ఋష్యశృంగుని కథ
అంగ దేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రుల లో ఒకడు. రోమపాదుడు అన్యాయంగా పరిపాలించడం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది, బ్రాహ్మణులను పిలిపించి కరువు తొలగిపోయే ఉపాయం చెప్పమన్నాడు.
“మహారాజా విభండక మునికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉన్నాడు. అతను ఉండే చోట కరువు ఉండదు ఎలాగైనా అతనిని అంగదేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్లి చేసి అంగదేశంలోనే ఉంచుకున్నట్లయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది” అని బ్రాహ్మణులు చెప్పారు. అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి మంత్రులను పిలిచి” మీరు వెళ్లి ఋష్యశృంగ మహాముని ని ఇక్కడికి తీసుకు రండి” అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని పురోహితుడు మంత్రులు భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను తన తపస్సు మాని ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాడు ఆగ్రహించి శపించినా శపించ గలడు అతని రప్పించాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి. ఆ ఉపాయాన్ని రోమపాదుడు కి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు.
“మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుంచి అరణ్యం లోనే ఉండి వేదాధ్యయనం లోనూ తపశ్చర్య లోనూ జీవితం గడిపిన వాడు. అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు మనం కొంత మంది వేశ్యలను అలంకరించి పూలు పెట్టి, సుగంధాలు వెదజల్లే లాగా తయారు చేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగుణ్ని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు” రోమపాదుడు అందుకు సమ్మతించి కొందరు వేశ్యలను చక్కగా అలంకరింపజేసి ఋష్యశృంగుని ఆశ్రమానికి పంపాడు. వారు ఆశ్రమం వెలుపల ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి ఉన్నారు.
ఋష్యశృంగుడు ఎప్పుడు తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళే వాడు కాడు. అలాంటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటి వచ్చాడు వెంటనే వేశ్యలు పాటలు పాడుతూ అతనిని సమీపించారు. వారి అందమైన ఆకారాలు, అలంకరణలు, పాటలు, శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షింపబడతాడు కానీ వారు స్త్రీలని కూడా అతనికి తెలియదు. వేశ్యలు అతన్ని సమీపించి “ఓ బ్రాహ్మణుడా నీవు ఎవరు ఎందుకు ఈ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నారు?” అని అడిగారు.
“నేను విభాండక మహాముని కొడుకును. అదే మా ఆశ్రమం. మీరు మా ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విద్యుక్తంగా పూజ చేస్తాను అన్నాడు” వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్లి, అతనిచ్చిన కందమూలాలు ఫలాలూ తిన్నారు. అక్కడ ఎక్కువసేపు ఉంటే విభాండకుడు శపిస్తాడు అని భయపడి వేశ్యలు వెళ్ళిపోతూ తమ వెంట తెచ్చిన భక్షాలు ఇచ్చి”ఇవి మా పళ్ళు వీటిని కూడా రుచి చూడు ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి” అంటూ ఋష్యశృంగుని ఆలింగనం చేసుకుని ఆశ్రమం దాటి వెళ్లి పోయారు.
ఋష్యశృంగుడు వారు పెట్టిన పక్షాలు తిని అవి ఫలాలే అనుకున్నాడు అయితే అవి తాను తినే పళ్ళ కంటే చాలా రుచిగా ఉన్నాయి. అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలు కంటే చాలా అందంగా ఉన్నారు. అతను వారిని మరవలేక ఆ రోజు అంతా వికలమైన మనసుతో గడిపాడు. వారు కనిపించవచ్చునన్న ఆశతో, కిందటి రోజు వారు కనిపించిన చోటికి వెళ్లాడు. అతన్ని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరింది అనుకున్నారు. అతనితో “అయ్యా నీవు కూడా మా ఆశ్రమానికి రా అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము” అన్నారు.
ఋష్యశృంగుడు అందుకు పరమానందంతో సమ్మతించి, ఆశ్రమం విడిచి వారి వెంట బయలుదేరాడు. ఋష్యశృంగుడు వెంటనే అంగదేశానికి వర్షం కూడా వచ్చింది. రోమపాదుడు రుష్యశృంగుడికి ఎదురు వచ్చి సాష్టాంగ పడి అతనిని ఈ విధముగా రప్పించి నందుకు క్షమాపణ చెప్పుకుని, తన కూతురు అయిన శాంతను ఇచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. ఋష్యశృంగుడు శాంత తో కూడా సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగ దేశంలోనే వుండిపోయాడు.