వాళీ దుందుభిని సంహరించుట

“దున్నపోతు రూపంలో దుందుభి అనే రాక్షసుడు మహా బలశాలి ఉండేవాడు. వాడిది వెయ్యి ఏనుగుల బలం. వాడు బల గర్వితుడై సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. సముద్రుడు మానవ రూపంలో పైకి వచ్చి దుందుభితో, ‘నీ బోటి యుద్ధ విశారదుడితో యుద్ధం చేసే శక్తి నాకైతే లేదుగాని అలాటి శక్తి గల వాడెవడైనా ఉంటే అది హిమవంతుడు. నీవు అతనితో యుద్ధం చేస్తే బాగుంటుంది,’ అని చెప్పాడు.

“దుందుభి శరవేగంతో హిమాలయానికి వెళ్ళి, తన కొమ్ములతో గుండురాళ్ళను విరజిమ్ముతూ, రంకెలు పెట్టి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, ‘ నాయనా, నేను నీతో యుద్ధం చెయ్యలేను, నన్నెందుకు బాధిస్తావు? అదీగాక ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్న కారణం చేత యుద్ధానికి వీలుపడదు. కిష్కింధలో వాలి అనే వానర శ్రేష్ఠుడున్నాడు. యుద్ధంలో అతను నీ తీట తీర్చగలడు,’ అని చెప్పాడు.

“దుందుభి కిష్కింధకు వచ్చి ద్వారం వద్ద నేలను గిట్టలతో గీరుతూ ఆర్భాటం చేశాడు. వాడు చేసే ఆగడం సహించలేక వాలి అంతఃపుర కాంతలతో సహా బయలుదేరి వచ్చాడు. అతను దుందుభితో, ‘ఓరీ, నేను నిన్నెరుగుదును. ఎందుకు రంకెలు పెడుతున్నావు? ప్రాణాల మీద ఆశ లేదా?’ అన్నాడు. దుందుభి మండిపడి “స్త్రీల ఎదట బీరాలు పలకటం కాదు, నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడు కాకపోతే, ఈ రాత్రి అంతా సుఖంగా గడిపి, నీ వానరుల కందరికీ అప్పగింతలు చెప్పి నీ స్థానంలో మరొక రాజును ఏర్పాటు చేసుకుని ఆఖరుసారి కిష్కింధ అంతా చూసుకుని రేపు ఉదయం యుద్ధానికి రా! అంతదాకా నీకు గడువిస్తాను” అన్నాడు.

“వాలి దుందుఖిని చూసి హేళనగా నవ్వి, తార మొదలైన అంతఃపుర స్త్రీలను పంపేసి, తనకు ఇంద్రుడిచ్చిన కాంచన మాలను మెడలో వేసుకుని యుద్ధానికి వచ్చాడు . ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. వస్తూనే వాలి దుందుభి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. దెబ్బకు దుందుభి చెవుల నుంచి రక్తం కారింది. క్రమంగా వాలి బలం హెచ్చింది, దుందుభి బలం క్షీణించింది. చివరకు వాలి ఆ రాక్షసుడిని ఎత్తి నేలకు వేసి కొట్టి చంపాడు. అలా చచ్చిన దుందుభి కళేబరాన్ని వాలి ఎత్తి ఆమడ దూరాన వెళ్లి పడేలాగా విసిరి వేశాడు. ఆ కళేబరం నోట కారే రక్తపు చుక్కలు మతంగ మహాముని ఆశ్రమంలో పడ్డాయి. ఆ నెత్తురు చుక్కలు చూసి మతంగుడు మండిపడి ఆశ్రమం దాటి వచ్చి దుందుభి కళేబరాన్ని చూసి, ‘ఈ రాక్షస కళేబరాన్ని ఇక్కడికి విసిరిన వాడుగాని, వాడి అనుచరులుగాని ఈ వనంలోకి వస్తే చస్తారు!’ అని శపించాడు.

“మతంగ మహాముని శాపం విని ఆ ప్రాంతాల ఉండే వారి అనుచరులు భయపడి వెళ్లిపోయి వాలితో ఈ సంగతి చెప్పారు. శాపవిమోచనం చెయ్యమని వాలి వేడుకున్నప్పటికీ మతంగుడు అనుగ్రహించలేదు. అది మొదలు వాలి ఈ ఋశ్యమూకం చాయలకు రాడు. ఆ సంగతి తెలిసి నేను నా మంత్రులతో ఇక్కడ తలదాచుకున్నాను. అదుగో, గుట్టలాగా కని పించే దుందుభి కళేబరం!”

“వాలి బలానికి మరొక ఉదాహరణ కూడా చెబుతాను. ఆ కనిపించే ఏడు సాల వృక్షాలున్నాయే, వాటిలో దేని కాండంలో నుంచి అయినా దూసుకుపోయేలాగా వాలి బాణం వేయగలడు. ఇంత శక్తి మంతుణ్ణి నీవు ఏ విధంగా వధిస్తావో!”

సుగ్రీవుడు చెప్పినదంతా విని లక్ష్మణుడు నవ్వుతూ, “రాముడు ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది ?” అని అడిగాడు.

సుగ్రీవుడు లక్ష్మణుడితో, “నాకు వాలి బల పరాక్రమాలు తెలుసును. అతను ఎన్నడూ ఓటమి ఎరిగినవాడు కాడు. అందుచేతనే అతనికి వెరిచి ఇక్కడ ఉన్నాను. నాకు రాముడి పరాక్రమం తెలియదుగద !” అన్నాడు.

రాముడు దుందుభి కళేబరాన్ని సమీపించి కాలి బొటన వేలితో ఎత్తి పైకి కిందికి ఆడించి విసిరే సరికి అది పది ఆమడల దూరాన వెళ్ళి పడింది.

అది చూసి సుగ్రీవుడు ఆశ్చర్య పడటానికి మారుగా “రామా, దీన్ని ఆమడ దూరం విసిరి వేసినప్పుడు వాలి యుద్ధం చేసి బాగా అలిసి ఉన్నాడు. అదీగాక అప్పుడది కొత్త కళేబరం, ఇప్పుడది ఎండి పోయి తేలిక అయింది. అందుచేత నీకూ వాలికీ గల తారతమ్యం నాకు స్పష్టంగా తెలియలేదు. ఈ సాల వృక్షాలలో దేన్ని గాని దూసుకు పోయేలాగా నీవు బాణం వేసినట్టయితే మీ ఇద్దరి బలా బలాలు తెలుసుకో గలుగుతాను,” అన్నాడు.

రాముడు సరేనని ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టేసరికి అది ఏడు సాల వృక్షాల కాండాలలో నుంచీ దూసుకు పోయి, కొండలోకి చొచ్చుకు పోయి, భూమిని పగల గొట్టుకుని మళ్ళీ పైకి వచ్చి రాముడి అంబుల పొదిలో ప్రవేశించింది.

ఇది చూసి సుగ్రీవుడు నిర్ఘాంత పోయి,” రామా, వాలి మాట దేనికి, దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చినా నీ ఎదట నిలవలేడు. నీ మైత్రి కలగటం నా అదృష్టం! ఇంక నా శత్రువైన వాలిని ఇప్పుడే వధించు,” అంటూ రాముడి ముందు సాష్టాంగ పడి నమస్కరించాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించుకుని, “ఇప్పుడే కిష్కింధకు పోదాం. నీవు మా కన్న ముందు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలు,” అన్నాడు.

Leave a Reply