సోమరిపోతు

అనగా అనగా ఒక ఊర్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు గడ్డిపోచ కూడా తీసి అటువేసేవాడు కాదు. తిండి తినటానికి అయితే ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా తినేవాడు, కానీ దాన్ని కూడా వాడి దగ్గరికి తీసుకువచ్చి అందించాలి.

ఆ ఊరిలో మిగతా వాళ్లకు రాత్రింబగళ్లు చెమటతోడి పనిచేసినా కడుపు నిండీ ఉండేది కాదు. వాళ్లు ఎన్నాళ్లూ వేగుతారు, ఈ సోమరిపోతుతో ఉండటం? అందుకే, ఊరివాళ్లు వాడిని తన్ని తరిమేశారు.

ఆ పక్క గ్రామంలోనే ఇంకొక కష్టజీవి ఉండేవాడు. వాడు వొళ్ళు దాచుకోకుండా రోజంతా శ్రమపడేవాడు. అయినా, వాడికి తిండికి అంతస్థంగా మాత్రమే వచ్చేది. ఆ గ్రామంలో మిగతా వాళ్లు అంతా సోమరిపోతులు. వొళ్ళు వంచి పనిచేసే వాళ్లు కాదు, దొంగతనాలు చేసి ముప్పొద్దులా తినేవాళ్లు. అలాంటివాళ్లు కష్టపడే వాడిని చూడగానే, వాడిని తన్నిపారేసి ఆ గ్రామం నుంచి వెళ్లగొట్టారు.

ఇక మన సోమరిపోతుకు వూరికే తిండి దొరికే మరో వూరు కావాలి. దానికోసం వెతుకుతూ బయలుదేరి, కొంత దూరం వెళ్లాక బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి, ఏ గ్రామంలో పనిదొరుకుతుందో, చేసిన పనికి మెప్పు ఉంటుందో అని ఆశతో బయలుదేరాడు. వాడు దారిలో నడుస్తూ ఉండగా మన సోమరిపోతును చెట్టు కింద పడుకుని ఉన్నట్టు చూసి దగ్గరకు వెళ్లాడు.

అప్పటికే తూర్పు వైపు తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. కష్టజీవి సోమరిపోతును పలకరించి, ఇద్దరూ తమ తమ కష్టాలు, సుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి వైపు ఏదో ధగధగ మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాతితో కట్టారు, దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరూ ఆ వైపు చూసారు. అది ఒక దివ్యమైన భవనం, బాలసూర్యుని కిరణాలు దానిమీద పడి బంగారం లాగా మెరిసిపోతున్నాయి.

దక్షిణ వైపున, కోటిచంద్రుల కాంతితో ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడటానికి వెయ్యి కళ్లు కూడా చాలవు. ఆమె వొంటి నిండా నగలు మెరుస్తున్నాయి. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు.

ఆ దేవత ఇంకెవరో కాదు; లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూచి, “ఓ బాటసారులారా? నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు ప్రొద్దుకు కేలోపల ఇంటికి చేరితే, మీరు బ్రతికేంతకాలం నా అతిథులుగా ఉండి, భోగభాగ్యాలతో తులతూగవచ్చు” అని చెప్పి అంతర్ధానమయింది.

కష్టజీవికి ప్రాణం లేచివచ్చింది. ఇన్నాళ్లూ కష్టపడితే పొట్ట నిండలేదు. ఒక రోజు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు అనుకున్నాడు. సోమరిపోతుతో, “విన్నావా తమ్ముడూ! మనం సాయంత్రం లోపల ఎలా అయినా వెళ్లి ఆ ఇంట్లోకి చేరితే ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. పద, త్వరగా పోదాం” అన్నాడు.

సోమరిపోతు, “అబ్బో! అట్లా కనిపిస్తోంది కానీ, అది దగ్గర ఉందని అనుకుంటావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే, మనం పరిగెత్తలేక చస్తాం. వృథా ప్రయత్నం ఎందుకు? పరిగెత్తి పాలుత్రాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగటం మంచిది” అన్నాడు. సోమరిపోతు కూర్చునిపోతే లాభంలేదని కష్టజీవి ఒంటరిగా భవనం వైపు నడవసాగాడు.

సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. “ఇంత దూరం ఎలా నడుస్తాడు? ఇలాంటి సమయంలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండేది!” అని అనుకున్నాడు. కానీ అక్కడి నుంచే కదలలేదు. పదిగంటలైంది, ఇంతలో వాడికి ఒక బక్కచిక్కిన గాడిద కనిపించింది. దానిని ఎక్కి సవారీ మొదలుపెట్టాడు. గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతు కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెకిలిగా నవ్వి, గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. గాడిద కొంతదూరం నురుగులు కక్కుకుంటూ రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది.

సరే, గాడిద ఎలా నో చచ్చింది, కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తలకింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. “ఊరుకోడం ఎందుకు? దాన్ని ఎక్కి పోదాం” అని అనుకున్నాడు. తాబేలను ఎక్కి మెల్లిగా వాకిటికి చేరుకునే సమయానికి తలుపులు మూసుకుంటున్నాయి.

తలుపులు తెరవమని సోమరిపోతు ధబధబా కొట్టాడు. కానీ ఉహు, తలుపులు తెరచేలా లేవు. “ఛా, అనవసరంగా ఎంత శ్రమ పడ్డాను! సరే, ఇంక ఏమి చేయగలం, ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం” అని వాకిలి మెట్టుపై తలపెట్టి పడుకున్నాడు.

తెల్లవారినప్పుడు చూస్తే, సోమరిపోతు పడుకుని ఉన్న చోట ఒక నత్త ఉంది. అదే మన సోమరిపోతు బాటసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *