కైకేయి దశరధుడిని రెండు వరాలు కోరుట

దశరధుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో, కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి, “కైకేయి ఎక్కడ ఉన్నావు” అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతపురం ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి ద్వారపాలికను “కైకేయీ ఎక్కడ” అని అడిగాడు.

ద్వారపాలిక భయంతో చేతులు జోడించి “ప్రభూ వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది.”

దశరధుడు కలవర పడుతూ కోపగృహానికి వెళ్ళి అక్కడ నేలపై పడి ఉన్న కైకేయిని చూశాడు. లక్ష వరహాల విలువ చేసే ముత్యాల హారాలు,ఇతర ఆభరణాలు నేలపై చెల్లా చెదరుగా పడి ఉండి, ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తున్నాయి. దశరధుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ “దేవి నీకెందుకు ఇలా కోపం వచ్చింది ఎవరి మీద, ఎవరన్నా నిన్ను తిట్టారా అవమానించారా ఒంట్లో సరిగా లేదా వైద్యులను పిలిపించినా, ఎందుకు ఏడుస్తావు ఊరుకో కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్లను దండిస్తాను నిర్దోషులైనా సరే. నీకోసం ఏ దరిద్రుడిని అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో పాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి నీ కోరిక ఏమిటో చెప్పు నా ప్రాణాలు వడ్డీ అయినా సరే ఆ కోరిక తీరుస్తాను లే కైకేయి లే” అన్నాడు.

దశరధుడు కైకేయని బ్రతిమలాడుట

ఈ మాటలు విని కైకేయి “నాకు ఎవరు అపకారం చేయలేదు, అవమానము చేయలేదు. నాకొక కోరిక ఉన్నది, దానిని మీరు తీరుస్తారని ప్రమాణం చేసేటట్లయితే చెబుతాను అన్నది”

దశరధుడు ఆమాటలకు చిరునవ్వు నవ్వి  కైకేయి జుట్టు చేతితో  నిమురుతూ తన ప్రాణంతో సమానమై రాముడిపైన ఒట్టు పెట్టుకొని ఆమె కోరిక తీర్చడానికి ప్రమాణం చేశాడు.

అప్పుడు కైకేయి దశరధుడికి శంబరాసురుడితో జరిగిన యుద్ధాన్నీ ముర్చితుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్నీ, ఆ సమయంలో ఆయన రెండు వరాలు ఇస్తాను కోరమంటే తాను తర్వాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది. తర్వాత ఆ వరాలు రెండు బయట పెట్టింది.రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చేయాలి, రాముడు నార బట్టలను కృష్ణాజినాన్నీ జడలను ముని వేషాన్ని ధరించి పధ్నాలుగేళ్ళు దండకారణ్యంలో నివసించాలి.

ఈ మాటలు వింటుంటే  దశరధుడికేదో భయంపుట్టుకొచ్చింది స్పృహ తప్పినట్టు అయింది. కాళ్లు చేతులు వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు.

“నీవు రాజ కుమార్తెవి అనుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ నీవు విషము కక్కే పామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు కదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు నేను నీకేం ద్రోహం చేశాను ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను. నా ప్రాణాలైనా వదలగలను కానీ రాముణ్ణి చూడకుండా బతకలేనే. ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకో నీ కాళ్లు నెత్తిన పెట్టుకుంటాను, నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చేయడానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో ఎన్నో వంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటే భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధ పెట్టావు చూడు నేను ముసలివాడిని కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకోకాని రాముడిపై ఆగ్రహించకు నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను.” అని కైకేయిని దశరధుడు ఎంతోసేపు వేడుకున్నాడు.

దశరధుడు ఇలా దిగజారిపోతున్న కొద్ది కైకేయి ఆగ్రహం రెచ్చింది. మొదట వరాలు ఇస్తానని ఇప్పుడు కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి దశరధుడు బేలగా మాట్లాడడం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉపసంహరించుకోనని, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపోతానని అన్నది.

కైకేయి దశరధుడిని రెండు వరాలు కోరుట

దశరధుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు. ఎటువంటి విషమ పరిస్థితి. “నాయనా అడవికి పోరా!” అని రాముడితో ఎలా చెప్పడం. కైకేయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే, ఇతర రాజులంతా పట్టాభిషేకం చాలా బాగా చేశారే అని యద్దేవా చెయ్యరూ.కౌసల్య ముఖం ఎలా చూడడం ఆయన తనలో తాను దుఃఖించాడు. మధ్యమధ్య  మూర్చ పోయాడు ఆ రాత్రి ఆయనకు కాలరాత్రి లాగా గడిచి తెల్లవారింది.

వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరకు వచ్చి దశరధుడి అంతఃపురం వాకిలి దగ్గర సుమంత్రుడెదురు కాగా తాను వచ్చిన సంగతి రాజుగారికిచెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రాజుగారు కదిలి రావటమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్ధుడు కావటం చేత రాజుగారికి బాల్య మిత్రుడు గనక ఆయనను ఎవరు అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్లి రాజుగారి పరిస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడనుకుని “మహారాజా లేవండి. సూర్యోదయం కూడా అయింది.రామ పట్టాభిషేకం జరిపించడానికి అందరూ తమ రాక కోసం చాలా సేపుగా ఎదురుచూస్తున్నారు” అని చెప్పాడు.

దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి “ఏమోయ్ నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖ పెడతావు.” అన్నాడు. దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చేతులు జోడించి రెండడుగులు వెనక్కి వేశాడు. దశరధుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలో లేనందున కైకేయి “సుమంత్రుడా మహారాజుకు రామ పట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రలేదు ఇప్పుడే కాస్త కునుకు పట్టింది.” నీవు వెళ్లి రాముణ్ణి పిలుచుకురా ఇదే రాజు గారి ఆజ్ఞ అనుకో అన్నది.

“రాముడు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కాబోలు” అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు నగరమంతా ఉత్సవం లాగా కోలాహాలంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది సంబరాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాజులందరూ కానుకలు తెచ్చారు వారు తమలో తాము రాజుగారు కనిపించారు, మనం వచ్చిన సంగతి వారికెలా తెలియడం అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, “తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియజేస్తాను వారి దగ్గరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను” అని చెప్పాడు.

ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరధుడి అంతఃపురానికి వెళ్లి దశరథుడు పడుకొని ఉన్న చోటికి చేరి “దశరథ మహారాజా విజయిభవ రాత్రి గడిచి, తెల్లవారి, సూర్యోదయం కూడా అయింది. మీకోసం బ్రాహ్మణులు సేనాపతులు పట్టణంలోని పెద్దలు ఎదురుచూస్తున్నారు, నిద్ర మేలుకొని జరగవలసిన కర్మకాండ జరిపించండి” అన్నాడు.

“రాముణ్ణి తీసుకురమ్మని కైకేయి నీతో చెప్పెనే తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నేను నిద్రపోవడం లేదు, మేలుకొనే ఉన్నాను వేగిరం రాముణ్ణి తీసుకురా” అన్నాడు దశరథుడు.

సుమంత్రుడు చిత్తమని చెప్పి రాజుకు నమస్కారం చేసి ఏదో గొప్ప ఏర్పాటు జరగబోతున్నది. అని తనలో తాను సంతోష పడుతూ రాజవీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరకు రథం తోలుకొని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు.రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులు, గుర్రాలు,సైనికులు, మంత్రులు కిటకిటలాడుతున్నారు. సుమంత్రుడు వారి అందరిని తోసుకుంటూ వెళ్లి రాముడుండే ఏడంతస్తుల మేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు.

రాముడు చక్కగా అలంకరించుకొని బంగారు చెక్కిపై కూర్చుని ఉన్నాడు.సీతపక్కనే నిలబడి వింజామరవీస్తున్నది. సుమంత్రుడు అతని సమీపించి నమస్కరించి “తండ్రి గారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు నిన్ను చూడాలంటున్నారు.” అని చెప్పాడు ఈ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు. అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నిటితోను సుమంత్రుడివెంట బయలుదేరాడు. అతను పులితోలు పరిచిన రథం ఎక్కి కూర్చోగానే లక్ష్మణుడు కూడా వెనకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి చత్రం పట్టి రెండవ చేత్తో చామరం వీచాడు. వెనుకగా గుర్రాలు ఏనుగులు ఎక్కిన రౌతులూ కోలాహలంగా వేలకొద్దీ జనం నడిచారు.

Leave a Reply