అగస్త్యుడు రాముడితో రావణవంశం గురించి చెప్పుట
శ్రీరాముడు రాక్షస సంహారం చేసి, ఆయోధ్యకు తిరిగి వచ్చి, రాజ్యాభిషిక్తుడై, రాజ్య పాలన చేస్తూ ఉండగా, ఒకనాడాయన ఇంటికి నాలుగు దిక్కుల నుంచి అనేక మంది మునులు అగస్త్యుడు మొదలుగా గల వారు వచ్చి ద్వారపాలకుడి ద్వారా తాము రాముడి దర్శనానికి వచ్చినట్టు కబురు చేశారు. వెంటనే రాముడు వారిని లోపలికి రప్పించి, అర్ఘ్యపాద్యాలతో సత్కరించి, ఉచితాసనాల పైన ఆసీలను చేసి, కుశలమడిగాడు.
మునులు రాముణ్ణి మళ్ళీ రాజుగా చూడ గలిగినందుకు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు; రాముడు రావణుణ్ణి చంపటం ఒక లెక్కలోదికాదనీ, రాముడి చేతి లోచచ్చిన రాక్షస వీరులందరూ గొప్పవాళ్ళే అయినప్పటికీ ఇంద్రజిత్తు వంటి అజేయుణ్ణి’ లక్ష్మణుడి చేత చంపించటం అత్యాశ్చర్యకరమైన విషయమని వారన్నారు..
వారి మాటలు విని రాముడికి చాలా ఆశ్చర్యం కలిగింది. రావణ, కుంభకర్ణ, మహోదర, ప్రహస్త, దేవాంతక నరాంతకుల వంటి రాక్షస వీరుల కన్న ఇంద్రజిత్తు పరాక్రమవంతుడని విని, అతను ఇంద్రజిత్తు ప్రభావ పరాక్రమాలను గురించి వినగోరాడు. అప్పుడగస్త్యుడు రాముడితో రావణవంశం గురించి ఈ విధంగా చెప్ప నారంభించాడు.
కృత యుగంలో బ్రహ్మమానస పుత్రుడూ, రెండో బ్రహ్మ అనదగిన వాడూ అయిన పులస్త్యుడు ఒకప్పుడు తపస్సు చేసుకుందామని, మేరుపర్వత ప్రాంతంలో ఉన్న తృణబిందుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేటప్పుడు, దేవ నాగ రాజర్షి కన్యలు రోజూ వచ్చి, ఆటలాడి గోల చేస్తూ, ఆయన తపస్సుకు విఘ్నం కలిగించసాగారు. పులస్త్యుడు తన ఎదటికి వచ్చిన స్త్రీ గర్భవతి అవుతుందని శాపం పెట్టాడు. ఈ శాపం విని కన్యలంతా భయపడి ఆ ఆశ్రమానికి వెళ్ళటం మానుకున్నారు.
ఈ సంగతి తృణబిందుడి కుమార్తె ఎరగధు. ఆమె మామూలుగా పులస్త్యుడి ఆశ్రమానికి వచ్చి, తన స్నేహితురాళ్ళ కోసం వెతకసాగింది. ఒక్కరు కూడా ఆమెకు కనిపెంచలేదు. ఆమె తిన్నగా పులస్త్యుడు వేదాధ్యయనం చేస్తున్న చోటికి వెళ్ళింది. ఆయన దర్శనం కలగగానే ఆమెలో గర్భ చిహ్నాలు కలిగాయి, శరీరమంతా పాలిపోయింది. ఆమె తనలో కలిగిన మార్పు చూసుకుని ఆశ్చర్యపోతూ, తన తండ్రి ఆశ్రమానికి తిరిగి వెళ్ళి, “నాన్నా నా ఒళ్ళంతా ఎలా మారిందో చూడు. నా స్నేహితురాళ్ళ కోసం పులస్త్యాశ్రమానికి వెళ్ళే సరికి ఇలా జరిగింది. కారణం తెలీదు. నాకేమో భయంగా ఉంది,” అన్నది.
తృణబిందుడు పులస్త్యుడి శాపఫలితంగా తన కుమార్తె గర్భవతి అయిందని గ్రహించి, ఆమెను తీసుకుని పులస్త్యుడి వద్దకు వెళ్ళి, ” మహానుభావా, ఇది నా కూతురు. గుణవంతురాలు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దీన్ని భార్యగా స్వీకరించి, దీనిద్వారా సేవలు పొందండి,” అన్నాడు. పులస్త్యుడు సరేనన్నాడు.
