దశరధుడు శ్రీరాముని పట్టాభిషేకానికి నిర్ణయించుట
భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకు పోయాడు. శత్రుఘ్నుడు వెంటలేనిదే ఎన్ని భోగాలూ ఉన్న తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ లేకుండానే జరుగు తున్నది. అయితే ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడూ వారిని బాధించేది. అయోధ్యలో దశరథ మహారాజుకూడా తన కొడుకులలో ఇద్దరుకు దూరమై పోయానే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలు రాముడే, అతనిలో లేని ‘సద్గుణం లేదు., ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం.
“నేను ముసలివాణ్ణి అయిపోయినాను, రాముణ్ణి రాజును చేసి అతను రాజ్యపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది.” అనుకున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను ఆమోదించారు. ఇందుకు ప్రజలు , ఇతర రాజులు ఏమంటారో తెలుసుకోవలసి ఉన్నది. అందుచేత దశరథుడు రాజులందరికి ఆహ్వానాలు పంపాడు. చాలా దూరాన ఉన్న కారణంచేత కైకేయి తండ్రి అయిన, కేకయ మహారాజుకూ, సీత తండ్రి అయిన జనక మహారాజుకూ ఆహ్వా నాలు పంపక, ఈ శుభవార్త వారికి పట్టాభిషేకం అయిన తరవాత తెలుపుదామసుకున్నాడు.
ఆహ్వానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కొలువు కూటంలో ఉచితాసనాల పై కూచున్నారు. నగరంలోని పౌరులు, పల్లెటూళ్లవాళ్లూ కూడా సభకు వచ్చారు. దశరధుడు వారితో తాను ఎంత శ్రద్ధగా రాజ్యం చేసినది వివరించి, “ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను, మీ అందరూ సమ్మతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది. రాముడు పరాక్రమశాలి, ఎందులోనూ నాకు తీసిపోడు. అతను మూడులోకాలూ ఏలదగినవాడు. అతనికి పట్టంగట్టటం రాజ్యానికి గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి.” అన్నాడు.
ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది. రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. “మహారాజా, ఆ రామపట్టాభిషేక మహోత్సవం ఊరేగింపు త్వరగా మా కళ్ల పడెయ్యండి.” అన్నారు. వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, “నేనింకా రామపట్టాభిషేకం అని అనకుండానే మీరంతా సమ్మతిస్తున్నారా? ఏమిటి కారణం? నా పరిపాలన మీకు నచ్చలేదా ? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీకు రాముణ్ణి రాజుగా కోరటానికి కారణమేమిటి? మరేమీ లేదు, తెలుసుకోగోరి అడుగుతున్నాను !” అన్నాడు. ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలిసినది జరిగింది. సభకులు రాముణ్ణి తెగపొగడేశారు. అతన్ని రాజుగా చేస్తే ఇక అంతకంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, “మీరు కూడా నా లాగే భావిస్తున్నందుకు నా కెంతో సంతోషంగా ఉంది,” అంటూ అప్పుడే తన పురోహితులైన వసిష్ఠ వామదేవాదులను పిలిపించి, ” మహామునులారా, ఈ చైత్ర మాసం శుభకార్యాలు చేయదగినది. అందు చేత రామపట్టాభిషేక యత్నాలు సాగించండి, అందుకు కావలిసిన సామగ్రి అంతా తెప్పించండి.” అని అందరూ వింటూండగా అన్నాడు.
వసిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్ళతో ఎఏ సామగ్రి సిద్ధం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహోత్సవానికి కావలిసిన సరంజామా అంతా సిద్ధమయింది. దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకు రమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళి రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో, “నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో” అని చెప్పి అతన్ని పంపేశాడు.తరవాత దూరదేశాల నుంచి వచ్చిన రాజులు, ప్రజలు ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలు బహూకరించింది.
అందరూ వెళ్లాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి “రేపు పుష్యమి నక్షత్రం, పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది అందుచేత రేపు జరుపుదాం,” అని నిశ్చయించి, రాముని తీసుకు రమ్మని సారధిని సుమంత్రుడిని పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పగానే రాముడు, “నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్లీ ఎందుకు రమ్మన్నారు.?” అని అడిగాడు. “మహారాజుగారు తమరిని చూడాలన్నారు, వస్తే రండి, లేకపోతే మానండి. అది మీయిష్టం.” అన్నాడు. సారధి.
రాముడు తత్తరపడి సారధి వెంట బయలుదేరాడు. పైవాళ్ళెవరు లేరు గనక దశరధుడు ఈసారి తన కాళ్లకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకుని ఉన్నతాసనంపై కూర్చోబెట్టి నాయనా రామ నేను ముసలివాడిని కావటం అలా ఉంచి నా జన్మ నక్షత్రంలో దుష్ట గ్రహాలు చేరాయని జ్యోతిష్యులు చెబుతున్నారు, పీడకలలు వస్తున్నాయి.కనుక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో.ఇవాళ పుష్యమి, రేపు పునర్వసు శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవు నీ భార్య దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగి రాకపూర్వమే ఈ పట్టాభిషేకం ముగించడం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తి గల వాడే ఈ పట్టాభిషేకానికి ఎదురు చెప్పకూడదు, అయినా మానవ స్వభావం అమిత చంచలమైనది అని చెప్పాడు.
రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయినా కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మి ప్రార్థిస్తూ కనిపించింది. రాముడు రాకపూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్ష్మణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి అమ్మ రేపటి పట్టాభిషేకానికి నేను సీత ఏమేమి అలంకారాలు చేసుకోవాలో అవన్నీ చేయించు అని కోరాడు. రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ నాతో పాటు నీవు కూడా ఈ భూమిని అంత బాలింతవు గాని మనమిద్దరం ఒకటే కదా నేను రాజు అయితే నీవు రాజువే, మనమిద్దరం సమస్త సుఖాలు ఒక్కటిగా అనుభవించుదాం అన్నాడు. తర్వాత అతను తల్లుల అనుమతి పొంది సీతతో సహా తన మందిరానికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి చేతను సీత చేతను ఉపవాస వ్రతం సక్రమంగా చేయించడానికి దశరధుడి కోరికపై వశిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరకు వెళ్లి ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చే సమయంలో వీధులన్నిట జనం తండోపతండాలుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోషద్వానాలు చేస్తున్నారు. వీధులలో నీళ్ళు చల్లి పూలదండలు కట్టారు ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతున్నది స్త్రీలు, పిల్లలు వృద్దులు ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తున్నారు. వశిష్ఠుడు వెళ్లిపోయాక రాముడు స్నానం చేసి సీతతో కూడా హోమం చేసి హోమశేషం తిని నిచ్చలమైన మనస్సుతో నారాయణ ఆలయంలో భగవంతుని ధ్యానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాము సేపు నిద్రపోయి వందిమాగదుల మేల్కొలుపులకు లేచాడు.