పొట్టి పిచ్చిక కథ

అనగా అనగా ఒక ఊర్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టే వరకు, రెండు భమిడిలేళ్లు, రెండు వెండిలేళ్లు రాత్రిళ్లు వచ్చి తినివేయడం మొదలుపెట్టాయి. అవి తినిపోయాక, ఒకటీ అరా మిగిలితే మన పొట్టిపిచ్చిక వచ్చి సగం తినేసేది.

ఒకనాడు బ్రాహ్మడు పొలం చూసుకోడానికి వచ్చేసరికి, చేనంతా తినేసి ఉంది. ఒకటీ అరా మిగిలిన కంకులు పొట్టిపిచ్చిక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది, కోపం కూడా వచ్చింది. ఈ పిచ్చిక పని పట్టాలని నిర్ణయించి, బోయవాడి దగ్గరికి వెళ్లి వల అడ్డుకుని తెచ్చి ఉచ్చు వేసాడు.

పాపం పొట్టిపిచ్చిక, అర్థం కాకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం! బ్రాహ్మడు ఎగిరి గంతేసి, దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. మన పొట్టిపిచ్చిక ఊరుకుంటుందా? చంకలో కూచునే పాట ఎత్తుకుంది:

“కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ! కంచమంత జొన్న చేను గూ, గూ, గూ! రెండు భమిడిలేళ్లు గూ, గూ, గూ! రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ! చేను కాస్త మేశాయి గూ, గూ, గూ! నేను కూడా తినబోతే గూ, గూ, గూ! పొట్టివాడు వచ్చాడు గూ, గూ, గూ! పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ! నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ!”

ఈ పాట వింటూ ఉండగా బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించి పట్టుకున్నాడు. అయినా మన పొట్టిపిచ్చిక నోరు మూయలేదు. బ్రాహ్మడు ఏం చేయాలి? ఊర్లోకి తీసుకెళ్లితే, దీనిపాట విని అంతా నవ్వుతారు! అందుకే ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగుమీద కూర్చున్నాడు.

మన పొట్టిపిచ్చిక నోరు మూయకపోవడంతో పాట కొనసాగించింది: “కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ! కంచమంత జొన్న చేను గూ, గూ, గూ!” దీని పాట విని శెట్టి బయటకు వచ్చి, “ఏమండీ శాస్త్రుల్లుగారు, మీ జొన్న చేను ఎంతండీ?” అని అడిగాడు.

బ్రాహ్మడు దోసిలితో చూపి, “ఇంత!” అన్నాడు. “ఇంతేనా?” అని అడిగాడు శెట్టి. “కాదు,” అని బ్రాహ్మడు రెండు అరిచేతుల్ని కాస్త ఎడంగా తీసి, “ఇంత!” అన్నాడు.

“ఓసి, ఇంతేనా!” అన్నాడు శెట్టి. బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతుల్ని బారగా చాపి, “ఇంతా!” అని చెప్పాడు. ఇంకేం! చేయి తీసేసరికి మన పొట్టిపిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుపై కూర్చుంది, “కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!” అని పాడటం మొదలుపెట్టింది.

బ్రాహ్మడు మోసపోయినట్లుగా భావించి, తనను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *