రాముడు సీత కోరకు దుక్కించుట
రాముడు మాయాలేడి రూపంలో వచ్చిన మారీచుణ్ణి చంపి ఆశ్రమానికి తిరిగి వస్తూడగా వెనుక నుంచి నక్క ఒకటి కూసింది. ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు “సీతను ఏ రాక్షసులో తిని ఉండరు గదా!” అని భయపడ్డాడు. లేడీ రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవటమూ చస్తూ కూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చెయ్యటమూ చూస్తే తన కేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది. సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం అవలంబించేటందుకు కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మీణుడే తనకు ఎదురు వస్తూండగా వెనక నుంచి నక్క ఒకటి వస్తూ కనిపించాడు!
రాముడి ఆందోళన రెట్టింపయింది.అతను లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని, “ఇదేమిటి, లక్ష్మణా ? సీతను ఆశ్రమంలో ఒంటిగా విడిచి వచ్చావా? సీతను మనం ప్రాణాలతో చూస్తామా? సీతకు ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలవవు!
నేను పోయాక నీవు అయోధ్యకు తిరిగిపోతే, కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు ! ఆ రాక్షసుడి కేకకు శూరుడవైన నీవు కూడా భయపడ్డావా? నేను ఖరదూషణాది రాక్షసులను చంపానేమో, వారు పగపట్టి ఉన్నారు, సీతను తప్పక చంపేస్తారు. లక్ష్మణా, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి. దుఃఖంలో మునిగి ఏమీ చేయలేని స్థితిలో పడ్డాను,” అన్నాడు.
లక్ష్మణుడు సీత అన్న కఠోరవచనాలు వివరించి చెప్పి, ఆ పరుషాలు సహించలేక బయలుదేరి వచ్చానన్నాడు.
“సీత అజ్ఞానం చేత ఏవేవో అన్నదని. ఆగ్రహించి నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించటం చాలా తప్పు! నాకే ప్రమాదమూ రాదని తెలిసిన వాడవు సీత వెంటనే ఉండ వలిసింది.” అన్నాడు రాముడు.
రాముడు భయపడ్డంతా అయింది. సీత పర్ణశాలలో లేదు. ఆమె మామూలుగా తిరిగేచోట్లలో కూడా లేదు. ఆశ్రమం బావురు మంటున్నది. అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతను సీత కోసం వెతుకుతూ.. అడవిన పడ్డాడు. ” సీత ఎక్కడ ఉన్నది?” అని అరణ్యవృక్షాలను పేరుపేరునా అడిగాడు. దుఃఖాతిశయంతో అతనికి మతి పోయింది. అంత దూరాన సీత కనిపించినట్టూ, తనకు అందకుండా పోతున్నట్టూ, భ్రమ కలిగింది, సీతను కేక పెట్టి పిలిచాడు. ఉన్నట్టుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనను ఏడిపిస్తున్నదన్న అనుమానం వచ్చింది, కనిపించమని ఆమెను వేడుకున్నాడు.
లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి, ” అన్నా, దుఃఖించి లాభంలేదు. చుట్టు పక్కల అరణ్యమంతా వెతుకుదాం. సీత ఎంతోదూరం వెళ్ళి ఉండకపోవచ్చు.” అని ధైర్యం చెప్పాడు. పరిసరారణ్యమంతా వెతికినా వారికి సీత జాడ తెలియలేదు.
రాముడికి మళ్ళీ అధైర్యం పట్టుకున్నది;అతని దేహంలో శక్తి లేకుండా పోయింది.అతను నిస్త్రాణగా కూలబడిపోయాడు.
అన్న సీతను తలుచుకుని పెద్ద పెట్టున శోకాలు పెట్టుతూండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఓదార్చటానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని ఆ మాట లేవీ రాముడి చెవికెక్కలేదు. అతను లక్ష్మణుడితో, “సీతను రాక్షసుల పాలుకానిచ్చిన నన్ను లోకం నిర్వీర్యుడి కింద జమ కడుతుంది. సీత లేకుండా నేను అయోధ్యకెలా వెళతాను, సీతలేని శూన్యాంతఃపురంలో ఎలా ప్రవేశిస్తాను? నేను వచ్చానని తెలిసి జనక మహారాజు వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను ? సీత లేక నేను బతికే మాట అబద్ధం. అందుచేత నన్నిక్కడే వదిలి నీవు అయోధ్యకు వెళ్ళు. భరతుణ్ణి రాజ్యం పాలించమన్నానని చెప్పు. నేను సీతా ఎలా నాశనమయామో మా తల్లికి చెప్పు,” అన్నాడు. రాముడు స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు.
చివరకు లక్ష్మణుడి ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకటానికి నిశ్చయించాడు. ఒకచోట వారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి ; వాటిని రాముడు గుర్తించాడు. మరికొంత దూరాన రాక్షసుడి అడుగులూ, సీత అడుగులూ కనిపించాయి. అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపోవయత్నించింది. ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలూ, విరిగిపోయిన రథమూ, గొడుగూ, గాడిదలూ, సారథి కళేబరమూ, బంగారు విల్లూ మొదలైనవి కనిపించాయి. ఆ రక్తం సీతదే ననుకున్నాడు రాముడు.
అప్పటివరకూ రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగలేదు; కాని ఆ క్షణంలో రాక్షసనిర్మూలనం చెయ్యాలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది. నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే మూడు లోకాలనూ ఒక్క బాణంతో భస్మీపటలం చేస్తాను,” అని రౌద్రంగా అన్నాడు.
లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ, ” ఈ యుద్ధం జరిగినచోట ఒక్క మనిషి అడుగు జాడలే ఉన్నాయి. ఒక్కడు చేసిన తప్పుకు మూడు లోకాలను శిక్షించటం అన్యాయం. ఎవడు సీతను అపహరించాడో వాడి కోసం అన్నిచోట్లా వెతుకుదాం,” అన్నాడు.