వానరసేన లంకానగరాన్ని ముట్టడించుట

రావణుడు అశోకవనాన్ని చేరేసరికి, సీత దుఃఖంతో రాముణ్ణి గురించి ఆలోచిస్తూ, నేలపైన కూర్చుని తలవంచుకుని ఉన్నది. ఆమె చుట్టూ భయంకరాకారం గల రాక్షస స్త్రీలున్నారు.

రావణుడు సీతను సమీపించి, “నీవు ఏ రాముణ్ణి చూసుకుని గర్విస్తున్నావో ఆ రాముడు యుద్ధరంగంలో చచ్చాడు. ఇక నీవు నా భార్యవు కాక గత్యంతరం లేదు. పాపం, ఆ రాముడు నన్ను చంపుదామని పెద్ద వానరసేనతో వచ్చి సముద్రపు ఉత్తర తీరాన విడిశాడు. అందరూ బడలి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న సమయంలో మా చారులు వెళ్ళి అన్ని సంగతులూ చూసి వచ్చారు. అప్పుడు మా ప్రహస్తుడు గొప్ప రాక్షస సేనతో వెళ్ళి, వానరసేన పై ఆయుధాల వర్షం కురిపించి, నిద్రపోతున్న రాముడి తల నరికేశాడు. లక్ష్మణుడూ, కొందరు వానరులూ తప్పించుకుని పారి పోయారు. సుగ్రీవుడూ, హనుమంతుడూ, జాంబవంతుడూ, అంగదుడూ మొదలైన వానర వీరులంతా చచ్చారు.” అన్నాడు,

అతను ఒక రాక్షస స్త్రీతో, “రాముడి శిరస్సును యుద్ధరంగం నుంచి తెచ్చిన విద్యుజ్జిహ్వుణ్ణి రమ్మను,” అన్నాడు. విద్యుజ్జిహ్వుడు రాముడి శిరస్సునూ, బాణాన్నీ తెచ్చి, రావణుడి ఆజ్ఞపై వాటిని సీత ముందుంచి చప్పున వెనక్కు వచ్చేశాడు.

తన ముందున్న తలలో కళ్ళూ, జుట్టూ, చూడామణి గుర్తించి సీత నిజంగా రాముడు చనిపోయాడనే అనుకుని దుఃఖ సముద్రంలో పడి కొట్టుకున్నది. ఆమె కైకేయిని తిట్టుకున్నది, తనను పెళ్ళాడటం చేతనే రాముడి కి దురవస్థ వచ్చిందని తనను తాను నిందించుకున్నది. తన తలను రాముడి తలతోనూ, తన శరీరాన్ని రాముడి శరీరంతోనూ చేర్చమని రావణుణ్ణి వేడుకున్నది.

అంతలోనే ద్వారపాలకుడు వచ్చి రావణుడితో, ప్రహస్తుడు మొదలైన మంత్రులందరూ రావణుడి దర్శనం కోసం వేచి ఉన్నట్టు చెప్పాడు. రావణుడు బయలుదేరి సభకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే రాముడి తలా, ధనుస్సు అంతర్థాన మయిపోయాయి.

విభీషణుడి భార్య అయిన సరమ సీత వద్దకు వచ్చి ఊరడిస్తూ, ” రాముడు వానర సేనతో సముద్రం దాటి దక్షిణ తీరానికి వచ్చాడు. ఆ సంగతి తెలిసే మంత్రులతో మాట్లాడటానికి రావణుడు పరిగెత్తి వెళ్ళాడు. రావణుడి మాయలు నమ్మకు,” అన్నది.

రావణు డక్కడ కొలువులో సభ చేసి తన సైన్యాధ్యక్షులతో, “భేరి వేసి రాక్షస సైన్యాలను ఆయత్త పరచండి. కారణం చెప్పవద్దు,” అన్నాడు. ఆ భేరి మోత సీతకూ, సరమకూ వినిపించింది. “చూశావా, రాక్షస సేనలు యుద్ధాని కప్పుడే కదులు తున్నాయి,” అన్నది సరమసీతతో. సీతకు ప్రాణం లేచి వచ్చింది.

సరమ సీతతో, “కావాలంటే నేనిప్పుడే రాముడి వద్దకు వెళ్ళి, నీవు క్షేమంగా ఉన్నా పని చెప్పి రాగలను. ఏమంటావు?” అని అడిగింది.

“నా కోరిక తీర్చాలని ఉన్నట్టయితే రావణుడేంచేస్తున్నాడో తెలుసుకుని రా.” అన్నది సీత.

నరమ వెళ్ళివచ్చి, ” రావణుడికి అతని తల్లీ, అవిద్దుడనే ముసలి మంత్రీ ఎంతగానో చెప్పారు, నిన్ను విడిచిపుచ్చమని అన్నారు. కాని రావణుడు వారి మాటలు వినక, తాను జీవించి ఉండగా నిన్ను విడవనని మంత్రులతో ఆలోచన చేస్తున్నాడు. ఇక అతనికి చావు తప్పదు,” అన్నది.

ఈ సమయంలో వానరసేనలు చేసే సింహనాదాలు దగ్గిరలో, భయంకరంగా విన వచ్చాయి. ఆ ధ్వనులు విని రాక్షసులు తెల్లబోయారు. రావణుడి సభలోని వారు కూడా వాటిని విన్నారు.

“రాముడు సముద్రందాటి రావటమూ, అతని బల పరాక్రమాలూ విని మీరంతా దిగాలుపడి పోవటం నేను గ్రహించాను,” అని రావణుడు సభికులతో అన్నాడు.

అప్పుడు రావణుడి తల్లి తాలూకు బంధు వైన మాల్యవంతుడనే వృద్ధ రాక్షసుడు, “రాజా, మన కన్న బలహీనుడితో -యుద్ధమూ, బలవంతుడితో సంధి చెయ్యా అన్నది రాజ నీతి. మన పక్షాన అధర్మం ఉన్నందున మనం బలహీనులంగా ఉన్నాం. అందుచేత మనం రాముడితో సంధి చేసు కుని, సీత సీతని కిచ్చివెయ్యటం యుక్తం. మన మధ్య కలహ కారణం సీతే గద. యుద్ధం నీకు కూడా క్షేమం కాదు. అనేక మందిచేత చావు లేకుండా వరం పొందావు గాని, ఇప్పుడు మన పైకి ఎత్తి వచ్చిన మనుష్యులూ, వానరులూ, కొండముచ్చులూ, ఎలుగుగొడ్డులూ మొదలైన వారిచేత చావు లేకుండా వరం పొంది ఉండలేదు. శకునాలేవీ బాగాలేవు,” అన్నాడు.

ఈ సలహా విని మండిపడి రావణుడు మాల్యవంతుడితో, “కోతులను వెంట బెట్టుకుని వచ్చిన రాముడు రాక్షస బలాలు గల నాకంటే ఎక్కువ బలం గల వాడని ఏ ఆధారంతో చెప్పావు? బెత్తెడు సముద్రానికి వారధి కట్టగానే రాముడు మహా బలుడయిపోయాడా? పని పెట్టుకుని సీతను తెచ్చుకున్న నేను రాముడికి భయపడిపోయి ఆమెను తిరిగి ఇచ్చెయ్యనా? ఒక వేళ రాముడు నా కన్న బలవంతుడైతే నా తల నరకని, అంతేగాని నేనతనికి లొంగిపోను. నా స్వభావానికి వ్యతిరేకం. తిరిగి ప్రాణాలతో వెనక్కెలా పోతామా అని రాముణ్ణి భయపడనీ,” అన్నాడు.

ఈ మాటలు విని మాల్యవంతుడు సిగ్గు పడి తల వంచుకున్నాడు. రావణుడు తన మంత్రులతో ఆలోచించి నగర రక్షణ ఏర్పాట్లు చేశాడు. దక్షిణ ద్వారాన మహోూ దర మహాపార్శ్వులుంచబడ్డారు. పడమటి ద్వారానికి ఇంద్రజిత్తు నియోగించబడ్డాడు. ఉత్తర ద్వారానికి శుకసారణులతో సహా రావణుడే స్వయంగా వెళ్ళాడు. తూర్పున ప్రహస్తుడుంచబడ్డాడు. విరూపాక్షుడు పట్టణ మధ్య ప్రాంతంలో అనేకమంది రాక్షస వీరులతో ఉండిపోయాడు.

లంకానగర రక్షణ గురించి రావణుడు చేసిన ఈ ఏర్పాట్లను విభీషణుడి నలుగురు మంత్రులూ పక్షి రూపాలలో వచ్చి తెలుసుకుని, తిరిగి వెళ్ళి విభీషణుడికి చెప్పారు. విభీషణుడా వివరాలను రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణ సుగ్రీవులతోనూ, హనుమంత జాంబవంతాది వీరులతోనూ సమాలోచన చేసి, లంకానగరం పైకి ఎలా దాడి చేయవలసినది నిర్ణయించాడు.