తన భార్య గుణాలూ, నడవడి పులస్త్యుడికి సంతోషం కలిగించాయి. ఆయన ఆమెతో, “నీవు చాలా యోగ్యురాలవు. నీ గర్భాన నా అంతటి కొడుకు కలుగుతాడు.
నేను చేసే వేదపఠనం వింటూండగా గర్భవతవయావు గనక నీ కొడుకు విశ్రవసుడనే పేరు తెచ్చుకుంటాడు. నా కొడుకు గనుక పౌలస్త్యుడని అందరిచేతా చెప్పబడతాడు,” అన్నాడు.
అలాగే కొంత కాలానికి ఆమె గర్భాన విశ్రవసుడు పుట్టి, సత్య శీల శౌచ శాంతాలకు ప్రసిద్ధి పొందాడు. అతన్ని గురించి గొప్పగా విని భరద్వాజ మహాముని తన కూతురైన దేవవర్ణిని తీసుకు వచ్చి అతనికి పెళ్ళి చేశాడు. విశ్రవసుడామెతో గృహస్థాశ్రమం గడుపుతూ ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు పుట్టగానే బ్రహ్మ స్వయంగా వచ్చి, ఆ కుర్రవాడు ధనాధిపతి అవుతాడని చెప్పి, అతనికి వైశ్రవణుడని పేరు పెట్టి వెళ్ళిపోయాడు.
వైశ్రవణుడికి చిన్నతనం నుంచీ తపస్సే అతి ముఖ్య మనిపించింది. అతను మహారణ్యానికి వెళ్ళి, జలభక్షణా, వాయుభక్షణా నిరహారదీక్షా అవలంబించి, మూడు వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇంద్రాది దేవతలతో సహా ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సుకు సంతోషించాను. వరం కోరుకో,” అన్నాడు.
“తాతా, నాకు లోక పాలకత్వమూ, ధనాధిపత్యమూ కావాలి,” అన్నాడు. వైశ్రవణుడు.
“నేను కూడా మరొక లోకపాలకుణ్ణి సృష్టించే ఆలోచన లోనే ఉన్నాను. ఇంద్ర యమవరుణులతో బాటు నీవు కూడా నాలుగో లోకపాలకుడివిగా ఉండి నిధుల కథపతివి కా! ఇదిగో, సూర్య ప్రకాశంతో వెలిగే పుష్పకమనే విమానం. దీన్ని ఎక్కి. తిరుగుతూ, దేవతలతో సమానుడవై ఉండు,” అని చెప్పి, బ్రహ్మ వెళ్లిపోయాడు.
ఇలా బ్రహ్మ వల్ల కోరిన వరాలు పొంది వైశ్రవణుడు తన తండ్రి ఆశ్రమానికి వచ్చి,”నాన్నా, బ్రహ్మ నాకు వరాలయితే ఇచ్చాడు గాని, నేను నివాసం కల్పించు కోవటానికి చోటు చూపలేదు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా నేనుండదగిన చోటుంటే చూడు,” అన్నాడు.
కొడుకు చెప్పిన మాట విని విశ్రవుడు చాలా సంతోషించి, “నాయనా, దక్షిణ సముద్రతీరాన త్రికూటపర్వత శిఖరాన విశ్వకర్మ దేవేంద్రుడి అమరావతిని పోలిన నగరాన్ని, లంక అనే దాన్ని నిర్మించాడు.చాలా అందమైన పట్టణం. అది సువర్ణ ప్రాకారాలూ, పరిఖలూ కలది, వైడూర్య తోరణాలతో కూడుకున్నది. అది మొదట రాక్షసుల కోసమే నిర్మించబడింది, కాని విష్ణుమూర్తికి భయపడి రాక్షసులా పట్టణాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పుడది శూన్యంగా ఉన్నది. దానికి రాజు లేడు. అక్కడ నీ నివాసం ఏర్పాటు చేసుకున్నావంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు,”అని చెప్పాడు.
వైశ్రవణుడు తండ్రి సలహా ప్రకారం అనేక వేల మంది నైరృతులతో సహా లంకా నగరానికి వెళ్ళి, అక్కడ నివాసం” ఏర్పాటుచేసుకుని, సుఖంగా రాజ్యం ఏలుతూ, పుష్పకవిమానంలో అప్పుడప్పుడూ వచ్చి తన తల్లిదండ్రులను చూసి పోతూండేవాడు.
ఇదంతా విని రాముడు ఆశ్చర్యంతో అగస్త్యుడి కేసి చూసి, “మహాత్మా, రాక్షనులు పులస్త్య వంశంలోనే పుట్టారని విన్నాను. కాని అంతకు ముందు కూడా రాక్షసులుండినట్టు మీరు చెబుతున్నారు. ఈ రాక్షసులకు మూల పురుషుడెవరు?” అన్నాడు. దానికి అగస్త్యుడిలా చెప్పాడు.
