బంగారు జింకను పట్టుకోమని సీత రాముడిని కోరుట
సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడిని చూడనే చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది ఆమె రామ లక్ష్మణులను కేక పెట్టింది. ఆమెను సమీపిస్తూ వారుకూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు రాముడితో, “ఈ లేడి చూస్తే మారీచుడి లాగుంది. వాడు మాయా రూపంలో వేటకువచ్చిన రాజులను తిన్నాడు. ఎందరో మునులను తిన్నాడు. ఇలాటి లేడి ఎక్కడా ఉండదు,” అన్నాడు. సీత లక్ష్మణుణ్ణి ఊరుకోమని, రాముడితో, ” ఆ లేడి నాకు కావాలి. తీసుకురా. చక్కగా ఆడుకుందాం. దాని అందం ఏమందం! దీన్ని ప్రాణాలతో తెస్తే, మనతో బాటు అయోధ్యకు తీసుకుపోదాం ; భరతుడూ, అత్తలూ చూసి ఎంతో మురిసి పోతారు. ఒక వేళ ఇది ప్రాణంతో చిక్కక పోతే చంపి అయినా తీసుకు రావాలి. దీని చర్మాన్ని నేను ఉంచుకుంటాను,” అన్నది.
ఆ మాయలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీతకు కలిగినట్టే దాని పైన భ్రమ పుట్టుకొచ్చింది. అతను లక్ష్మణుడితో, నీవూ జటాయువూ సీతను చూసుకోండి. “నేను ఈ లేడిని పట్టి తెస్తాను,” అని కత్తి, విల్లంబులు పుచ్చుకుని బయలుదేరాడు.
మారీచుడు తన పని శక్తి వంచన లేకుండా నిర్వహించాడు. అతను లేడి రూపంలో కనిపిస్తూ మాయమవుతూ, ఒక సారి దూరమవుతూ, ఒకసారి దగ్గిరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు. ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి ఆ లేడి గుండెలో దూసుకు పోయేటట్టు కొట్టాడు. మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షసరూపుతో కిందపడిపోతూ, ‘అయ్యో! సీతా! లక్ష్మణా !” అని రాముడి గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు. ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది. మాయలేడి మారీచుడే! అస్పష్టమైన భయాలు మనసును ఆవరించగా రాముడు మరొక లేడిని చంపి, దాని మాంసం తీసుకుని వేగంగా తమ పర్ణశాల కేసి నడవసాగాడు.
“లక్ష్మణా, అది నీ అన్న చేసిన ఆర్త నాదం. నా కేమో భయంగా ఉంది. నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి కాపాడు,” అన్నది. సీత ఆశ్రమంలో,
సీత ఎంతగా విలవిలలాడుతున్నప్పటికీ చలించక లక్ష్మణుడు, “దేవ మానవ గంధర్వ రాక్షసులలో అన్నను భయపెట్ట గలవారెవరూ లేరు. ఇది రాక్షస మాయ. అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు. నేను వెళ్ళను.” అన్నాడు.
“ఆయన ఆపదలో ఉంటేకూడా పోనంటావే, నీ వాయనకు మిత్రుడవా, శత్రుడవా? నీవు కోరేది రాముడి నాశనం లాగుందే! నా మీద దురాశ పెట్టుకున్నావా? రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను. నన్ను నీవు రక్షించేదేమిటి?” అన్నది సీత.
లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయాన్నీ, ‘ అనుమానాన్నీ పోగొట్ట యత్నించాడు. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. ఆమె అతన్ని బాగా ఎత్తి పొడిచింది. ” నీవు ఎవరి కోసం రాముడి వెంటపడి వచ్చావు ?. నీ కోసమా, భరతుడి కోసమా? నేను నీకు గాని, భరతుడికి గాని దక్కుతానని కలలో కూడా అనుకోవద్దు,” అన్నది.
చివరకు లక్ష్మణుడు చిరాకుపడి, “అనరాని మాటలనటం స్త్రీలకు సహజమే. నన్నిన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు. నేను వెళ్ళినాక నీకు దేవతలే దిక్కు” అంటూ అయిష్టంగా అన్న కోసం బయలుదేరాడు.