సీతారామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరుట

సీతారామ లక్ష్మణులు అగస్త్యుడికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ఆయన చెప్పినదారినే పంచవటికి బయలు దేరారు. దారి మధ్యలో వారికొక బ్రహ్మాండ మైన గద్ద కనబడింది. దాన్ని చూసి రామ లక్ష్మణులు ఎవరో రాక్షసుడనుకుని, ” ఎవరు నీవు ?” అని ప్రశ్నించారు.

ఆ గద్ద వారితో చాలా మంచిగా, “నాయనలారా, నేను మీ తండ్రి దశరథ మహారాజు స్నేహితుణ్ణి. నా కులగోత్రాలు చెబుతాను. దక్షప్రజాపతికి అరవైమంది కూతుళ్ళు. వారిలో ఎనిమిది మందిని కశ్యపుడు పెళ్ళాడాడు. వారిలో తామ్ర అనే ఆమె అయిదుగురు ఆడ పిల్లలను కన్నది. వారిలో ఒకతె శుకి. శుకి కూతురు నత. నత కూతురు వినత. వినతకు గరుడుడూ, అరుణుడూ అని ఇద్దరు కుమారులు. ఆరుణుడు మా తండ్రి, శ్యేని మా తల్లి. నాకు సంపాతి అని అన్న ఉన్నాడు.. నా పేరు జటాయువు. ఇది చాలా భయంకర మైన అరణ్యం. ఎన్నో క్రూరమృగాలు, ఎందరో రాక్షసులు. అందుచేత మీ కభ్యంతరం లేకపోతే మీ వెంట ఉండి మీరిద్దరూ ఎటైనా వెళ్ళినప్పటికీ సీతకు నేను అండగా ఉంటాను,” అన్నది.

జటాయువు పుృత్తాంతం విని రాముడు చాలా సంతోషించి అతణ్ణి కౌగలించుకుని, తన తండ్రిని గురించి కబుర్లాడుతూ, సీతా లక్ష్మణ జటాయువులతో సహా పంచవటి చేరుకున్నాడు.

పంచవటి విషసర్పాలతోనూ, క్రూర మృగాలతోనూ, బాగా పూచిన చెట్లతోనూ ” నిండి ఉన్నది.

“లక్ష్మణా, ఇదే పంచవటి. నీకూ, నాకూ సీతకూ సుఖంగానూ, నీటికీ, ఇనక -దిబ్బలకు, దర్భలు మొదలైన వాటికి దగ్గిర గానూ ఉండే చోటు చూసి పర్ణశాల నిర్మించు,” అన్నాడు రాముడు.

అన్నా నీవే అలాటి చోటు చూసి, పర్ణశాల నిర్మించమని ఆజ్ఞఇయ్య, నీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను.” అన్నాడు లక్ష్మణుడు.

రాముడు ఒక సమప్రదేశం చూసి అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు. ఆ ప్రదేశం గోదావరికి సమీపంగా ఉన్నది. లక్ష్మణుడు మట్టి తవ్వి గోడలు పెట్టాడు; వెదురు స్తంభాలు బలమైనవి నిలబెట్టి, వాటిపైన జమ్మికొమ్మలు పరిచి, తాళ్ళతో గట్టిగా కట్టి, వాటిపైన రెల్లుతోనూ, దర్భలతోనూ మంచి కప్పు వేశాడు, పర్ణశాల అందంగా కుదిరింది. లక్ష్మణుడు పర్ణశాల లోపలి నేల అంతా చక్కగా చదునుచేశాడు.

రాముడు గోదావరికి వెళ్ళి, స్నానం చేసి పద్మాలూ, ఫలాలు తెచ్చాడు. లక్ష్మణుడు పర్ణశాలకు పుష్పబలి చేసి శాంతి జరిపాడు.

ఇంతపనీ చేసినందుకు రాముడు లక్ష్మణుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ‘లక్ష్మణా, నీవు నన్ను ఇలా కనిపెట్టి ఉంటే నాకు మన తండ్రి జీవించి ఉన్నట్టే. ఉన్నది,” అన్నాడు.

ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా నివసించారు.

Leave a Reply