కమలంలో పుట్టిన బ్రహ్మ నీటిని సృష్టించి, దాన్ని కాపాడటానికి కొందరు ప్రాణులను సృష్టించాడు. ఆ ప్రాణులు ఆకలి దప్పులతోనూ, భయంతోనూ అలమటించుతూ, “మే మేం చెయ్యాలి ?” అని బ్రహ్మ నడిగారు. బ్రహ్మ నవ్వుల కన్నట్టుగా,”ఈ జలాన్ని కాపాడటానికి ప్రయత్నించండి,” అన్నాడు. కొందరు ప్రాణులు రక్షిస్తామన్నారు, మరికొందరు జక్షిస్తామన్నారు. (జక్షించట మంటే భక్షించటం.) రక్షిస్తామన్న ప్రాణులు రాక్షసులయారు. జక్షిస్తామన్న వారు యక్షులయారు.
రాక్షసులలో హేతీ, ప్రహేతీ అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిలో ప్రహేతి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. హేతి అనేవాడు మాత్రం పెళ్ళి చేసుకోగోరి, భార్య కోసం వెతుకుతూ, చివరకు యముడి చెల్లెలు భయ అనే భయంకరమైన దాన్ని పెళ్ళాడాడు.
వారికి విద్యుత్కేశుడనే కొడుకు, సూర్యసమ కాంతి గలవాడు పుట్టి పెరగసాగాడు. వాడికి యౌవనం రాగానే వాడి తండ్రి అయిన హేతి వాడికొక భార్యను నిశ్చయించాడు. ఆ పిల్ల సంధ్య అనేదాని కూతురు. దాని పేరు సాలకటంకట. సాలకటంకట విద్యుత్కేశుణ్ణి పెళ్ళాడి, భర్తతో సుఖంగా విహారాలు చేస్తూ, గర్భవతి అయి, మందర పర్వత ప్రాంతంలో ఒక కొడుకును కన్నది. అయితే ఆమెకా కొడుకు పైన కన్న భర్తతో విహరించటం మీదనే ఆసక్తి ఎక్కువైన కారణం చేత, కొడుకును కన్న చోటనే పారేసి భర్తతో విహరించబోయింది.
బిడ్డ నోట్లో చెయ్యి దూర్చుకుని సన్నగా ఏడవ సాగాడు. ఆ సమయంలో వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన పోతూ ఆ పసిగుడ్డు ఏడుపు విన్నారు. ఆ దంపతులు ఆ శిశువును చూసి జాలిపడి, దగ్గిరికి వచ్చి చూశారు. పార్వతి సంతృప్తి కోసం పరమేశ్వరుడా బిడ్డకు తల్లితో సమానమైన వయసూ, చిరంజీవిత్వమూ, ఆకాశంలో ఎగర గల ఒక పట్టణమూ ఇచ్చాడు. పార్వతీదేవి రాక్షసులకు సద్యోగర్భమూ, పుట్టగానే తల్లి వయసూ ఉండే లాగు వరమిచ్చింది.
పార్వతీ పరమేశ్వరుల వల్ల వరాలు పొందిన సుకేశుడనే ఆ రాక్షసుడు ఐశ్వర్యవంతుడై, ఆకాశగమనం గల పట్టణంలో విహరిస్తూ ఇంద్రుడికి సమానుడయాడు. సుకేశుడు వరాలను పొందటమే గాక ధర్మాత్ముడని కూడా విని, గ్రామణి అనే గంధర్వుడు త్రిలోకసుందరి అయిన తన కుమార్తెను దేవవతి అనే దాన్ని తెచ్చి సుకేశుడికిచ్చి పెళ్ళి చేశాడు. తన కంతటి భర్త దొరికినందుకు దేవవతి ఎంతో సంతో షించింది.
ఆ దంపతులకు మాల్యవంతుడూ, సుమాలి, మాలీ అని ముగ్గురు కొడుకులు,మూడు అగ్నుల లాటి వారు కలిగారు. వారు మహా బలవంతులు, నిర్భయులు, భయంకరులు. తమ తండ్రి శివుడి వల్ల వరాలు పొందినట్టు తెలిసి, వారు మేరుపర్వతానికి వెళ్ళి, కఠోరమైన నియమాలతో అక్కడ తపస్సు సాగించారు. ఆ తపస్సుకు ముల్లోకాలూ అట్టుడికిపోయాయి. బ్రహ్మాదేవుడు ఇంద్రాది దేవతలను వెంట బెట్టుకుని విమానం మీద వచ్చి, “మీ తపస్సుకు మెచ్చాను. ఏం వరాలు కావాలో కోరుకోండి,” అన్నాడు.
