భూమిపైనా, నీటిలోనూ, గాలిలోనూ పోగలవాడివి మూడు లోకాలూ తెలిసిన వాడివి. నీ తండ్రి వాయుదేవుడికి ఉన్నంత ప్రతిభ నీకూ ఉన్నది. అందుచేత సీతాదేవి దొరకటానికి అవసరమైన ప్రయత్నమంతా నీవే చెయ్యాలి,” అన్నాడు.
ఈ మాటలు వినగానే రాముడు హనుమంతుడి యందు సుగ్రీవుడికి ఎంత నమ్మకమున్నదీ గ్రహించాడు. హనుమంతుడే పని సాధించుకురాగలడేమోనన్న ఆశ రాముడిలో కూడా తల ఎత్తింది. అందుచేత తన పేరు గల ఉంగరాన్ని తీసి, సీతాదేవికి గుర్తుగా ఉండగలందులకై హనుమంతుడి కిచ్చాడు. అతను హనుమంతుడితో, “సీత ఈ ఉంగరం చూసి నట్టయితే నిన్ను విశ్వసిస్తుంది, భయపడకుండా ఉంటుంది,” అని చెప్పాడు. హనుమంతుడా ఉంగరాన్ని నెత్తిన పెట్టుకుని రాముడికి నమస్కారం చేసి బయలుదేరాడు.
“హనుమంతుడా, నా ఆశలన్నీ నీపైనే పెట్టుకుని ఉన్నాను. నీ శక్తికొద్దీ ప్రయత్నించి సీత దక్కేటట్టు చెయ్యాలి,” అని రాముడు హనుమంతుడితో చివరి మాటగా అన్నాడు.
హనుమంతుడు తన జట్టు వానరులతో బయలుదేరి వెళ్ళాడు. అలాగే అన్ని దిక్కులకు వానర సమూహాలు బయలుదేరి వెళ్ళాయి. వారు తిరిగి రావటానికి ఒక్క నెల గడువివ్వబడింది. ఈ నెల రోజులూ సీత వార్తకై ఎదురు చూస్తూ రాముడు లక్ష్మణుడితో సహా ప్రస్రణ పర్వతం పైనే గడిపాడు. సుగ్రీవుడు తన విధిని నెరవేర్చినవాడై పెద్ద బరువు దిగి పోయినట్టు సంతోషించాడు.
సుగ్రీవుడి చేత వేరువేరు దిక్కులకు పంపబడిన వానరులు సీత కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు పగలంతా వేరు స్థలాలకు వెళ్ళివెతుకుతూ రాత్రిపూట ఏ పళ్ళతోటల్లోనో తిరిగి కలుసుకొని నిద్రపోతూ నెల రోజులు వెతికారు. నెల పూర్తి అయేసరికి తూర్పు నుంచీ, పడమటి నుంచీ, ఉత్తరం నుంచీ వానరులు తిరిగి వచ్చి, తమకు సీత జాడ తెలియరాలేదని సుగ్రీవుడితో చెప్పుకున్నారు.
ఇక దక్షిణంగా బయలుదేరిన వానర వీరులు సీతను వెదుకుతూ చాలా దూరం వెళ్ళి వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. వింధ్య పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. దానిపై ఎన్నో శిఖరాలు, ఎన్నో గుహలు! దాని పరిసరాలలో ఎన్నో నదులు, ఎన్నో దుర్గమారణ్యాలు! వానరులు ఎంతో ఓపికగా ప్రతి ప్రదేశమూ వెతికారు.
ఒక చోట వారికి ఒక భయంకరుడైన రాక్షసుడు కనిపించాడు. వాడే రావణుడై ఉంటాడనుకుని అంగదుడు వాణ్ణి ఒక్క దెబ్బతో నెత్తురు కక్కి చచ్చేట్టు చేశాడు. ఆ సమీపంలో సీత ఉంటుందేమోనని వెతికారు. కాని వారి ఆశ ఫలించలేదు.
చిట్టచివరకు అందరూ అలిసిపోయి ఒక చెట్టు కింద కూచున్నారు. అప్పుడు అంగదుడు మిగిలిన వాళ్ళతో, “సీత కోసం మనం పడిన శ్రమ” ఇంతవరకు ఫలించలేదు. రోజులా చాలా గడిచాయి. సుగ్రీపుడు తీవ్రంగా దండించే మనిషి. అందుచేత మనం మరింత ఒళ్ళు వంచి వెతకాలి, నిద్రకూడా మానాలి,” అన్నాడు. గంధ మాదనుడు కూడా అంగదుడి అభిప్రాయాన్ని బలపరిచాడు.
ఆకలి దప్పులతో ఆర్చుకుపోతున్న గొంతుతో అతను, “సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం అందరూ సమస్త వనాలూ, పర్వతాలూ, గుహలూ, బిలాలూ సీత కోసం వెతకండి,” అన్నాడు. వెంటనే వానరులంతా లేచి వింధ్యా రణ్యాలన్నీ సీత కోసం గాలించ సాగారు. వారా పర్వతమంతా గాలించే లోపలనే నెల రోజుల గడువు పూర్తి అయిపోయింది.