మాండకర్ణి మహాముని కథ

ముందు రాముడూ, వెనక సీతా, సీత వెనకగా అస్త్రాలు చేపట్టి లక్ష్మణుడూ నడుస్తూ మునులను వెంటబెట్టుకుని అనేక పర్వతాలూ, నదులూ, సరస్సులూ, కొలనులూ, పక్షుల సమూహాలూ, ఏనుగుల మందలూ, ఎనుబోతుల మందులూ, అడవి పందుల మందలూ చూశారు.

సూర్యాస్తమయ సమయానికి వారు ఒక అందమైన సరస్సు చేరుకున్నారు. సరస్సు అడుగు నుంచి చక్కని గీతవాద్య ధ్వనులు రావటం చూసి రామ లక్ష్మణులు ఆనందాశ్చర్యాలు పొంది, ధర్మభృత్తనే మునిని, “ఏమిటి వింత? రహస్యం కానిపక్షంలో చెప్పండి, విని ఆనందిస్తాము,” అని అడిగారు.

వారికి ధర్మభృత్తు ఆ సరస్సు పుట్టు పూర్వోత్తరాలు తెలిపాడు. ఆ సరస్సు పేరు పంచాప్సరం. దీనిని మాండకర్ణి అనే మహాముని తన తపశ్శక్తి చేత నిర్మించాడు. ఆ మహాముని వాయు భక్షణచేస్తూ పదివేల సంవత్సరాలు అతి దారుణమైన తపస్సు చేసేసరికి, అగ్ని మొదలుగాగల దేవతలు భయపడి, ఆ ముని తమలో ఎవరిస్థానమో కాజేస్తాడని రూఢి చేసుకుని, తపో భంగం చెయ్యటం కోసం మెరుపు తీగల్లాటి అయిదు గురు అప్సరసలను ఏరి మాండకర్ణి వద్దకు పంపారు. వారి ఎత్తు పారింది. మాండకర్ణి వారి వ్యామోహంలో పడి, తన తపశ్శక్తి ధారపోసి ఈ సరస్సు సృష్టించి, తాను యౌవన దేహం ధరించి, నీటి అడుగున అప్సరసల నిమిత్తం అదృశ్యహర్మ్యాలు నిర్మించి, వారిని భార్యలుగా చేసుకుని నృత్యగాన వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు.

ధర్మభృత్తు చెప్పిన ఈ కథ వింటూ సీతా రామ లక్ష్మణులు ఆశ్రమసమూహా లను చేరుకున్నారు. ఆశ్రమవాసులు రాముడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. రాముడు తన భార్యతోనూ, తమ్ముడితోనూ ఒక్కొక్క ఆశ్రమంలోనూ తన ఇష్టానుసారం ఒక సంవత్సరమో, ఎనిమిది మాసాలో, ఆరు మాసాలో, మూడు మాసాలో ఉంటూ సుఖంగా పది సంవత్సరాలు గడిపాడు.

పది సంవత్సరాల అనంతరం రాముడు సీతా లక్ష్మణులతో తిరిగి సుతీక్ష మహా ముని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఉంటూ అతను ఒకనాడు మహామునితో, ” ఈ మహారణ్యంలో ఎక్కడో అగస్త్యుల వారు ఉంటున్నారని వారూ వారూ అనగా విన్నాను. కాని స్పష్టంగా వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నది చెప్పినవారు లేరు. మీరు తెలిపినట్టయితే మేము ముగ్గురమూ వెళ్ళి వారి దర్శనం చేసుకుంటాము. ఆయనకు శుశ్రూష చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది,” అన్నాడు.

ఈ మాట వినగానే సుతీక్షుడు, “నేను కూడా నీకు అదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. ఇక్క డికి దక్షిణంగా నాలుగామడలు పోతే అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం వస్తుంది. అక్కడి కింకా ఒక ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉన్నది. అవి చాలా అందమైన ఆశ్రమాలు. అక్కడ మీ ముగ్గురికీ చాలా ఆనందంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంటే వెంటనే బయలుదేరండి,” అన్నాడు.

Leave a Reply