“దేవా, నీకు మా పైన అనుగ్రహం కలిగిన పక్షంలో, మాకు ఎవరి చేతా ఓటమి కలగకుండానూ, మా చేతిలో శత్రువులంతా చచ్చేటట్టూ, మేము దీర్ఘాయుష్మంతులమై వర్థిల్లేటట్టూ వరమియ్యి,” అన్నారు వాళ్ళు. బ్రహ్మ వారి కలాగే వరమిచ్చాడు.
ఇటువంటి వరం పొంది ఆ ముగ్గురు రాక్షసులూ మూడు లోకాలనూ పీడించ సాగారు. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, సాధ్యులూ, చారణులూ మొదలైన వారికి జీవితం నరకమైపోయింది. వారిని కాపాడే నాధుడు లేడు.
ఆ రాక్షసులు విశ్వకర్మను పిలిపించి, “దేవతలందరికీ నీవే ఇళ్ళు కట్టావని విన్నాం. హిమాలయం మీద గాని, మేరు పర్వతం మీద గాని, మందరగిరి మీద గాని కైలాసానికి సరివచ్చేటటువంటి అందమైన పట్టణం మాకు కట్టి ఇయ్యి,” అని అడిగారు.
“దక్షిణ సముద్ర తీరాన త్రికూట మనీ, సువేల మనీ రెండు పర్వతాలున్నాయి. త్రికూట పర్వతం యొక్క నడిమి శిఖరం మీద ఇంద్రుడి కోరిక పైన లంకా పట్టణం కట్టి ఉంచాను. అది స్వర్గంతో సమాన మైనది. బంగారు ప్రాకారాలూ, బంగారు తోరణాలూ కలది. మీరు మీ రాక్షసులతో అక్కడ ఉన్నట్టయితే మిమ్మల్ని ఎవరూ తేరి చూడలేరు,” అని విశ్వకర్మ వారితో అన్నాడు.
విశ్వకర్మ చెప్పిన ఈ మాటలు విని ఆ రాక్షసులు చాలా సంతోషం చెంది, అనేక వేలమంది పరివారంతో సహా లంకకు చేరి ఆ నగరాన్ని చూసి పరమానంద భరితులయారు. ఇదే సమయంలో నర్మద అనే గంధర్వ స్త్రీ చక్కని చుక్కల్లాటి తన కూతుళ్ళను ముగ్గురినీ తెచ్చి ఆ ముగ్గురన్నదమ్ములకూ పెళ్ళి చేసింది.
పెద్దవాడైన మాల్యవంతుడి భార్య సుందరి. సుందరి గర్భాన వజ్రముష్టి, విరూపాక్షుడూ, దుర్ముఖుడూ, సుప్తఘ్నుడూ, యజ్ఞకోపుడూ, మత్తుడూ, ఉన్మత్తుడూ అనే ఏడుగురు కొడుకులూ, అనల అనే ఒక కూతురు కలిగారు.
సుమాలి భార్య కేతుమతి. సుమాలికి ఆ భార్య అంటే ప్రాణం కన్న ఎక్కువ. కేతుమతికి ప్రహస్తుడూ, అకంపనుడూ, వికటుడూ, కాలకార్ముకుడూ, ధూమ్రాక్షుడూ, దండుడూ, సుపార్శ్వుడూ, సంప్రది, ప్రఘసుడూ, భాసకర్ణుడూ, ‘అనే కొడుకులూ, పుష్పోత్కటా, కైకసీ, శుచిస్మితా, కుంభీనసీ అనే కుమార్తెలూ కలిగారు.
మాలి భార్య వసుధ అసాధారణ సుందరి. ఆమెకు అనిలుడూ, అనలుడూ, హరుడూ, సంపాతీ అనే నలుగురు కొడుకులు మాత్రమే కలిగారు. వీరు నలుగురూ విభీషణుడికి మంత్రులయారు.
ఈ విధంగా ఆ ముగ్గురు రాక్షసులూ తమ పిల్లలతోనూ, పరివారం తోనూ లంకలో నివసిస్తూ, ఇంద్రాది దేవతలనూ, ఋషులనూ, నాగులనూ, దానవులనూ బాధిస్తూ, మూడు లోకాలలోనూ తమను నిగ్రహించే వాడు లేక వీరవిహారం చేస్తూ, చావు భయం కూడా లేకుండా, యజ్ఞాలను ధ్వంసం చేస్తూ, వరం పొందిన గర్వంతో తిరగసాగారు.