నీలుడు కొంత వానరసేనతో తూర్పు ద్వారానికి వెళ్ళి ప్రహస్తుడితో యుద్ధం చెయ్యాలి. అంగదుడు దక్షిణద్వారం వద్ద మహాపార్శ్వ, మహోదరులతో యుద్ధం చెయ్యాలి. హనుమంతుడు పడమటి ద్వారం పైకి పోతాడు. రావణుడు స్వయంగా రక్షించే ఉత్తర ద్వారం మీదికి రామ లక్ష్మణులు వెళ్ళాలని నిశ్చయమయింది. నగర మధ్యం లోని బలాలతో పోరాడవలసిన వారు సుగ్రీవుడూ, జాంబవంతుడూ, విభీషణుడూనూ. రాముడు పెట్టిన మరొక నియమమే మంటే యుద్ధం చేసేటప్పుడు రామ, లక్ష్మణ, నీల, అంగద, హనుమంత, సుగ్రీవులూ, విభీషణుడూ తప్ప మరెవరూ నరరూపాలు ధరించరాదు. గుర్తు తెలియగలందులకు వారు వానర రూపాలతోనే ఉండాలి.

ఈవిధంగా నిర్ణయం జరగగానే రాముడు సువేల పర్వతం పైకి దారి తీశాడు. అతని వెంట లక్ష్మణుడూ, సుగ్రీవుడూ, ఇతర వానర ప్రముఖులూ కొండ ఎక్కసాగారు. వారు సువేల పర్వతం పైకి చేరేసరికి లంకా నగరం ఎదురుగా కనిపించింది. ప్రాకారాల మీదా, ద్వారాల వద్దా నల్లని రాక్షసులు సాయుధులై, యుద్ధ సన్నద్ధులై నిలబడి ఉన్నారు. వారిని చూసి వానరులు సింహ నాదాలు చేశారు. ఆ సమయంలో సూర్యుడస్తమించి, పూర్ణచంద్రు డుదయించాడు.

రాముడు మొదలైన వారంతా సువేల పర్వతం పైన ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.

మర్నాడు ఉదయం వానరులు సువేలపర్వతం పైన ఉండే వనాలలో విహరించబోయారు. రాముడు లక్ష్మణుడితోనూ వానర ప్రముఖులతోనూ సువేల పర్వతం మీది నుంచి త్రికూట పర్వతం మీద నిర్మించి ఉన్న లంకానగరపు శోభను గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ నగరంలోని గొప్ప భవనాలూ, ప్రాకారాలూ, గోపురాలూ, రక్షణలూ అతనికి విస్మయం కలిగించాయి. అతనికి అప్పుడే రావణుడు కూడా కనిపించాడు. అతనికి వింజామరలు వీస్తు న్నారు, శ్వేతచ్ఛత్రం పట్టారు. మనిషి నల్లగా ఉన్నాడు. రక్త చందనం శరీరానికి పూసుకుని వెలలేని రత్నాభరణాలు ధరించి ఉన్నాడు. చాలా బరువైన ఎర్ర జరి బట్టలు కట్టుకున్నాడు.

అందరితో బాటు రావణుణ్ణి చూస్తున్న సుగ్రీవుడికి ఉన్నట్టుండి పట్టరాని కోపం వచ్చింది. అతను ఒక్క ఊపున నువేల పర్వత శిఖరం నుంచి రావణుడున్న గోపురం మీదికి దూకి, రావణుడికేసి తీక్షంగా చూసి, గాలిలోకి ఎగిరి రావణుడి కిరీటాన్ని తన్ని మళ్ళీ నేలపై వాలాడు. రావణుడు కోపంతో లేచి సుగ్రీవుణ్ణి తన చేతులతో పడదోశాడు. సుగ్రీవుడు బంతిలాగా పైకి లేచి రావణుణ్ణి పడదోశాడు. ఇద్దరూ కలియబడి చాలాసేపు భయంకరంగా కొట్టుకున్నారు. చివరకు రావణుడు అలిసి మాయా యుద్ధానికి దిగుదా మనుకుంటూండగా, ఆ సంగతి గ్రహించి సుగ్రీవుడు చప్పున ఆకాశంలోకి ఎగిరాడు. అతను మళ్ళీ వస్తాడని రావణుడనుకున్నాడు గాని, సుగ్రీవుడు తిరిగి రాముడి పక్కన వాలాడు.

రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించుకుని, “సుగ్రీవుడా, నీవు రాజువై ఉండి, ఇలాటి అపాయకరమైన పని తొందరపాటున చెయ్య గూడదు. మేమందరమూ చాలా కలత పడ్డాం. నీకు అపాయం జరిగి ఉంటే మా అందరి పనీ ఏమై ఉండేది?” అన్నాడు.

“నీ భార్య నెత్తుకు పోయిన ఆ దుర్మా ర్గుడు ఎదురుగా కనిపిస్తూంటే సహించ లేక పోయాను,” అన్నాడు సుగ్రీవుడు.

అప్పటి కప్పుడే అందరూ సువేల పర్వతం దిగి, వానరబలాలతో సహా త్రికూట పర్వతం ఎక్కారు. చూస్తుండగానే వానరులు లంకా నగరాన్ని ముట్టడించారు. రాముడు నిర్దేశించిన ప్రకారం ఏ ద్వారం వద్ద యుద్ధం చెయ్యవలసిన వానరయోధు లా ద్వారం వద్ద నిలబడ్డారు.

అప్పుడు రాముడు అంగదుణ్ణి పిలిచి, అంగదుడా, నీవు నిర్భయంగా లంకా ప్రాకారం దాటి, రావణుడుండే చోటికి వెళ్ళి, నా మాటలుగా ఇలా చెప్పు: రావణుడా, నా భార్యను అపహరించిన నిన్ను శిక్షించటానికి యముడులాగా నేను వచ్చాను. ఏ బలం చూసుకుని నన్ను మోసపుచ్చి సీతను ఎత్తుకు పోయావో ఆ బలాన్ని ఇప్పుడు చూపించు. నీవు సీతను తెచ్చి నాకు సమర్పించి నా శరణు వేడని పక్షంలో నిన్నూ, నీ రాక్షస కులాన్ని నాశనం చేసి, లంకకు విభీషణుణ్ణి రాజుగా చేస్తాను. మూర్ఖులను ఆశ్రయించి ఉన్న నీకు రాజ్యార్హత పోయింది. నన్ను శరణువేడని పక్షంలో నాతో యుద్ధానికి వచ్చి, నా చేత చచ్చి పవిత్రుడివికా!” అన్నాడు.

అంగదు డీ సందేశం పుచ్చుకుని ఆకాశం లోకి ఎగిరి లంకలో వాలి, రావణుడు తన ఇంట మంత్రులతో కూర్చుని మాట్లాడుతున్న చోటికి వెళ్ళి, రావణుడి పక్కన నిలబడ్డాడు. అతను రావణుడికి తానెవరో చెప్పుకుని, రాముడు చెప్పమన్న మాటలు, ఒక్క ముక్క పార్లు పోకుండా, రావణుడికి వినిపించాడు.

ఆ మాటలు వినేసరికి రావణుడు కోపం పట్టలేక, ” ఈ అంగదుణ్ణి చంపెయ్యండి,” అని మళ్ళీ మళ్ళీ కేకలు పెట్టాడు. నలుగురు రాక్షనులు అతన్ని పట్టుకుందామని వచ్చారు.

అంగదుడు వారిని దగ్గిరదాకా రానిచ్చి, వారిని తన చంకల్లో ఇరికించుకుని, ఒక్క ఎగురున రావణుడి ఇంటి ప్రాకారం మీదికి వెళ్ళి వాలాడు. కొండంత ఎత్తున్న ఆ ప్రాకారం మీద అతను వాలేటప్పుడు రాక్షసులు కింద పడిపోయారు.

ఆ ప్రాకారం మీద ఉన్న గోపురం అంగదుడి కంట పడింది. అంగదుడా గోపురాన్ని కాలితో ఒక్క తన్ను తన్నేసరికి అది విరిగి పడిపోయింది. అంగదుడు తన పేరు అందరికీ వినబడేటట్టు గట్టిగా చెప్పుకుని, ఎగిరి వెళ్ళి రాముడి చెంత వాలాడు.

ఇంతలో కొందరు రాక్షసులు వచ్చి, లంకను వానరసేనలు ముట్టడించిన సంగతి రావణుడికి చెప్పారు. రావణుడు అగ్రహావేశుడై తన నగరాన్ని ముట్టడించిన వానరులను చూడటానికై ప్రాసాదం మీదికి వచ్చాడు. వానరులు భూమినంతా ఆక్రమించి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు..

Leave a Reply